‘నోబెల్’కు నగుబాటు! | Sakshi
Sakshi News home page

‘నోబెల్’కు నగుబాటు!

Published Fri, Oct 21 2016 12:51 AM

‘నోబెల్’కు నగుబాటు! - Sakshi

నోబెల్ సాహిత్య బహుమతిని మేటి పాటగాడు బాబ్ డిలన్‌కు ప్రకటించి వారం రోజులు గడుస్తున్నా ఆయన నుంచి ఏ జవాబూ లేక తలకొట్టేసినట్టయిన నోబెల్ కమిటీకి అమెరికా అధ్యక్షుడు ఒబామా రూపంలో మరో ఝలక్ తగిలింది. 2009లో తనను నోబెల్ శాంతి బహుమతికి ఎందుకు ఎంపిక చేశారో ఇప్పటికీ తెలియదని ఒక ఇంటర్వ్యూలో ఆయన ఇచ్చిన సమాధానం... ఆ కమిటీ తీరు తెన్నుల గురించి ఎన్నాళ్లనుంచో వస్తున్న విమర్శలకు బలం చేకూర్చింది. ఏమాట కామాటే చెప్పుకోవాలి. పురస్కార గ్రహీతల యోగ్యతాయోగ్యతల మాట అటుంచి... అలా ఎంపికైనవారిని ఎవరైనా అభినందిస్తారు. అలాగని అత్యధికుల అంచనాలకు దీటుగా లేని సందర్భాల్లో విమర్శలు రావడం కూడా సర్వసాధారణం.

కానీ ఒబామాకు శాంతి బహుమతిని ప్రకటించాక విస్తుపోతూ ప్రకటనలు చేసిన వారే అధికం! మార్టిన్ లూథర్‌కింగ్ జూనియర్, మదర్ థెరిసా, దలైలామా వంటి దిగ్గజాల సరసన ఆయనను కూర్చోబెట్టడమేమిటని కొందరు ఆగ్రహించారు కూడా! వీటన్నిటా సహేతుకత ఉంది. నోబెల్ బహుమతి ప్రకటించేనాటికి ఒబామా అధ్యక్ష పదవీ బాధ్యతలు స్వీకరించి తొమ్మిది నెలలు మాత్రమే అయింది. నోబెల్ శాంతి బహుమతికి నామినేషన్లు పంపడానికి గల తుది గడువునాటికైతే ఆయన అధికారంలోకొచ్చి పట్టుమని పక్షం రోజులు కూడా కాలేదు. ఆ రెండు వారాల్లో నోబెల్ కమిటీ ఆయనలో ఏం సుగుణాలు చూసిందో, ప్రపంచశాంతి స్థాపన కోసం ఆయన ఏం చేశారనుకున్నదో తెలియదు. తనను ఆ పురస్కారానికి ఎంపిక చేయ డాన్ని స్వాగతిస్తూ ‘విశ్వమానవాళి ఆకాంక్షల పరిరక్షణలో అమెరికా నిర్ణయాత్మక పాత్రను ఈ బహుమతి ధ్రువీకరిస్తున్నద’ంటూ ఒబామా అప్పట్లో గొప్పలుపో యారు. ఎనిమిదేళ్లు గడిచాకైనా ఆయన నిజం పలికారనుకోవాలి!
 
ఒబామాకు నోబెల్ బహుమతి ఇవ్వడానికి ‘కేవలం ఆయన బుష్ కాకపోవ డమే’ కారణమని అప్పట్లో ఒకరు వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యానంలో వాస్తవం ఉంది. నోబెల్ కమిటీకి ఎందుకనో జార్జ్ బుష్ పొడగిట్టదు. పదవిలో ఉన్నప్పుడు, దిగిపోయాక కూడా ఆయనంటే తీవ్ర వ్యతిరేకత ఉండేది. ఆయన వ్యతిరేకులన్న ముద్ర ఉంటే శాంతి బహుమతి ఇచ్చేవారన్న విమర్శ ఉండేది. అందుకు కొన్ని రుజువులున్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ కు 2002లో శాంతి పురస్కారాన్ని ప్రకటించేనాటికి ఆయన బుష్‌కు వ్యతిరేకంగా... మరీ ముఖ్యంగా అప్పట్లో జరిగిన ఉగ్రదాడిపై బుష్ స్పందించిన తీరును దుయ్యబట్టారు. పదవీ విరమణ చేశాక ఆయన స్థాపించిన ఫౌండేషన్ హైతీ, బోస్నియా తదితర దేశాల్లో శాంతి స్థాపనకు, ఇజ్రాయెల్-పాలస్తీనాలమధ్య శాంతి చర్చలు ఫలవంతం కావడా  నికి తోడ్పడిందని నోబెల్ కమిటీ చెప్పినా అసలు సంగతి ఆయనలో ఉన్న బుష్ వ్యతిరేకతే అంటారు.

అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అఫ్ఘాన్‌లో ముజాహిదీన్లకు ఆయు ధాలందించి, ఈనాటి ఉగ్రవాదానికి బీజం వేసింది కార్టరే. దేన్నయినా సాధించార నుకున్న సందర్భంలోనే ఏ బహుమతైనా ఇవ్వడం సంప్రదాయం. ఇవ్వదల్చుకున్న వారికి అలాంటి గొప్పదనం ఆపాదించడంలో నోబెల్ కమిటీ ఆరితేరింది. 1919లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్‌కు, 1973లో ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి హెన్రీ కిసింజర్‌కు శాంతి బహుమతి ప్రకటించినప్పుడు నోబెల్ కమిటీ వారిని ఆకాశానికెత్తింది.

యుద్ధోన్మాదులుగా వారి చరిత్రను మరుగుపరచాలని చూసింది. కానీ ఒబామా విషయంలో ఆపాటి కష్టమైనా పడకుండా బహుమతిని ప్రకటించి రికార్డు సృష్టించింది. ప్రశంసా వాక్యాల్లో శాంతి సాధనకు ఒబామా చేసిన దేమిటో ప్రస్తావించకుండా, కేవలం‘ప్రయత్నాలను’ మెచ్చుకోవడంతో సరి పెట్టింది. కనీసం ఆ ప్రయత్నాలు దేనికి దారితీస్తాయో, ఒకవేళ అవి విఫలమైన పక్షంలో ఆయన వైఖరి ఎలా ఉండబోతున్నదో తెలుసుకోవాలన్న స్పృహ కూడా నోబెల్ కమిటీకి లేకపోయింది. హడావుడి పడకుండా మరికొన్నాళ్లు ఆగి ఉంటే ఆ ‘ప్రయత్నాల’ అసలు రంగు కూడా వెల్లడయ్యేది.

బుష్ ప్రారంభించిన యుద్ధాలను ఒబామా మరింత ముందుకు తీసుకెళ్లారు. కొత్త యుద్ధ రంగాలనూ తెరిచారు. ‘ఆయనకు శాంతి పురస్కారం ఇవ్వడం ఘోర తప్పిదమే’నని ఆ సమయంలో నోబెల్ కమిటీ కార్యదర్శిగా పనిచేసిన గీర్ లెండ్‌స్టెడ్ నిరుడు అంగీకరించారు. లిబియాపై బాంబుల వర్షం, సిరియాలో వరస దాడులు ఎన్ని వేలమంది ప్రాణాలు తీశాయో ఎవరూ మరిచిపోలేరు. అఫ్ఘానిస్తాన్, సోమాలియా, పాకిస్తాన్ తదితర చోట్ల ఉగ్రవాదుల్ని గురిపెట్టామనుకుని సాధారణ పౌరులను వందల్లో హతమా ర్చారు. ప్రపంచంలో ప్రశాంతత నెలకొల్పుతామని అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో చెప్పిన ఒబామా ఆ తర్వాత సరిగ్గా అందుకు విరుద్ధమైన నిర్ణయాలు తీసుకున్నారు. కనీసం నోబెల్ శాంతి పురస్కారం వచ్చినందుకైనా అందుకు తగినట్టు ప్రవర్తించా లని ఆయన అనుకోలేదు.
 
మహాత్మా గాంధీకి నోబెల్ ఇవ్వాలంటూ అయిదు దఫాలు నామినేషన్లు వెళ్లినా నోబెల్ కమిటీ పట్టనట్టు ఉన్న సంగతిని ఎవరూ మర్చిపోరు. 1948లో ఆయనకు శాంతి బహుమతి ప్రకటిద్దామనుకుంటుండగా గాంధీజీ హత్య జరిగిందని అది ఇచ్చిన సంజాయిషీలో నిజమెంతో తెలియదు. మరణానంతరం ఇచ్చే సంప్రదాయం లేదని అప్పట్లో చెప్పింది. కానీ స్వీడన్ మంత్రిగా, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన దాగ్ హమర్‌స్కోల్డ్‌కు 1961లో మరణానంతరం శాంతి పురస్కారం ఇచ్చింది.

ఒక్క శాంతి బహుమతి విషయంలోనే కాదు...ఇతర రంగాల్లో ఇచ్చే పురస్కారాల విషయంలో సైతం కమిటీపై ఇలాంటి విమర్శలే ఉన్నాయి. ఈసారి ప్రకటించిన పురస్కారాల్లో ఒక్కరంటే ఒక్కరైనా మహిళ లేక పోవడాన్ని చాలామంది విమర్శించారు. అర్హులు లేరని కాదు. అనేకమంది మహి ళల పేర్లు నోబెల్ కమిటీ పరిశీలనకొచ్చాయి. అయినా పట్టించుకోలేదు. ఈసారి మన శాస్త్రవేత్త ప్రొఫెసర్ సీఎన్‌ఆర్ రావు కనుగొన్న అంశాలకు అనుకూలంగా అత్యధిక నామినేషన్లు వెళ్లినా కమిటీ పరిగణించలేదు. భవిష్యత్తులోనైనా ఇలాంటి తడబాట్లకు నోబెల్ కమిటీ స్వస్తి చెప్పడానికి ఒబామా ‘ఒప్పుకోలు’ ప్రకటన పనికొస్తే మంచిదే!
 

Advertisement

తప్పక చదవండి

Advertisement