పరిచయంలో పదనిసలు | Sakshi
Sakshi News home page

పరిచయంలో పదనిసలు

Published Fri, Apr 18 2014 3:10 AM

Groups in the introduction to

  •     జిల్లా నేతల గురించి కేసీఆర్ ప్రస్తావన
  •      పలువురికి సంతోషం
  •      కొందరికి ఇబ్బందులు
  •  సాక్షిప్రతినిధి, వరంగల్ : తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావు మడికొండ సభలో ఒకింత భావోద్వేగంతో ప్రసంగించారు. తెలంగాణ ఏర్పాటుతో తనకు వెయ్యి జన్మ ల కీర్తి వచ్చిందన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ తనకు తెలంగాణ ఉద్యమ గురువు అని కొనియాడారు. భూపాలపల్లి జిల్లాను ఏర్పాటు చేసి జయశంకర్‌సారు పేరు పెడతామని చెప్పారు. బహిరంగసభ ఉపన్యాసంలో, లోక్‌సభ-అసెంబ్లీ అభ్యర్థుల పరిచయ కార్యక్రమంలో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి.
     
    రవీందర్‌రావు... నిమిషం

    కేసీఆర్ బహిరంగ సభల్లో ప్రసంగించేటప్పుడు పక్కన కూర్చునే పార్టీ ముఖ్య నేతలు చిన్న కాగితాల్లో రాసి సమాచారం ఇస్తుంటారు. కేసీఆర్ సాధారణంగా ఒకరిద్దరు ఇచ్చే కాగితాలనే తీసుకుని వాటిని ప్రసంగంలో ప్రస్తావిస్తారు. మడికొండ బహిరంగసభలో కేసీఆర్ పక్కనే కూర్చున్న టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు టి.రవీందర్‌రావు.. ప్రసంగం మొదలుకాగానే కాగితాలు ఇవ్వడం మొదలుపెట్టారు. వెంటవెంటనే ఇలా చేస్తుండడంతో కేసీఆర్, రవీందర్‌రావును ఉద్దేశించి ‘నిమిష నిమిషానాకి ఏందయా. రాసిచ్చుడు ఆపుండ్రి. ఇబ్బంది పెట్టొద్దు’ అని అసహనం వ్యక్తం చేశారు. దీంతో రవీందర్‌రావు ఇబ్బందిగా ఫీలయ్యారు.
     
    దేవాదుల... కడియం శ్రీహరి
     
    టీఆర్‌ఎస్ ఆవిర్భవించగానే 2001లో పంచాయతీ ఎన్నికలకు వెళ్లే ముందు టీడీపీ అధినేత చంద్రబాబు దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని హడావుడిగా చేపట్టారని విమర్శిస్తూ మాట్లాడారు. చంద్రబాబు రోడ్డు కూడా లేని ప్రాంతంలో శంకుస్థాపన చేయడంతో ఈనాడు పత్రిక ఈస్ట్‌మన్ కలర్‌లో 18 నెలల్లో సాగునీరు అని పెద్దగా ప్రచురించిందని పేర్కొన్నారు. ఇప్పటికీ దేవాదుల పూర్తి కాలేదని.. ఆరేళ్లు సాగునీటి శాఖ మంత్రిగా పని చేసిన పొన్నాల ఏమీ చేయలేదని విమర్శించారు. ఇలా చంద్రబాబు, పొన్నాల లక్ష్మయ్యను కేసీఆర్ విమర్శించే సమయంలో ఆయన పక్కనే ఉన్న శ్రీహరి ఇబ్బందిగా ఫీలయినట్లు కనిపించారు. ఆ సమయంలో కడియం మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే.
     
    ఎర్రబల్లి.. ప్రదీప్‌రావు
     
    తెలుగుదేశం తెలంగాణ ఎన్నికల కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్రబెల్లి దయాకర్‌రావుపై కేసీఆర్ విమర్శలు చేస్తున్నప్పుడు వేదికపై ముందు వరుసలోనే కూర్చున్న ఆయన సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు ఇబ్బందిగా కనిపించారు. కేసీఆర్ మాట్లాడుతూ... ‘కంచికి వెళ్తే బల్లి ఉంటది. దాన్ని తాకితే పుణ్యమొస్తది. ఇక్కడ పాలకుర్తిలో ప్రమాదమైన బల్లి ఉంది. అది ఎర్రబల్లి. పొద్దున లేస్తే నా మీద, తెలంగాణ మీద విషం కక్కే బల్లి అది.’ అని అన్నారు. ఇలా మాట్లాడుతున్నప్పుడు వేదిక మీద ఉన్న టీఆర్‌ఎస్ నేతలంతా నవ్వుతూ కనిపించారు. ప్రదీప్‌రావు మాత్రం ఇబ్బందిగా కనిపించారు.
     
