కౌన్సిలర్లుగా తండ్రి... కొడుకు...ఓ కోడలు | Sakshi
Sakshi News home page

కౌన్సిలర్లుగా తండ్రి... కొడుకు...ఓ కోడలు

Published Thu, May 15 2014 9:34 AM

గరిగంటి కొమరయ్య, సరోజ

ఓ తండ్రి...ఓ కొడుకు...ఓ కోడలు ఇలా ‘గరిగం టి’ కుటుంబానికి చెందిన ముగ్గురు మంచిర్యాల పురపాలక సంఘంలో కౌన్సిలర్లుగా గొలుసు కట్టులా గెలుస్తూ వస్తున్నారు. పాతికేళ్లుగా విజయ పతాకాన్ని ఎగుర వేస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రతీ ఎన్నికల్లో వార్డు ప్రజలు ఆదరిస్తున్నారు. వరుసగా ఒకే కుటుంబంలో ముగ్గురిని గెలిపించి అధికారం కట్టపెట్టారు. ప్రస్తుతం ఆ కుటుంబం గెలుపు జిల్లాలోనే చర్చనీయాంశంగా మారింది. ఓటమి ఎరుగని ఆ కుటుంబం రాజకీయ వర్గాలనూ విస్మయపరుస్తోంది. ‘గరిగంటి’ కుటుంబం విజయ రహస్యం ఏమిటని ఆరా తీస్తున్నారు రాజకీయ ప్రముఖులు. ఆ కుటుంబం రాజకీయ నేపథ్యం..
 
 రాజకీయ బీజం వేసింది కనకయ్య..
తొలినాళ్ల నుంచి గరిగంటి కుటుంబం కాంగ్రెస్‌తోనే ముడిపడి ఉంది. గరిగంటి కుటుంబంలో తొలుత రాజకీయ అరంగేట్రం చేసింది కనకయ్య. ఆయన 1987లో జరిగిన పురపాలక సంఘం ఎన్నికల్లో అప్పటి 13వ వార్డు (ప్రస్తుతం 24 వార్డు) కౌన్సిలర్‌గా విజయం సాధించారు. ఆయన ఐదేళ్లపాటు కౌన్సిలర్‌గా వార్డు ప్రజలకు సేవలందించారు. ఆయన సోదరుడి కుమారుడు గరగంటి సాయిలు సైతం 1982-87 వరకు కౌన్సిలర్‌గా పనిచేశారు.
 
 మామ వారసురాలిగా సరోజ
 గరిగంటి సరోజ 1995లో పురపాలక సంఘం ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. మామ కనకయ్య రాజకీయ వారసురాలిగా కౌన్సిల్ హాల్‌లో అడుగు పెట్టారు. వంటింటి నుంచి ఏకంగా కౌన్సిల్ హాల్‌లోకి అడుగుపెట్టిన సరోజ ప్రజా సమస్యలను కౌన్సిల్ హాలులో ఎలుగెత్తి చాటింది. సమర్ధురాలైన నాయకురాలిగా పేరు తెచ్చుకుంది. 2000 సంవత్సరంలో ఆ వార్డు ఎస్టీలకు కేటాయించడంతో ఆ సారి ఎన్నికలకు దూరమైంది. మళ్లీ 2005, 2010, 2014 (తాజాగా)లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించింది.
 
 ఒకేసారి కొమురయ్య...
 కనకయ్య రెండో రాజకీయ వారసునిగా గరిగంటి కొమురయ్య రాజకీయ అరంగేట్రం చేశారు. ఈయన కనకయ్య కుమారుడు. సరోజకు భర్త. 2005లో కొమురయ్యకు కూడా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వచ్చింది. పక్కపక్క వార్డులు.. రిజర్వేషన్ కలిసి రావడంతో ఇద్దరు పోటీ చేసి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. అయితే కొమురయ్యకు ఈసారి రిజర్వేషన్ కలిసి రాకపోవడంతో ఎన్నికలకు దూరంగా ఉన్నారు.
 
 చైర్మన్ పీఠంపై సరోజ గురి
 ప్రస్తుతం చైర్మన్ పీఠం మహిళకు కేటాయించడంతో చైర్మన్ పదవిపై సరోజ ఆశలు పెంచుకున్నారు. కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజార్టీ వచ్చింది. బల్దియాలో 32 వార్డులుండగా 18 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకంది. దీంతో చైర్మన్ ఎన్నిక మార్గం సుగమమైంది. ప్రస్తుత కౌన్సిలర్లలో సీనియర్ అయినందున తనకే చైర్మన్ పదవి కట్టబెట్టాలని సరోజ కాంగ్రెస్ అధినాయకత్వాన్ని కోరుతున్నారు. అయితే పదవి ఎవరికీ దక్కనుందే వేచి చూడాల్సిందే.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement