ఎలాంటివి రాస్తానో, అలాంటివే అనువదిస్తా! | Sakshi
Sakshi News home page

ఎలాంటివి రాస్తానో, అలాంటివే అనువదిస్తా!

Published Mon, Feb 6 2017 12:33 AM

ఎలాంటివి రాస్తానో, అలాంటివే అనువదిస్తా!

ఐదు ప్రశ్నలు
కొల్లూరి సోమ శంకర్‌ అనువాద కథల సంకలనం ‘నాన్నా!! తొందరగా వచ్చేయ్‌’ ఇటీవలే విడుదలైంది. ఆ సందర్భంగా ఈ ఐదు ప్రశ్నలు...

అనువాదాలు ఎందుకు చేస్తున్నారు?
నేను రచయిత, అనువాదకుడికన్నా ముందు పాఠకుడిని. తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీషు కథలు చదవడం అలవాటు. అందులో కొన్ని ఆర్ద్రంగా హృదయాన్ని తాకితే, మరికొన్ని గాఢంగా ఆలోచింపచేశాయి. అలాంటి కథలని తెలుగు పాఠకులతో పంచుకోవాలనే తపనతో అనువాదాలు మొదలుపెట్టాను. 2002 నుంచీ ప్రారంభించి, ఇప్పటివరకూ 112 కథలను అనువదించాను.

ఎలాంటి కథలు అనువదిస్తారు?
సార్వజనీనత కలిగి ఉండి, కథావస్తువు తెలుగు నేపథ్యానికి నప్పేలా జాగ్రత్త వహిస్తాను. ఈ కథలన్నీ నా ఆలోచనా ధోరణికి దగ్గరగా ఉన్నవే. నేను ఎలాంటి కథ రాస్తానో, అలాంటి కథలనే అనువాదాలకూ ఎంచుకుంటాను.

అనువాదం కోసం ఏ జాగ్రత్తలు తీసుకుంటారు?
భాషను యథాతథంగా మరోభాషలోకి తేవడం అనువాదం కాదనీ, భావానువాదం ముఖ్యమనీ నా అభిప్రాయం. మూలకథని ఆకళింపు చేసుకుని – తెలుగు కథే చదువుతున్నామా అనిపించేలా జాగ్రత్తపడతాను. మూల కథలో ఏ సెన్స్‌తో ఉపయోగించారో అటువంటి అర్థమిచ్చే తెలుగు పలుకుబడులు ఉంటే అవే ఉపయోగిస్తాను. లేదా ఆ సందర్భానికి తగినట్లుగా ఆ వాక్యాలను సమ్మరైజ్‌ చేయడమో లేదా ఆ అర్థం స్ఫురించేటట్లు తెలుగులో రాయడమో చేస్తాను.

మూలరచయితలతో ఎలాంటి పరిచయం ఉంటుంది?
నా అదృష్టం ఏంటంటే నేను అనువదించిన ఇతర భారతీయ భాషల కథలను చాలావరకూ మూల రచయితలే ఆంగ్లంలోకి అనువదించడం! తద్వారా "Losses in Translation'' బాగా తగ్గాయి. నేను అనువదించినవి ఇంటర్‌నెట్‌ నుంచి సేకరించినవే. తద్వారా నాకు లభించిన సౌలభ్యం మూల రచయితలతో ఈ–మెయిల్‌ పరిచయం! అనువాద క్రమంలో అవరోధాలు ఎదురైతే, మూల రచయితలను సంప్రదిస్తాను. వారి వివరణలతో నా సమస్య తీరిపోతుంది.

అనువాదాలు చేస్తుంటే మీ సొంత సృజన తగ్గిపోతుందా?
కథని క్రిస్ప్‌గా చెప్పగలగడం; సంభాషణలను ఎఫెక్టివ్‌గా రాయగలగడం వంటివి నాకు అనువాదాలు చేయడం వల్ల అలవడ్డాయి. అనువాదాలలో ఇతివృత్తం, సన్నివేశాల కల్పన, సంభాషణలు అన్నీ రెడీమేడ్‌గా ఉంటాయి. కథలోని మూడ్‌ని గ్రహించి, కథకుడి టోన్‌ని పట్టుకుంటే చాలు, తెలుగులో చక్కని కథ సిద్ధమవుతుంది. సొంత కథల విషయంలో అన్నీ మనమే సమకూర్చుకోవాలి. అందువల్ల సొంత కథలు రాయడం ఆలస్యం అవుతుంది.

(కొల్లూరి సోమ శంకర్‌ ఫోన్‌: 9848464365)

Advertisement
Advertisement