సాక్షి, హైదరాబాద్: ‘కేజీ టు పీజీ’మిషన్.. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన పథకం. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో టీఆర్‌ఎస్ సర్కారు చేసిన ప్రయత్నాలతో ప్రభుత్వ విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు బీజాలు పడ్డాయి. ఒకప్పుడు పరిమిత సంఖ్యలో ఉన్న గురుకుల పాఠశాలల సంఖ్య.. కొత్త రాష్ట్రం ఏర్పాటుతో వచ్చిన మార్పులతో భారీగా పెరిగింది. అన్నివర్గాలకు నాణ్యమైన విద్య క్రమంగా అందుబాటులోకి వస్తోంది. పెరుగుతున్న పోటీ ప్రపంచానికి దీటుగా నాణ్యతాప్రమాణాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుండటంతో ఫలితాల్లోనూ ఈ విద్యార్థులు సత్తా చాటుతున్నారు. దీంతో గురుకులాల్లో ప్రవేశాలకు డిమాండ్ పెరుగుతోంది. మంచిభోజనంతోపాటు.. నాణ్యమైన విద్యనందిస్తున్న కారణంగా అడ్మిషన్‌లు ఇవ్వాలంటూ కార్యాలయాల చుట్టూ తిరిగేవారి సంఖ్య పెరిగింది. దీంతో పలు సొసైటీలు ‘హౌస్‌ఫుల్’బోర్డులు పెడుతున్నాయి. ఇదీ విద్యా వ్యవస్థలో ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులకు నిదర్శనం.
గురుకులాలు మూడింతలు: ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో గురుకులాల సంఖ్య 292 మాత్రమే. పరిమిత సంఖ్యలో పాఠశాలలుండటంతో వాటిల్లో ప్రవేశాలు సైతం అంత గొప్పగా ఉండేవి కావు. నిర్వహణకు నిధులివ్వకపోవడంతో విద్యానాణ్యత క్రమంగా తగ్గుతూ వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత.. టీఆర్‌ఎస్ సర్కారు విద్యా వ్యవస్థకు పునరుజ్జీవం అందించే ప్రయత్నంలో భాగంగా గురుకులాల సంఖ్య 881కి పెంచింది. వీటితో పాటు మరో 30 డిగ్రీ కాలేజీలు సైతం ప్రారంభం కావడంతో గురుకుల విద్యా సంస్థల సంఖ్య తొమ్మిది వందలు దాటింది. కొత్త రాష్ట్రంలో 104 ఎస్సీ గురుకులాలు, 53 ఎస్టీ గురుకులాలు, 194 మైనార్టీ గురుకులాలు, 119 బీసీ గురుకులాలు ఏర్పాటయ్యాయి. 2019–20 విద్యా సంవత్సరంలో మరో 119 బీసీ గురుకుల పాఠశాలు ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
హౌస్‌ఫుల్ బోర్డులు
గతంలో గురుకుల పాఠశాలల్లో సీట్ల భర్తీ సాదాసీదాగా జరిగేది. అర్హత పరీక్షల ద్వారా ప్రవేశాలు కల్పించినప్పటికీ మధ్యలోనే మానేసేవారి సంఖ్య ఎక్కువగానే ఉండేది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గురుకుల పాఠశాలల సంఖ్య పెరగడం, అత్తుత్తమ పద్దతిలో భోజనం అందించడంలాంటి కారణాలతో అడ్మిషన్ల కోసం ఎగబడుతున్నారు. అర్హత పరీక్ష ఫలితాల ఆధారంగా సీట్లు భర్తీ చేసినప్పటికీ.. సీట్లు రానివారు అడ్మిషన్ కావాలంటూ కార్యాలయాల చుట్టూ చక్కలు కొడుతున్నారు. ఈనేపథ్యంలో పలు సొసైటీలు ఏకంగా అన్ని సీట్లు భర్తీ అయినట్లు హౌస్‌ఫుల్ బోర్డులు పెట్టేస్తున్నాయి.
