సార్లు రాలే.. బడి తెరవలే.. | Sakshi
Sakshi News home page

సార్లు రాలే.. బడి తెరవలే..

Published Sun, Dec 21 2014 1:23 AM

సార్లు రాలే.. బడి తెరవలే..

పది దాటినా ప్రారంభం కాని సర్కారు బడులు
ఒకే పాఠశాలలో విధులకు ఏడుగురు టీచర్ల డుమ్మా

 
వెంకటాపురం :  మండలంలోని ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ ఆస్తవ్యస్థంగా మారింది. ప్రభుత్వ పాఠశాలలు ఉదయం 10 గంటలు దాటినా తెరుచుకోవడం లేదు. ప్రజలు ఇచ్చిన సమాచారంతో శనివారం ఎల్లారెడ్డిపల్లె, బూర్గుపేట, బొడ్డువానిపల్లె, నారాయణపురం, వెంకటేశ్వర్లపల్లి, సుబ్బక్కపల్లి ప్రభుత్వ పాఠశాలలను ‘సాక్షి’ సందర్శించింది. ఎల్లారెడ్డిపల్లె, బూర్గుపేట, బొడ్డువానిపల్లెలోని ప్రాథమిక పాఠశాలలు ఉదయం 10 గంటలు దాటినా తాళాలతో దర్శనమిచ్చాయి. నారాయణాపురం ప్రాథమికోన్నత పాఠశాలో ఉపాధ్యాయులు బి.ఉమాదేవి, బి,మమత, కె.జయశ్రీ, ఎ.వెంకటేష్, టి.శ్రీధర్‌రెడ్డి, సరిత, స్రవంతి ఎలాంటి సెలవు పత్రం లేకుండానే విధులకు డుమ్మా కొట్టారు. కేవలం రాజశేఖర్ అనే ఉపాధ్యాయుడు ఒక్కరే హాజరయ్యారు. 124 మంది విద్యార్థులకుగాను సుమారు 20 మంది మాత్రమే పాఠశాలకు వచ్చారు. వెంకటేశ్వర్లపల్లెలో కె.రాజు, సుబ్బక్కపల్లెలో పనిచేస్తున్న వెంకటరమణ, రమేష్ విధులకు గైర్హాజరయ్యారు. సుబ్బక్కపల్లెలో 22 మంది విద్యార్థులకు ఆరుగురు మాత్రమే హాజరై పాఠశాల ఆవరణలో ఆడుకోవడం కనిపించింది. ఇదిలా ఉండగా పాఠశాలలకు ఉపాధ్యాయులు వంతులవారీగా వస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆలస్యంగా విధులకు హాజరవుతూ బోధనలో నిర్లక్ష్యం వహిస్తుండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. తరచూ విధులకు డుమ్మా కొడుతున్న ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు విద్యాశాఖ ఉన్నతాధికారులను కోరారు.
 
సార్లు రెండు రోజులుగా రావట్లే

సార్లు రెండు రోజులుగా బడికి రావట్లేదు. దీంతో మేం పాఠశాలకు వచ్చి ఆటలాడుకుంటున్నాం. సార్లు లేకపోతే మాకు ఎవరూ చదువు చెప్పరూ కాబట్టి ఆడుకుంటున్నాం. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఇంటికి పోతాం.
 - పొన్నాల వేణు, 3వ తరగతి, సుబ్బక్కపల్లి
 
శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం
 
విధులకు గైర్హాజరైన ఉపాధ్యాయులపై విచారణ చేపట్టి శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. కొందరు ఉపాధ్యాయులు సెలవులో ఉన్నట్లు తెలిసింది. సమాచారం ఇవ్వకుండ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న ఉపాధ్యాయులను సహించేది లేదు.
 - దేవేందర్‌రెడ్డి, ఎంఈఓ,
 వెంకటాపురం
 

Advertisement

తప్పక చదవండి

Advertisement