'ఆడపిల్ల పుడితే ఫీజు తీసుకోం' | Sakshi
Sakshi News home page

'ఆడపిల్ల పుడితే ఫీజు తీసుకోం'

Published Mon, Nov 23 2015 2:02 PM

'ఆడపిల్ల పుడితే ఫీజు తీసుకోం'

పుణే: అతడో మంచి డాక్టర్. తన పరిధిలో మంచి పనులు చేస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. లింగవివక్షను రూపుమాపేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన పేరు గణేశ్ రాఖ్. మహారాష్ట్రలోని పుణేలో హదాప్సర్ ప్రాంతంలో ఆయనకు ఆస్పత్రి ఉంది. ఇందులో కాన్పు చేసుకున్న మహిళలకు ఆడపిల్ల పుడితే ఆయన ఫీజు తీసుకోరు. సాధారణ ప్రసవానికి రూ.10 వేలు, సిజేరియన్ కు రూ.25 వేలు తీసుకుంటారు. కానీ ఆడపిల్ల పుట్టిన దంపతుల నుంచి రూపాయి కూడా తీసుకోరు. పాప పుడితే ఆస్పత్రి సిబ్బంది స్వీట్లు, కేసులు పంచుతారు. ఇప్పటివరకు ఆయన 432 మంది మహిళలకు ఉచితంగా వైద్య సేవలు అందించారు.

'ప్రసవ సమయంలో పుట్టేది బాబా, పాపా అని తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటారు. అబ్బాయి పుడితే ఆనందపడతారు. అమ్మాయి పుడితే బాధపడతారు. అబ్బాయి పుడితే ప్రసవ బాధలను కూడా మర్చిపోయి మురిసిపోతారు. ఆడపిల్ల అయితే కన్నీరుమున్నీరవుతారు. ఇది నిజంగా బాధాకరం. లింగ వివక్షను రూపుమాపాలని నా వంతు ప్రయత్నంగా 2007 నుంచి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నా' అని డాక్టర్ గణేశ్ రాఖ్ తెలిపారు. ప్రజల ఆలోచనా విధానం మారాలని ఆయన అన్నారు. ఆడపిల్ల వద్దనుకునే తల్లిదండ్రులకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్ కూడా నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఆయన ఆస్పత్రి వెబ్ సైట్ ద్వారా కూడా ఆడపిల్ల రక్షణ కోసం ప్రచారం నిర్వహిస్తున్నారు.

Advertisement
Advertisement