కల్లు ఉద్దెర ఇవ్వలేదనే కసితో అఘాయిత్యం | Sakshi
Sakshi News home page

కల్లు ఉద్దెర ఇవ్వలేదనే కసితో అఘాయిత్యం

Published Tue, Sep 2 2014 3:57 AM

The murder case of couple of mysteries, urban police

- ముగ్గురు నిందితుల అరెస్టు
- వివరాలు వెల్లడించిన డీఎస్పీ మాధవరెడ్డి
 నిర్మల్ అర్బన్ : నిర్మల్ పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో గత నెల 29న రాత్రి జరిగిన జంట హత్యల కేసు మిస్టరీని పట్టణ పోలీసులు ఛేదించారు. నిందితులైన ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో సోమవారం డీఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. నిర్మల్‌కు చెందిన పాతర్ల రాములు, రమేశ్, జాకీర్ నిత్యం మద్యం తాగేవారు. ఎప్పటిలాగే గత నెల 29న రాత్రి పాతబస్టాండ్ సమీపంలోని తెల్లకల్లు దుకాణానికి వెళ్లి కల్లు కొనుగోలు చేశారు.

ఇంకా కల్లు ఉద్దెర ఇవ్వాలని దుకాణంలో పనిచేసే మేకల నర్సింహులుపై ఒత్తిడి తెచ్చారు. అయితే ఉద్దెరకు ఇవ్వడం కుదరదని చెప్పి నర్సింహులు, అందులో పనిచేసే బాపురావు రాత్రి దుకాణాన్ని మూసివేసి ఆరుబయట నిద్రించారు. దీంతో దుకాణం నుంచి వెళ్లిపోయిన రాము లు, జాకీర్, రమేశ్ వారు కొనుగోలు చేసిన కల్లు తాగారు. తిరిగి కల్లు దుకాణం వద్దకు వచ్చి నిద్రిస్తున్న వీరిద్దరిని చూశారు. ఉద్దెరకు కల్లు ఇవ్వలేదనే కసితో జాకీర్, రమేశ్ కర్రలతో నర్సింహులుపై విచక్షణారహితంగా దాడి చేశారు. నర్సింహులుపై దాడి చేయడాన్ని చూసిన బాపురావు గట్టిగా అరుస్తూ అడ్డుకోబోయాడు.

దీంతో అతడిపై  ముగ్గురు దాడి చేసి హతమార్చారు. అతడి జేబులో ఉన్న రూ.300 ఎత్తుకెళ్లారు. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అనుమానితులైన రమేశ్, జాకీర్, రాములును అదుపులోకి తీసుకుని విచారించారు. ఆధారాలు లభించడంతో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల వద్ద నుంచి రక్తం మరకలతో ఉన్న దుస్తులను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ వివరించారు. కాగా, నిందితుల్లో ఒకరైన రమేశ్‌పై గతంలో అనేక కేసులు ఉన్నాయి.

రివార్డులు అందజేత...
పట్టణంలో కలకలం రేపిన జంటహత్యల కేసును మూడు రోజుల్లోనే ఛేదించిన ఐడీ పార్టీ సిబ్బందికి ఎస్పీ నుంచి అందిన రివార్డులను డీఎస్పీ మాధవరెడ్డి అందజేశారు. కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బంది ఫయాజుల్లా హుస్సేన్, బాబురావు, సందీప్, పర్వేజ్, రమేశ్‌లను అభినందించారు. సమావేశంలో పట్టణ సీఐ పింగళి, ప్రశాంత్‌రెడ్డి ఉన్నారు.

Advertisement
Advertisement