దటీజ్ మున్నాభాయ్ ఎస్సెస్సీ | Sakshi
Sakshi News home page

దటీజ్ మున్నాభాయ్ ఎస్సెస్సీ

Published Wed, Aug 5 2015 3:03 PM

దటీజ్ మున్నాభాయ్ ఎస్సెస్సీ

ముంబై: సందీప్ బచ్చే. అలియాస్ మున్నాభాయ్ ఎస్సెస్సీ. ఆటోరిక్షా ఓనర్ కమ్ డ్రైవర్. ఆయన ఆటోరిక్షాలో టెలిఫోన్, వైఫై, ఎల్‌సీడీ స్క్రీన్, న్యూస్ పేపర్లు, మ్యాగజైన్ స్టాండ్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, అగ్నిమాపక పరికరం తదితర సౌకర్యాలన్నీ ఉన్నాయి. అంతేకాదు, తన ఆటో ఎక్కేవారికి  చల్లటి మంచినీళ్లు ఇవ్వడానికి వాటర్ బాటిళ్లు, వేడి వేడి ఛాయ్ సర్వ్ చేయడానికి ఫ్లాస్క్ ఉన్నాయి. ఆయన చొక్కాపై సందీప్ బచ్చే, మున్నాభాయ్ ఎస్సీస్సీ అనే నేమ్ ప్లేటు, ఆటో వెనకాల సెవెన్ స్టార్ సౌకర్యాలను సూచించే స్టిక్కర్ ఉంటాయి. ముంబైలో అతను కూల్ ఆటోడ్రైవర్‌గా సుపరిచితుడు. అంతకన్నా బంగారం లాంటి మనసున్న మనిషి.

కేన్సర్ రోగుల చికిత్సకు రెగ్యులర్‌గా విరాళాలిస్తాడు. పండ్లు, ఫలహారాలు పంచుతాడు. వారికి అవసరమైన దుస్తులు పంపిణీ చేస్తాడు. అందుకోసం విరాళాలు సేకరించేందుకు తన ఆటో వెనకాల ఓ హుండీని ఏర్పాటు చేశాడు. తన ప్రతి ట్రిప్పులో ప్రయాణికుల నుంచి వచ్చే చార్జీలో తనవంతుగా రెండు రూపాయలను తీసి హుండీలో వేస్తాడు. ప్రయాణికుల విరాళాలను వారి చిత్తానికే వదిలేస్తాడు. అలా వచ్చిన సొమ్మును నెలకోసారి వెళ్లి ముంబైలోని టాటా మెమోరియల్ హోస్పిటల్‌కు, మౌంట్ మేరీ చర్చికి అందజేస్తాడు. ప్రతి ఆదివారం వివిధ ఆస్పత్రుల్లోని  కేన్సర్, కిడ్నీ రోగులకు పండ్లు, ఫలహారాలు, దుస్తులు పంచుతూ కనిపిస్తాడు. ఆదివారం ఉదయం నుంచే రోగుల కోసం ఇంటింటికెళ్లి దుస్తులు సేకరిస్తాడు. తన తల్లి కేన్సర్ తో చనిపోవడంతో వేరెవరూ ఇలా ఇబ్బంది పడకూడదని ఇదంతా చేస్తున్నాడు.

అంతేకాకుండా రోడ్డుపై తాను ఆటో నడుపుతుండగా కనిపించిన ప్రతి యాక్సిడెంట్ సీన్ వద్దకు వెళతాడు. ఆ యాక్సిడెంట్‌లో గాయపడ్డవాళ్లకు తన వద్దనున్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసి అవసరమైన ప్రాథమిక చికిత్స చేస్తాడు. ఆ సమయంలో తన ఆటోలో ఎవరైనా ప్రయాణికులుంటే వారు చికాకు పడకుండా వేడివేడి ఛాయ్‌తో వాళ్లను కూల్ చేస్తాడు. దటీజ్ మున్నాభాయ్ ఎస్సెస్సీ.

Advertisement

తప్పక చదవండి

Advertisement