ప్రాణాలకు తెగించిన ‘సాక్షి’ విలేకరి | Sakshi
Sakshi News home page

ప్రాణాలకు తెగించిన ‘సాక్షి’ విలేకరి

Published Sun, Apr 5 2015 3:30 AM

Sakshi journalist shows dare to take photo snap of assaults

* పారిపోతున్న దుండగులను కెమెరాలో బంధించిన అర్వపల్లి ప్రతినిధి వెంకన్న
* దుండగులు  బెదిరించినా వెరవని వైనం

 

తిరుమలగిరి: 
జానకీపురం ఎన్‌కౌంటర్ ఘటన సందర్భంగా అర్వపల్లి మండల కేంద్రం ‘సాక్షి’ విలేకరి శ్రీరంగం వెంకన్న మాటలకందని సాహసం ప్రదర్శించారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ముష్కరులకు ఎదురెళ్లి మరీ, వారిని సజీవంగా తన బుల్లి కెమెరాలో బంధించారు. ఇందుకోసం ఆయన అక్షరాలా ప్రాణాలకు తెగించారనే చెప్పాలి. ఎందుకంటే వెంకన్న ఫొటో తీస్తున్న విషయాన్ని ముష్కరుల్లో ఒకడు గమనించాడు. వెంటనే వెంకన్న వైపు తుపాకీ చూపెట్టి హిందీలో గట్టిగా అరిచాడు. దాంతో వెంకన్న తన కెమెరాను పక్కకు దాస్తూ.. తానూ దాక్కునే ప్రయత్నం చేశారు. అయినా దుండగులు ఆయన్ను వదిలిపెట్టేవారు కాదేమో! కానీ అనుకోకుండా వచ్చిన ఓ బస్సు వెంకన్నకు, దుండగులకు మధ్య నిలిచింది.
 
 అదే సమయంలో తుంగతుర్తి సీఐ వాహనం వెనుక నుంచి రావడంతో దుండగులు పలాయనం చిత్తగించారు. ‘‘సమయానికి ఆ బస్సు రాకుంటే నా పరిస్థితేమిటనేది ఇప్పుడు తలచుకుంటే భయమేస్తోంది గానీ, ఫొటోలు తీస్తున్నప్పుడు మాత్రం దాన్ని ప్రజలకు చేరవేయాలన్న ఆలోచన మాత్రమే ఉంది. అదే పరమావధిగా భావించి వారి ఫోటో తీశా..’’ అన్నారు వెంకన్న. వెంకన్న సాహసోపేతంగా తీసిన ఈ ఫొటో... ‘రేపటికి ముందడుగు’ వేస్తూ పాఠకుల మెడలో ‘సాక్షి’ ప్రతినిత్యం వేస్తున్న అక్షర మణిమాలలో మరో ఆణిముత్యం.

Advertisement
Advertisement