సార్వత్రిక సమరానికి సర్వం సిద్ధం | Sakshi
Sakshi News home page

సార్వత్రిక సమరానికి సర్వం సిద్ధం

Published Tue, May 14 2024 10:10 AM

సార్వత్రిక సమరానికి సర్వం సిద్ధం

నేటి ఉదయం 7 నుంచి

సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్‌

పోలింగ్‌ సామగ్రితో తరలిన సిబ్బంది

సాక్షి, రాజమహేంద్రవరం: సార్వత్రిక ఎన్నికల మహాసంగ్రామంలో కీలకమైన పోలింగ్‌ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. సోమవారం ఉదయం ఏడు నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్‌ జరగనుంది. జిల్లాలోని ఒక లోక్‌సభ, ఏడు శాసనసభ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల భవితవ్యాన్ని 16,23,149 మంది ఓటర్లు ఈవీఎంల ద్వారా నిర్దేశించనున్నారు. పునర్విభజన అనంతరం ఏర్పడిన నవ్య తూర్పు గోదావరి జిల్లాలో తొలిసారిగా జరుగుతున్న ఈ ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. జిల్లా వ్యాప్తంగా 1,577 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 15 వేల మంది పోలీస్‌, వివిధ శాఖల అధికారులను నియమించారు.

ఎన్నికల సిబ్బందికి ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు (ఈవీఎం), వీవీ ప్యాట్‌లు, ఇతర పోలింగ్‌ సామగ్రిని ఆయా పోలింగ్‌ సిబ్బందికి ఆదివారం అందజేశారు. మధ్యాహ్నం 3 గంటల వరకూ ఈ ప్రక్రియ జరిగింది. అనంతరం ఎన్నికల సిబ్బంది ఆయా పోలింగ్‌ కేంద్రాలకు బయలుదేరారు. వీరందరూ ఆయా కేంద్రాల్లో ఉదయం 5.30 గంటలకే విధులకు హాజరై పీడీఎంఎస్‌ యాప్‌లో వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. ముందుగా ఉదయం మాక్‌ పోలింగ్‌ నిర్వహించి, ఈవీఎంలు సక్రమంగా పని చేస్తున్నాయో లేదో గుర్తిస్తారు. ఎక్కడైనా ఈవీఎంలు సరిగ్గా పని చేయకపోతే మైక్రో అబ్జర్వర్ల ద్వారా మరో యూనిట్‌ ఏర్పాటు చేసేలా అదనంగా రెండు ఈవీఎంలు అందుబాటులో ఉంచారు. ఈవీఎంలలో లోపాలను ఎప్పటికప్పుడు సరి చేసేందుకు జిల్లాలో 21 మంది ఇంజినీర్లను అందుబాటులో ఉంచారు.

పోలింగ్‌ అనంతరం ఆయా నియోజకవర్గాల్లోని పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలను ఆయా కేంద్రాల నుంచి రాజానగరం సమీపంలోని ఆదికవి నన్నయ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూములకు తరలిస్తారు. ఈవీఎంలను స్వీకరించేందుకు వర్సిటీలో ప్రత్యేకంగా కేంద్రాలు ఏర్పాటు చేశారు. జూన్‌ 4న నన్నయ యూనివర్సిటీలోనే ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు.

వెబ్‌ నిఘా

పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకూ తావు లేకుండా వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఆయా పోలింగ్‌ కేంద్రాల వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు కలెక్టరేట్‌ నుంచి నేరుగా పర్యవేక్షించనున్నారు. పోలింగ్‌ కేంద్రాల బయట సైతం ఓటర్లు ఎటువంటి ప్రలోభాలకూ గురి కాకుండా నిఘా పెట్టారు. జిల్లాలో 375 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించారు. ఈ కేంద్రాల్లో ప్రత్యేక నిఘా కోసం మైక్రో అబ్జర్వర్లు, వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాటు చేశారు. దీంతో పాటు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

నేడు సెలవు

ఎన్నికల నేపథ్యంలో రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని అన్ని కార్యాలయాలకూ సోమవారం సెలవు ప్రకటిస్తూ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కె.మాధవీలత ఉత్తర్వులు జారీ చేశారు. దీని నుంచి జిల్లా ఖజానా, ఉప ఖజానా కార్యాలయాలు, అత్యవసర సేవల విభాగాలను మినహాయించారు.

ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి

పోల్‌ డే అంటే హాలిడే కాదు. ప్రజాస్వామ్య పండగ. ప్రతి ఒక్కరూ పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. అప్పుడు దీనికి సార్థకత. ప్రతి ఓటరూ పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లూ చేశాం.

– కె.మాధవీలత, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌

పటిష్టంగా బందోబస్తు

ఎన్నికలకు 1,700 మంది పోలీసు అధికారులు, సిబ్బంది, 10 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలతో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశాం. రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచి వారి కదలికలను పర్యవేక్షిస్తున్నాం. ఇప్పటి వరకూ 1,098 రౌడీ షీటర్లను, గత ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యకు కారకులైన 173 మందిని బైండోవర్‌ చేశాం. 178 లైసెన్స్‌డ్‌ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాం. సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్‌ కాస్టింగ్‌, పోలీసులతో నిఘా కట్టుదిట్టం చేశాం.

– కె.జగదీష్‌, జిల్లా ఎస్పీ

Advertisement
 
Advertisement
 
Advertisement