కొత్త బస్సుపై కేసీఆర్ అసంతృప్తి | Sakshi
Sakshi News home page

కొత్త బస్సుపై కేసీఆర్ అసంతృప్తి

Published Sat, Jul 4 2015 12:18 PM

కొత్త బస్సుపై కేసీఆర్ అసంతృప్తి - Sakshi

హైదరాబాద్ : తెలంగాణ ప్రగతి రథం పేరిట అయిదు కోట్లతో  ప్రత్యేకంగా రూపొందించిన బస్సు విషయంలో తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. బస్సులో సదుపాయాలు సరిగా లేవంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సు సీటింగ్ సదుపాయం సరిగా లేదని, అలాగే ఎలక్ట్రానిక్ సౌండ్ సిస్టమ్స్ కూడా పని చేయటం లేదని కేసీఆర్ ...అధికారుల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

దాంతో ఆయన కొత్త బస్సును పక్కన పెట్టి... రంగారెడ్డి, మెదక్, కరీంనగర్ జిల్లాల్లోని హరితవనం కార్యక్రమానికి రెగ్యులర్ కాన్వాయ్లోనే వెళ్లారు. మరోవైపు బస్సును అధికారులు హయత్ నగర్లోని బెంజ్ కంపెనీ గ్యారేజ్కు చేర్చారు. బస్సులో ఉన్న లోపాలను, సీటింగ్ సిస్టమ్ను మార్చనున్నట్లు తెలుస్తోంది.

జిల్లాల  పర్యటన కోసం ప్రభుత్వం రూ. 5 కోట్లతో ప్రత్యేకంగా అధునాతన బస్సును సిద్ధం చేసిన విషయం తెలిసిందే.  మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన ఈ బస్సు చండీగఢ్‌లో తయారైంది.

బస్సు ప్రత్యేకతలు ఇవే..

*గతంలో వాడిన పాత బస్సులు దాదాపు 22 టన్నుల బరువుండగా బుల్లెట్‌ప్రూఫ్ కొత్త బస్సుకు పైన, కింద కివిలార్ ప్లాస్టిక్‌ను వాడటంతో బస్సు బరువు 18 టన్నులకు తగ్గింది. ఫలితంగా ఈ బస్సు గంటకు 100 కి.మీ. వేగంతో దూసుకుపోనుంది. పాత బస్సుల వేగం 70-80 కి.మీ.గా ఉండేది.
*తాను మాట్లాడే విషయాలు దూరంగా ఉండేవారికి కూడా వినపడేలా ఉండాలని సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా సూచించడంతో అర కిలోమీటరు దూరం వరకు వినిపించేలా ప్రత్యేక సౌండ్ సిస్టంను ఇందులో ఏర్పాటు చేశారు.
* గతంలో వాడిన బస్సుల్లో సీఎంకు సౌకర్యంగా ఉండాలన్న ఉద్దేశంతో సోఫాలు ఏర్పాటు చేయగా ఈ బస్సులో సోఫాలు వద్దని కేసీఆర్ సూచించడంతో సీఎం కాకుండా మరో 20 మంది ప్రయాణించేలా సీట్లు అమర్చారు.
 * బస్సు బయటివైపు ఏర్పాటు చేసిన నాలుగు కెమెరాలు ఆటోమేటిక్‌గా చిత్రీకరణను రికార్డు చేస్తాయి. వాటిని లోపల తిలకించే  వ్యవస్థ ఉంది.
ఇందులోని సీఎం కార్యాలయంలో శాటిలైట్ ఫోన్, వైఫైతో ఇంటర్నెట్, కంప్యూటర్లు, అవసరమైతే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించుకునే సౌకర్యాలు కల్పించారు.
* బస్సులోనే పడకగది, బాత్‌రూమ్‌, చిన్నపాటి సమావేశ మందిరం ఉంటాయి.  దీనికి టీఎస్ ఆర్టీసీ  ఆధ్వర్యంలో మరిన్ని హంగులు, మెరుగులు దిద్దింది.

Advertisement
Advertisement