    పెద్ది.. పెళ్లి పంచాయితీ
     
    అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల పరిచయం సందర్భంగా కేసీఆర్ మాటలు అందరినీ నవ్వించాయి. నర్సంపేట టీఆర్‌ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్‌రెడ్డిని కేసీఆర్ ప్రజలకు పరిచయం చేస్తూ... ‘14 ఏళ్లు నాతో అన్ని సందర్భాల్లో ఉన్నారు. సుదర్శన్‌రెడ్డి ఉద్యమ బిడ్డ. ఎమ్మెల్యే అయితేనే సుదర్శన్‌రెడ్డి పెళ్లి చేసుకుంట అంటాడు. ఇప్పుడు మీరే పంచాయితీ తెంపాలె. నర్సంపేటలో పెద్దిని గెలిపించాలె’ అనడంతో సభ మొత్తం నవ్వులమయమైంది.
     
    కడియం, సీతారాం నాయక్.. ముత్తిరెడ్డి
     
    అభ్యర్థుల పరియం సందర్భంగా సభ ప్రారంభం కాగానే కేసీఆర్.. వరంగల్ లోక్‌సభ అభ్యర్థి కడియం శ్రీహరిని పరిచయం చేశారు. శ్రీహరి గురించి చెప్పడం మొదలుపెట్టడంతో సభలో ఒక్కసారిగా చప్పట్లు, ఈలలు భారీగా వినిపించాయి. ‘కడియం గాలి బాగా ఉన్నట్లుంది’ అని కేసీఆర్ అన్నారు. తర్వాత మహబూబాబాద్ లోక్‌సభ అభ్యర్థి ఎ.సీతారాం నాయక్‌ను పరిచయం చేస్తున్నప్పుడు ఇలాగే చప్పుట్లు, ఈలలతో మోగడంతో ‘అంతటా ఇదే గాలి ఉన్నట్లుంది’ అని కేసీఆర్ అనడంతో సభలో నవ్వులు వినిపించాయి. జనగామ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని పరిచయం చేస్తుండడంతో... అందరికంటే ఎక్కువ చప్పట్లు, ఈళలు వినిపించాయి. ‘పొన్నాల మీద కోపమా... ముత్తిరెడ్డి మీద ప్రేమా, ఇంత మోగుతాంది. పొన్నాల మీద కోపమే ఉన్నట్లుంది’ అని కేసీఆర్ అనడంతో సభలో మళ్లీ ఈళలు వచ్చాయి.
     
    యాకూబ్‌రెడ్డి.. గాంధీనాయక్
     
    పొన్నాల తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదని కేసీఆర్ విమర్శించారు. ఈ మాటలు చెబుతూ కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థి యాకూబ్‌రెడ్డిపై పోలీసుల దాడిని ప్రస్తావించారు. ఆ సమయంలో యాకూబ్‌రెడ్డి స్టేజీపైన కేసీఆర్ వెనుకే ఉన్నారు. యాకూబ్‌రెడ్డిని చూపి.. హన్మకొండ, జనగామలో ఇళ్ల చుట్టూ ముళ్ల కంచె పెట్టుకుని విద్యార్థులను ఇబ్బంది పెట్టిన పొన్నాల లక్ష్మయ్య ఉద్యమంలో పాల్గొనలేదని కేసీఆర్ అన్నారు. తెలంగాణ వచ్చే వరకు అరగుండు, అర మీసంతోనే ఉంటానని శపథం చేసిన గాంధీనాయక్ బహిరంగసభ వేదికపై పక్కన కూర్చున్నారు. కేసీఆర్ ఆయనను దగ్గరికి పిలిచి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
     

Advertisement
Advertisement