నేతన్నల పోరుబాట.. | Sakshi
Sakshi News home page

నేతన్నల పోరుబాట..

Published Mon, May 8 2017 3:08 AM

నేతన్నల పోరుబాట.. - Sakshi

- సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ‘సమ్మె’ట
- నేటి నుంచి పవర్‌లూం కార్మికుల సమ్మె


సాక్షి, సిరిసిల్ల: కూలీ గిట్టుబాటు కోసం నేతన్నలు పోరుబాట పట్టారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి, కార్మికులకు నెలకు రూ.15 వేల కూలీ వచ్చేట్లు చూడాలని చెప్పినా యజమానులు పెడచెవిన పెట్టడంతో కార్మికులు రోడ్డెక్కారు. కార్మికశాఖ అధికారుల సమక్షంలో యజమానులతో కార్మికులు జరిపిన చర్చలు విఫలం కావడంతో 8వ తేదీ నుంచి సమ్మెకు వెళుతున్నట్లు నేత కార్మిక సంఘ నాయకులు ఇప్పటికే ప్రకటించారు. బలవన్మరణాలకు పాల్పడుతున్న నేత కార్మికుల జీవన స్థితిగతుల్లో మార్పు తీసుకురావాలనే సంకల్పంతో ప్రభుత్వం చేపట్టిన ఉపాధి ఆర్డర్లు పెద్దల ఖాతాల్లోకి వెళుతున్నాయని కార్మికులు ఆరోపిస్తున్నారు.  

కేసీఆర్‌ ఆదేశాన్ని అమలు చేయాలి
కార్మికులకు నెలకు కనీసం రూ.15 వేల వేతనం వచ్చేట్లు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ ఇచ్చిన ఆదేశాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ కార్మికులు ఆందో ళన బాట పట్టారు. అలాగే కార్మికుల ఆత్మహత్యల నివారణకు, శాశ్వత ఉపాధి కల్పనకు ప్రతి కార్మికుడికి నాలుగు సాంచాలు, వర్క్‌షెడ్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.  

స్తంభించనున్న 35 వేల మరమగ్గాలు
రాష్ట్రవ్యాప్తంగా మరమగ్గాలు (పవర్‌లూం) సిరిసిల్లలోనే అధికం. ఇక్కడ 45 వేల మరమగ్గాలున్నాయి. ఇందులో 35 వేల మరమగ్గాలపై పాలిస్టర్‌ వస్త్రం ఉత్పత్తి అవుతుంది. మరమగ్గాలకు అనుబంధంగా వార్ఫిన్, ప్రాసెసింగ్‌ యూనిట్లు పనిచేస్తుంటాయి. వీటిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 30 వేల మంది ఉపాధి పొందుతున్నారు. ఒక అంచనా ప్రకారం ఏటా సుమారు రూ.350 కోట్ల విలువైన వస్త్రాన్ని పవర్‌లూంలపై తయారు చేస్తుంటారు. సోమవారం నుంచి పవర్‌లూం కార్మికులు సమ్మెలోకి వెళుతుండడంతో 35 వేల మరమగ్గాలు స్తంభించనున్నాయి.

Advertisement
Advertisement