ఆస్పిరిన్‌ మాత్రలతో క్యాన్సర్‌ మాయం! | Sakshi
Sakshi News home page

ఆస్పిరిన్‌ మాత్రలతో క్యాన్సర్‌ మాయం!

Published Mon, Apr 10 2017 6:52 PM

ఆస్పిరిన్‌ మాత్రలతో క్యాన్సర్‌ మాయం!

ప్రాణాంతకమైన క్యాన్సర్‌ జబ్బును తలనొప్పికి వాడే ఆస్పిరిన్‌ అనే చౌకైన మాత్రలతో నయం చేయొచ్చని మద్రాస్‌ ఐఐటీకి చెందిన పరిశోధక బృందం చెబుతోంది. ఆస్పిరిన్‌ మాత్రల్లోని క్యాల్షియం అయాన్లు క్యాన్సర్‌ కణాల్లోని మైటోకాండ్రియాల్లోకి వెళతాయని, అక్కడ అవి ఆహారాన్ని ఇంధనంగా మార్చకుండా మైటోకాండ్రియాను అడ్డుకుంటాయని, పర్యవసానంగా క్యాన్సర్‌ కణాలకు ఇంధనం అందక అవి మరణిస్తాయని పరిశోధక బృందానికి నేతృత్వం వహించిన బయోటెక్నాలజీ ప్రొఫెసర్‌ అమల్‌ కాంతి బోరా మీడియాకు తెలిపారు. అయితే మరింత సమర్థంగా పనిచేసేలా ఆస్పిరిన్‌ మందును అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.

క్యాన్సర్‌ను శాశ్వతంగా నివారించేందుకు మందులు లేవని, మందుతో రోగి జీవితకాలాన్ని మాత్రమే పొడిగించవచ్చని, క్యాన్సర్‌ చికిత్స చాలా ఖరీదైనదనే అపోహలు పలు దేశాల ప్రజల్లో ఉన్నాయి. వీటిని పెంచి పోషిస్తున్న కార్పొరేట్‌ ఆస్పత్రులు రోగుల నుంచి చికిత్స పేరిట కోట్లాది రూపాయలను గుంజుతున్నాయి. బీ–17 లోపం వల్లనే క్యాన్సర్‌లు వస్తాయని, వాటిని అరికట్టడం కూడా తేలికేనని కూడా ఇటీవల కొంతమంది నిపుణులు ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ నిజంగానే ఆస్పిరిన్‌ మాత్రలతో క్యాన్సర్‌ను నయం చేయవచ్చన్నది పూర్తిస్థాయిలో రుజువైతే.. అది  వైద్య చరిత్రలో పెద్ద ముందంజ అవుతుంది. భారత జాతీయ వైద్య మండలి లెక్కల ప్రకారం 2016 నాటికి దేశంలో 14.5 లక్షల మంది క్యాన్సర్‌ రోగులు ఉన్నారు. వీరి సంఖ్య 2020 నాటికి 17 లక్షలకు చేరుకుంటుందన్నది ఓ అంచనా.

Advertisement

తప్పక చదవండి

Advertisement