ర్యాంకుల పండగ
గురుకుల పాఠశాలలు ఫలితాల్లో అగ్రగామిగా నిలుస్తున్నాయి. ప్రభుత్వ, ఏయిడెడ్ పాఠశాలల కంటే అత్యుత్తమ ఫలితాలను ఖాతాలో వేసుకుంటున్నాయి. గతేడాది పదోతరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో 92% పైగా విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఎంసెట్, నీట్, క్లాట్, జేఈఈ తదితర పోటీ పరీక్షల్లోనూ గురుకులాల విద్యార్థులు మెరుగైన ర్యాంకులు సాధిస్తున్నారు. జూనియర్ కాలేజీలు అధికంగా ఉన్న ఎస్సీ గురుకుల జూనియర్ కాలేజీల నుంచి ఏకంగా 37 మంది విద్యార్థులు ఎంబీబీఎస్, డెంటల్ సీట్లు సాధించారు. 6గురు విద్యార్థులు టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, 12 మంది విద్యార్థులు ఢిల్లీ యూనివర్సిటీలో సీట్లు సాధించారు. బెంగళూరులోని అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీలో 28 మంది విద్యార్థులు వివిధ కోర్సుల్లో ప్రవేశాలు పొందారు. 10 మంది విద్యార్థులు వివిధ కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో, 16 మంది విద్యార్థులు ఐఐటీ, ఎన్‌ఐటీల్లో సీట్లు సాధించారు. గతేడాది ఎస్టీ గురుకులాలకు చెందిన 12 మంది విద్యార్థులు ఐఐటీల్లో సీట్లు సాధించడంతో ప్రభుత్వం వారికి ప్రోత్సాహకంగా ల్యాప్‌టాప్‌లు అందించింది.
2.72 లక్షల మంది విద్యార్థులు
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 762 గురుకుల పాఠశాలల్లో విద్యార్థులున్నారు. వచ్చే విద్యాసంవత్సరం మరో 119 బీసీ గురుకులాలు అందుబాటులోకి రానుండగా... ఇప్పుడున్న వాటిలో 2.72లక్షల మంది విద్యార్థులున్నారు. ఒక్కో తరగతిలో 40మంది చొప్పున.. ప్రతి తరగతికి రెండు సెక్షన్లు కలిపి 80 మంది ఉంటారు. కొత్తగా ప్రారంభమైన పాఠశాలల్లో 5,6,7 తరగతులు ప్రారంభించగా.. ఏటా ఒక్కో తరగతి అప్‌గ్రేడ్ అవుతోంది. దీంతో 2020 నాటికి గురుకుల పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్య 3 లక్షలు దాటనుంది.
సొసైటీల వారీగా ప్రస్తుతమున్న గురుకుల పాఠశాలల సంఖ్య
సొసైటీ పేరు తెలంగాణకు ముందు కొత్త గురుకులాలు మొత్తం
టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ 134 104 238
టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ 94 53 147
టీఆర్‌ఈఐఎస్ 35 0 35
టీఎంఆర్‌ఈఐఎస్ 10 194 204
ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ 19 119 138
(మరో 119 గురుకులాలు 2019–20 విద్యా సంవత్సరంలో ప్రారంభం)
పక్కా ప్రణాళికతో
గతంలో గురుకుల పాఠశాలల నిర్వహణ సొసైటీ నిర్ణయాలకు తగినట్లు ఉండేవి. ప్రస్తుతం సొసైటీ ఆదేశానుసారం నడిచినప్పటికీ.. కీలక నిర్ణయాలన్నీ అన్ని సొసైటీ కార్యదర్శులు చర్చించి ఒకే తరహాలో అమలు చేయడంతో ఫలితాలు సైతం ఒకే తరహాలో వస్తున్నాయి. పాఠ్యాంశ బోధన మొదలు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు తదితరాలన్నీ పక్కాగా నిర్వహిస్తుండడంతో విద్యార్థులు చదువును ఒత్తిడిగా భావించడం లేదు. కొత్త గురుకులాల్లో బోధన, బోధనేతర సిబ్బందిని ప్రభుత్వం ప్రాధాన్యతాక్రమంలో నియమిస్తోంది. బీసీ సొసైటీకి కొత్తగా మంజూరు చేసిన గురుకులాల్లోనూ ప్రభుత్వం సిబ్బందిని మంజూరు చేసింది. వచ్చే ఏడాది ఈ ఉద్యోగ నియామకాలు చేపడతారు. గురుకులాల్లో ఉద్యోగ నియామకాలకు ప్రభుత్వం ప్రత్యేకంగా టీఆర్‌ఈఐఆర్‌బీ (తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ రిక్రూట్‌మెంట్ బోర్డు)బోర్డును ఏర్పాటు చేసింది.
