‘బాలల కమిషన్‌’పై సర్కారుకు ఎదురుదెబ్బ! | Sakshi
Sakshi News home page

‘బాలల కమిషన్‌’పై సర్కారుకు ఎదురుదెబ్బ!

Published Sat, Oct 14 2017 1:58 AM

High court on Child Rights Commission - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బాలల హక్కుల కమిషన్‌ చైర్‌పర్సన్, సభ్యుల నియామకంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. చైర్‌పర్సన్, ఇతర సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను హైకోర్టు రద్దు చేసింది. వారి నియామకం చట్ట నిబంధనలకు అనుగుణంగా జరగలేదని పేర్కొంది.

బాలల హక్కుల రంగంలో కనీసం 10 సంవత్సరాల అనుభవం, బాలల హక్కుల విషయంలో చిత్తశుద్ధి ఉన్న వారిని చైర్‌పర్సన్, సభ్యులుగా నియమించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ చల్లా కోదండరామ్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి ఈ నియామకాలపై గతంలోనే హైకోర్టు స్టే విధించగా.. తాజా గా నియామక జీవోలను రద్దు చేశారు.

నచ్చిన వారిని నియమించుకున్నారు..!
బాలల హక్కుల సంఘం చైర్‌పర్సన్‌గా రవికుమార్‌ నియామకపు జీవో 18ని సవాలు చేస్తూ పి.అచ్యుత్‌రావు ఒక పిటిషన్‌ దాఖలు చేయగా.. సభ్యుల నియామకాన్ని సవాలు చేస్తూ నారా నాగేశ్వరరావు, డి.రాము, ఎంఎన్‌వీ శ్రీనివాసరావులు వేర్వేరుగా మూడు వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్‌ చల్లా కోదండరామ్‌ విచారణ జరిపారు. ఈ సందర్భంగా పిటిషనర్లు తమ అభ్యంతరాలను కోర్టుకు వివరించారు.

‘‘చైర్‌పర్సన్‌గా నియమితులైన రవికుమార్‌ వరంగల్‌లో న్యాయవాది. టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యదర్శి. సభ్యులుగా నియమితులైన వారిలో అనుమందుల శోభారాణి హుజూరాబాద్‌ ఎంపీడీవో కార్యాయలంలో డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎం.జయశ్రీ ఓ మాజీ ఎమ్మెల్యే కుమార్తె, బండ రామలీల వరంగల్‌లోని మానసిక వైకల్య కేంద్రంలో ఉద్యోగిని, పొనుగంటి అంజన్‌రావు ఎల్బీనగర్‌లో టీఆర్‌ఎస్‌ కార్యకర్త, పి.రేవతిదేవి హైదరాబాద్‌ సీఐడీకి స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్, జోగినపల్లి శ్రీనివాసరావు హైదరాబాద్‌ కేపీహెచ్‌బీ కాలనీ టీఆర్‌ఎస్‌ కార్యకర్త.

వీరిలో ఏ ఒక్కరూ కూడా బాలల హక్కుల కోసం పోరాటం చేయలేదు. ఎవరికీ బాలల హక్కుల సంరక్షణలో కనీస అనుభవం లేదు. ఇటువంటి వారిని చైర్‌పర్సన్, సభ్యులుగా నియమించడం బాలల హక్కుల చట్టం–2005కు విరుద్ధం..’’అని నివేదించారు. అంతేగాకుండా కమిషన్‌ ఎంపిక కమిటీకి మంత్రి చైర్మన్‌గా ఉండాలని.. కానీ మంత్రి లేకుండానే చైర్‌పర్సన్, ఇతర సభ్యుల నియామకం జరిగిందని వివరించారు.

ఎంపిక ప్రక్రియ చట్టవిరుద్ధమే..
పిటిషనర్ల వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. బాలల హక్కుల కమిషన్‌ చైర్‌పర్సన్, సభ్యుల ఎంపిక ప్రక్రియ సరిగా లేదని స్పష్టం చేశారు. నియమితులైన వారు ఆ పోస్టులకు అర్హులా.. కాదా? అన్న అంశాల జోలికి వెళ్లడం లేదని.. కానీ ఎంపిక ప్రక్రియ మాత్రం చట్ట నిబంధనలకు లోబడి జరగలేదని పేర్కొన్నారు. ఎంపిక చేసే త్రిసభ్య కమిటీకి శిశు సంక్షేమ శాఖ మంత్రి చైర్మన్‌గా ఉంటారని.. మంత్రి సమావేశానికి హాజరుకాకుండానే మిగతా ఇద్దరు సభ్యుల కమిటీ కమిషన్‌ చైర్‌పర్సన్‌ను సిఫార్సు చేశారని పేర్కొన్నారు.

ఇక నియామకమయ్యే వారికి పదేళ్ల పాటు బాలల హక్కుల రంగంలో అనుభవం ఉండాలన్న ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేయలేదని ఎత్తిచూపారు. బాలల హక్కుల కమిషన్‌ చట్టం, తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల చట్ట నిబంధనలకు అనుగుణంగా... బాలల హక్కుల కోసం పోరాడిన వారిని, బాలల సంక్షేమం, విద్య కోసం చిత్తశుద్ధితో పాటుపడిన వారిని నియమించాలని సూచించారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement