చింత తీర్చుతున్న చిన్న ట్రాక్టర్!

చింత తీర్చుతున్న చిన్న ట్రాక్టర్!


 కాడెద్దుల స్థానాన్ని ట్రాక్టర్లు ఆక్రమించాయి. కానీ ట్రాక్టర్ల ధరలు అధికంగా ఉండటంతో చిన్న రైతులు కొనలేని పరిస్థితి. పెద్ద రైతులు తమ పనులయ్యాక అద్దెకిచ్చే వరకు అదను దాటుతున్నా.. వేచి ఉండక తప్పని పరిస్థితి చిన్న రైతులను వేధిస్తోంది. ఈ సమస్యకు యువ రైతు రమేష్ తనకు తోచిన పరిష్కారం వెతికాడు. విడి భాగాలను కొని తెచ్చి తన అవసరాలకు సరిపోయే చిన్న ట్రాక్టర్‌ను రూపొందించుకొని ఉపయోగిస్తూ పదుగురి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు.




 విత్తనం విత్తేందుకు పొలాన్ని సిద్ధం చేసేందుకు మొదలుకొని, చేతికొచ్చిన పంటను తడవకుండా ఇంటికి చేర్చేవరకూ ప్రతి పనిలోనూ ట్రాక్టర్ అత్యవసరంగా మారింది. దీంతో చిన్న రైతులు తమ పనులు మానుకొని ట్రాక్టర్ల కోసం తిరగాల్సిన పరిస్థితి. ఈ సవాళ్లను అధిగమిస్తూ.. బహుళ ప్రయోజనాలు గల మినీ ట్రాక్టర్ ను రూపొందించా డు గుంటూరు జిల్లా మాచవరం గ్రామానికి చెందిన రైతు శాస్త్రవేత్త పేరం రమేష్.




 రమేష్‌ది వ్యవసాయ కుటుంబం. ఐటీఐ(ఎలక్ట్రీషియన్) పూర్తిచేసి తనకున్న రెండెకరాల పొలంలో పత్తి సాగు చేస్తున్నాడు. ఖాళీ సమయంలో ఇతరుల ట్రాక్టర్‌పై డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తన పొలం ఊరికి 13 కి.మీ. దూరంలో ఉండటంతో ఎద్దులను తోలుకెళ్లడానికి చాలా సమయం పట్టేది. ఎద్దులు కూడా అలసిపోయేవి. ఆ ఇబ్బందులను అధిగమించే ప్రయత్నంలో మినీ ట్రాక్టర్ తయారీకి సంబంధించిన ఆలోచన రమేష్ మదిలో మెదిలింది. ఆ ఆలోచన ఏడాది కాలంలో కార్యరూపం దాల్చింది. విడిభాగాలు కొనితెచ్చి తొలుత హ్యాండిల్‌తో నడిచే ట్రాక్టర్‌ను తయారు చేశాడు. కొన్ని మార్పులు చేసిన తర్వాత సంతృప్తికరమైన మినీ ట్రాక్టర్ సిద్ధమైందని రమేష్ ఆనందంగా చెప్పాడు. రూ. 40 వేల ఖర్చయింది. రోజూ ఈ ట్రాక్టర్‌ను నడుపుకుంటూ వెళ్లి, పొలం పనులు చక్కబెట్టుకొని వస్తున్నాడు.  

 ఆటో ఇంజిన్‌తో డీజిల్ ఆదా

 ఈ మినీ ట్రాక్టర్ వంద కిలోల బరువుంటుంది. వెడల్పు 26 1/2 అంగుళాలు, ఎత్తు రెండున్నర అడుగులు, పొడవు 3 1/2 అడుగులు ఉంటుంది. ఇది రోడ్డుపై గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీని తయారీలో 7.5 హెచ్.పీ ఆటో ఇంజిన్‌ను వాడటంతో మంచి మైలేజీ వస్తున్న దంటున్నాడు రమేష్. ట్రాక్టర్‌కు ముందువైపు స్కూటర్ టైర్లను, వెనుక వైపు ఆటో టైర్లను బిగించాడు. డీజిల్ ఇంజిన్ ట్యాంక్‌ను, ఇంజిన్‌తో గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేయడానికి బుల్లెట్ చైన్ స్పాకెట్‌ను వాడాడు. సెల్ఫ్ రేజ్‌పై పొలం దున్నడం దీని ప్రత్యేకత!

 రూ. 50 ఖర్చుతో ఎకరంలో పైపాటు

 రమేష్ అనుభవం ప్రకారం.. ఈ మినీ ట్రాక్టర్‌తో మెట్ట పైర్లలో విత్తనాలు విత్తేందుకు అచ్చు తోలవచ్చు. గొర్రు, గుంటకలను ఉపయోగించి పైపాటు చేయవచ్చు.  నీళ్లు పారించేందుకు బోదెలు తోలవచ్చు. మినీ ట్రాక్టర్ రూ. 50ల డీజిల్ ఖర్చుతో ఎకరంలో పైపాటు చేసుకోవచ్చు. బత్తాయి, జామ, నిమ్మ వంటి ఉద్యాన పంటల్లోని పాదుల్లో కలుపును తొలగించవచ్చు. ఒక బ్రేక్‌ను తొక్కిపట్టి ట్రాక్టర్‌ను చెట్టు చుట్టూ తిప్పుతూ.. కలుపును నిర్మూలించవచ్చు. దీని ఎత్తు తక్కువగా ఉండటం వల్ల పందిరి కూరగాయల తోటల్లోనూ పైపాటు చేయవచ్చు. పెద్ద ట్రాక్టర్‌కుమల్లే ఎక్కువ లోతు దున్నకం చేయవచ్చు. పంప్‌సెట్ బిగించి బావి నుంచి నీరు తోడవచ్చు. ఎకరం పత్తిలో గొర్రు దున్నేందుకు పెద్ద ట్రాక్టర్‌కు మూడు లీటర్ల డీజిల్ ఖర్చవుతుంది. ఈ మినీ ట్రాక్టర్‌కు లీటర్ డీజిల్ సరిపోతుంది. గుంటక తోలడానికి మాత్రం ముప్పావు లీటరు డీజిల్ చాలు. గంటకు ఎకరంన్నర పొలంలో పైపాటు చేయవచ్చు. ఇంజిన్ ఆయిల్ మార్చుకోవటం తప్ప నిర్వహణ ఖర్చు పెద్దగా ఏమీ లేదు.  సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటున్న రమేష్ అభినందనీయుడు.

 - మస్తాన్ వలీ, మాచవరం,

 గుంటూరు జిల్లా.

 వ్యవసాయ పనులన్నీ చేసుకోవచ్చు..!

 పెద్ద ట్రాక్టర్లతో పోలిస్తే ఇది చాలా చవక. దాదాపు అన్ని రకాల సేద్యపు పనులు చేసుకోవచ్చు. రైతులెవరైనా కావాలంటే తయారు చేసి ఇస్తాను. స్టీరింగ్, హైడ్రాలిక్ వ్యవస్థను ఏర్పాటు చేయటానికి మరో రూ. 30 వేలు అవసరమవుతుంది. దమ్ము చక్రాలు, సరుకు రవాణా కోసం ట్రక్కుతో పాటు మనుషుల అవసరం లేకుండా  విత్తనం, ఎరువులు ఎదబెట్టే పరికరాలను తయారు చేయాలనుకుంటున్నాను.

 - పేరం రమేష్ (99899 83705), యువ రైతు శాస్త్రవేత్త, మాచవరం, గుంటూరు జిల్లా.

Read latest Vanta-Panta News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top