రేషన్ బంద్! | Sakshi
Sakshi News home page

రేషన్ బంద్!

Published Sun, Aug 31 2014 3:19 AM

రేషన్ బంద్! - Sakshi

- రచ్చబండ కార్డులపై సరుకులు నిలిపివేత
- ఫొటో, ఆధార్  నంబర్లు ఇవ్వని ఫలితం
- జిల్లాలో 40వేల మంది
- వచ్చే నెల 5లోగా వివరాలిస్తేనే కోటా

 సాక్షి, కరీంనగర్ : రేషన్ సరుకులు అందాలంటే.. ఫొటో, ఆధార్ నంబర్ సమర్పించాలని ఇది వరకే స్పష్టం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలల నుంచి వివరాలు సేకరిస్తోంది. అయినా జిల్లాలో వేలాదిమంది రేషన్‌కార్డుదారులు వివరాల సమర్పణకు వెనకడుగు వేస్తున్నారు. వివరాలివ్వని వారందరూ బోగస్‌కార్డుదారులేనని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అందుకే వారికి సరుకులు నిలిపేశారు. గతంలో ప్రభుత్వం రచ్చబండ కార్యక్రమం నిర్వహించి.. రేషన్ కార్డులు లేని 86,350 మందికి కార్డులు అందజేసింది.

ఇతర కార్డులపై అందజేస్తున్న మాదిరిగానే వీరికి బియ్యం, చక్కెర, కిరోసిన్, పప్పు, ఉప్పు, నూనె, చింతపండు తదితర నిత్యావసర వస్తువులన్నీ అందిస్తోంది. రచ్చబండలో జారీ చేసిన కార్డుల్లో చాలా మంది అనర్హులున్నారని, కుటుంబంలో ఇతర సభ్యులకు కార్డులున్నా తప్పుడు సమాచారంతో మళ్లీ కార్డులు పొందారనే విమర్శలు వచ్చాయి. ఈ కార్డులపై రేషన్ కోటా కూడా పెరగడంతో అర్హులను గుర్తించేందుకు ప్రభుత్వం ఫొటో, ఆధార్‌నంబర్ సేకరించాలని అధికారులను ఆదేశించింది.

రచ్చబండ కార్యక్రమాల్లో కార్డులు పొందిన వారిలో 47 వేల మంది ఫొటో, ఆధార్ నంబర్లు సమర్పించారు. 13,350 మందిలో ఫొటో సమర్పిస్తే.. ఇంకొందరు ఆధార్ నంబర్ మాత్రమే ఇచ్చారు. 26 వేల మంది మాత్రం రెండింటిలో ఏ గుర్తింపూ ఇవ్వలేదు. ఎన్నిసార్లు చెప్పినా వివరాలు సమర్పించకపోవడంతో.. పూర్తి సమాచారం ఇవ్వని వారికి నిత్యావసర వస్తువులు నిలిపేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించింది.

వ చ్చే నెల ఐదో తేదీలోగా ఫొటో, ఆధార్ నంబర్లు సమర్పిస్తేనే వారికి ఆ నెల రేషన్ సరుకులు ఇవ్వాలని సూచించింది. ‘వివరాలు సమర్పించని వినియోగదారులు తమ పరిధిలోని రేషన్‌డీలర్లకు నిర్ణీత సమయంలోగా ఫొటో, ఆధార్ నంబర్లు సమర్పించాలి. అయినా ఆలస్యం చేస్తే.. ఆ నెల కోటా ఇచ్చే ప్రసక్తే లేదు’ అని జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి చంద్రప్రకాశ్ తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement