టీఆర్‌ఎస్‌ నేత దారుణహత్య | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ నేత దారుణహత్య

Published Fri, Jul 14 2017 3:14 AM

TRS Corporater Anisetti Murali Brutal Murder

వరంగల్‌ కార్పొరేటర్‌ మురళిని వేట కొడవళ్లతో నరికిన ప్రత్యర్థులు
పంచాయితీ పేరుతో ఇంట్లోకి ప్రవేశం
ఆఫీసులో చర్చిస్తూనే హఠాత్తుగా దాడి
చేతులు, తలపై వేట్లతో కుప్పకూలిన మురళి.. తాపీగా బైకులపై వెళ్లిపోయిన దుండగులు
దారి పొడవునా వేట కొడవళ్లు గాల్లో తిప్పుతూ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయిన వైనం


సాక్షి, వరంగల్‌: గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌ 44వ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ అనిశెట్టి మురళీ మనోహర్‌ (45) దారుణ హత్యకు గురయ్యారు. గురువారం సాయంత్రం 6:30 సమయంలో ఆయన్ను సొంత ఇంట్లోనే ప్రత్యర్థులు వేట కొడవళ్లతో విచక్షణారహితంగా నరికి చంపారు. అనంతరం హత్యాయుధాలను దారి పొడవునా గాల్లో తిప్పుతూ బైకులపై హన్మకొండ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు!

పంచాయితీ పేరుతో వచ్చారు...
మురళి హన్మకొండ బుద్ధభవన్‌ ప్రాంతంలో నివసిస్తున్నారు. కుటుంబంతో సహా ఇంటి కింది భాగంలో ఉంటూ పై భాగంలో ఒక గదిని కార్యాలయంగా ఉపయోగిస్తున్నారు. గురువారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో పంచాయితీ చేయాలంటూ రేగుల చిరంజీవి అనే వ్యక్తి తొలుత మురళిని సంప్రదించాడు. అతన్ని పైన ఆఫీసులో కూర్చొమ్మని చెప్పి, మురళి స్నానం చేసి మేడపైకి వెళ్లినట్టు తెలుస్తోంది. తర్వాత బొమ్మతి విక్రం, మార్త వరుణ్‌ బాబు అనే మరో ఇద్దరు కూడా ఆఫీసులోకి వెళ్లారు. వెళ్తూనే మురళితో వాగ్వాదానికి దిగారు. ఆ వెంటనే విక్రం, వరుణ్‌Š, చిరంజీవి ముగ్గురూ తమ వెంట తెచ్చుకున్న వేట కొడవళ్లతో మురళిపై దాడి చేశారు. విచక్షణారహితంగా నరికారు. ప్రాణభయంతో మురళి చేతులు అడ్డుగా పెట్టడంతో రెండు చేతులకూ లోతైన గాయాలయ్యాయి. అనంతరం తలపైనా వేట్లు వేయడంతో ఆఫీసు గదిలోనే ఆయన కుప్పకూలిపోయారు.

26 ఏళ్ల పగ తీరిందంటూ నినాదాలు
దాడి అనంతరం నిందితులు ముగ్గురూ తాపీగా మేడపై నుంచి దిగారు. ‘నా తండ్రిని చంపిన వాణ్ని చంపాం. మా 26 ఏళ్ల పగ తీరింది’ అని నినాదాలు చేస్తూ బైకులపై వెనుదిరిగారు. దారి పొడవునా వేట కొడవళ్లు గాల్లో తిప్పుతూ వెళ్లి హన్మకొండ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. స్థానికులు వెళ్లి చూడగా మురళి రక్తపు మడుగులో పడి ఉన్నారు. కుటుంబ సభ్యులు, స్థానికులు, పోలీసులు హుటాహుటిన మాక్స్‌కేర్‌ ఆస్పత్రికి తరలించారు. అప్పటికి ఆయన శ్వాస తీసుకుంటుండంతో డాక్టర్ల బృందం చికిత్స ప్రారంభించింది. కాసేపటికి మురళి శరీరం స్పందించకపోవడంతో మరణించినట్లుగా నిర్ధారించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

కేయూకు తరలింపు
మారణాయుధాలతో సహా లొంగిపోయిన నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి కేయూ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మురళి హత్య నగరమంతా దావానలంలా వ్యాపించింది. మురళి నివాసం వద్ద జనం భారీగా గుమిగూడారు. మాక్స్‌కేర్‌ ఆస్పత్రికి అభిమానులు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, తాటికొండ రాజయ్య, తెలంగాణ మహిళా ఆర్థిక సహకార సంస్థ చైర్‌పర్సన్‌ గుండు సుధారాణి ఆస్పత్రికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు.

పాత కక్షలే కారణం
మురళిపై దాడికి పాత కక్షలే కారణమని తెలుస్తోంది. 1990ల్లో కుమార్‌పల్లిలో స్థానిక కాంగ్రెస్‌ నేత బొమ్మతి జనార్దన్‌ (జెన్నీ)కి, మురళికి రాజకీయంగా, మార్కెట్‌ ప్రాంతంపై ఆధిపత్యపరంగా గొడవలుండేవి. ఈ క్రమంలో 1991లో జెన్నీని నరికి చంపారు. ఈ కేసులో మురళే ప్రధాన నిందితుడు. జెన్నీకి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. వీరిలో విక్రం బీటెక్‌ చేసి హన్మకొండలోనే ఉంటున్నాడు. తండ్రిని చంపిన మురళిని ఎప్పటికైనా కడతేరుస్తానని విక్రం పలుమార్లు అన్నట్టు స్థానికులు చెబుతున్నారు. 2007లో కూడా అతను మురళిపై దాడి చేశాడు. దీనిపై హన్మకొండ పీఎస్‌లో ఫిర్యాదు నమోదైంది. అదను చూసి స్నేహితులు చిరంజీవి, వరుణ్‌బాబు సాయంతో గురువారం మురళిని హతమార్చాడు.

Advertisement
Advertisement