బీసీ గురుకులాలదే అతిపెద్ద సొసైటీ
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు బీసీ గురుకుల సొసైటీలో కేవలం 19 పాఠశాలలు మాత్రమే ఉండేవి. కొత్త రాష్ట్రంలో బీసీ గురుకులాల సంఖ్య భారీగా పెరిగింది. కొత్తగా 119 బీసీ గురుకుల పాఠశాలలను ప్రభుత్వం మంజూరు చేయగా 2017–18 విద్యా సంవత్సరంలో వాటిని ఆ సొసైటీ అందుబాటులోకి తెచ్చింది. కానీ బీసీ విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా గురుకుల పాఠశాలలు లేవని క్షేత్రస్థాయి నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. అడ్మిషన్ల కోసం విద్యార్థులు బీసీ గురుకుల సొసైటీ కార్యాలయం వద్ద పడిగాపులు కాయడం.. గందరగోళ వాతావరణం నెలకొంటొంది. ఇందులో భాగంగా మరో 119 కొత్త గురుకులాల ఏర్పాటుకు అనుమతిచ్చింది. వీటిని 2019–20 విద్యాసంవత్సరంలో వీటిని ప్రారంభించేందుకు బీసీ గురుకుల సొసైటీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దీంతో 257 గురుకుల పాఠశాలలతో అతిపెద్ద గురుకుల సొసైటీగా ‘బీసీ గురుకుల సొసైటీ’అవతరించనుంది.
సరికొత్త మెనూతో..!
గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు బోధనతో పాటు ఆరోగ్య ప్రమాణాలపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. పాత విధానానికి స్వస్తి పలుకుతూ సరికొత్త మెనూను సిద్ధం చేసింది. ఎదిగే పిల్లలకు నాణ్యమైన పోషకాహారాన్ని అందించేలా డైట్ చార్ట్‌ను తయారు చేసింది. ఇందుకు ఎన్‌ఐఎన్ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్) సహకారాన్ని తీసుకుంది. కొత్తగా రూపొందించిన మెనూ అమలుకు ప్రభుత్వం బడ్జెట్‌ను పెంచింది. మెస్‌చార్జీలను భారీగా పెంచడంతో విద్యార్థులకు మరింత పోషకాహారాన్ని ప్రణాళికాబద్ధంగా అందిస్తున్నారు. మెస్ చార్జీల రూపంలో ప్రస్తుతం 7వ తరగతి వరకు విద్యార్థులకు నెలకు రూ.950 చొప్పున, 8నుంచి 10 తరగతికి రూ.1100, ఇంటర్ నుంచి పీజీ విద్యార్థులకు నెలకు రూ.1050 చొప్పున ప్రభుత్వం అందిస్తోంది.
గ్రీన్‌చానల్ ద్వారా నిధుల విడుదల...
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గురుకుల పాఠశాలల్లో ఆర్థిక సమస్యలు రావద్దని నిర్ణయించి వీటిని గ్రీన్‌చానెల్ విధానంలోకి మార్చింది. నిధుల సమస్య తలెత్తకుండా అవసరాలకు తగినట్లుగా నిధులు విడుదల చేస్తోంది. పైసా బకాయి ఉండకుండా డైట్ చార్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ నిధులు మంజూరు చేయడంతో విద్యార్థులకు సకాలంలో సరైన భోజనం అందుతోంది. అదేవిధంగా సమస్యలున్న పాఠశాలల్లో కేవలం ప్రతిపాదనలు అందించిన వెంటనే ప్రాధాన్యత క్రమంలో పనులు మంజూరు చేస్తున్నారు. ప్రస్తుతం కొత్తగా ప్రారంభించిన పాఠశాలలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నప్పటికీ.. సకాలంలో ఆమేరకు నిధులు విడుదల చేస్తోంది. పక్కా భవనాలకు కార్యాచరణ సిద్ధం చేస్తూనే ప్రాధాన్యత క్రమంలో విడతల వారీగా భవనాలు నిర్మించనున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి.
జనరల్ సర్జన్ అవుతా!
మాది నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం డొంకేశ్వర్ గ్రామం. అమ్మ, నాన్న వ్యవసాయ కూలీలు. ఉన్నత చదువులు చదవాలనేది నాకల. డాక్టర్ కావాలని నిర్ణయించుకున్నా. కానీ ప్రైవేటు స్కూళ్లలో చదివే స్థోమత లేకపోవడంతో గురుకుల పాఠశాలలో చేరా. పదోతరగతి వరకు ఆర్మూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదివా. మంచి మార్కులు రావడంతో గౌలిదొడ్డి జూనియర్ కాలేజీలో సీటు వచ్చింది. అక్కడ బైపీసీలో చేరా. నీట్‌లో 2వేల ర్యాంకు వచ్చింది. మహబూబ్‌నగర్ వైద్య కళాశాలలో అడ్మిషన్ దొరికింది. జనరల్ సర్జన్ అవ్వాలనేది నా కల.
– అమర్త్య, ఎంబీబీఎస్ ఫస్టియర్, మహబూబ్‌నగర్ ప్రభుత్వ వైద్య కళాశాల
Comments
Please login to add a commentAdd a comment