ముంపు తగ్గినా.. భారీ వ్యయమే! | Sakshi
Sakshi News home page

ముంపు తగ్గినా.. భారీ వ్యయమే!

Published Sat, May 23 2015 2:56 AM

construction of additional reservoirs palamurulo The projected cost

‘పాలమూరు’లో అదనపు రిజర్వాయర్ల నిర్మాణంతో
రూ.35 వేల కోట్ల వరకు పెరగనున్న ఖర్చు


హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పాలమూరు ఎత్తిపోతల పథక నిర్మాణ వ్యయం పెరగనుంది.. మార్చిన ప్లాన్‌తో ముంపు ప్రాంతం గణనీయంగా తగ్గుతున్నా, అదనంగా నిర్మించాల్సిన రిజర్వాయర్లతో విద్యుత్ అవసరాలు, నిర్మాణ వ్యయం  పెరుగుతుంది. జూరాల నుంచి నీటిని తీసుకునే ప్లాన్‌లో భాగంగా ప్రాజెక్టు మొత్తానికి రూ.32,200 కోట్ల వరకు వ్యయ అంచనా ఉండగా, ప్రస్తుతం శ్రీశైలం నుంచి నీటిని తీసుకొనే ప్లాన్‌తో అది రూ.35 వేల కోట్లకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీనిపై ఈ నెల 25న స్పష్టత రానుంది.

రిజర్వాయర్లతో పెరగనున్న వ్యయం
ఇక శ్రీశైలం నుంచి నీటిని తీసుకొని రంగారెడ్డి జిల్లాలోని కేపీ లక్ష్మీదేవునిపల్లి వరకు 70 టీఎంసీల వరద నీటిని తరలించేందుకు మొత్తంగా రిజర్వాయర్లను ప్రతిపాదించారు. నార్లాపూర్ వద్ద ఉండే మొదటి రిజర్వాయర్‌తో పాటు ఏదుల, వట్టెం, కర్వేని, లోకిరేవు,కేపీ లక్ష్మీదేవుని పల్లి రిజర్వాయర్లు నిర్మించాలని ప్రతిపాదించారు. ఇందులో కేపీ లక్ష్మీదేవునిపల్లి, వట్టెం రిజర్వాయర్లు 10 టీఎంసీల సామర్ధ్యంతో ఉండేవి కాగా మిగతావి చాలా చిన్నవే. కార్వేని రిజర్వాయర్ సామర్థ్యం ఇంకా తేలాల్సి ఉంది.

ఈ రిజర్వాయర్‌ను 25 టీఎంసీలతో చేపట్టాలని ప్రతిపాదిస్తున్నారు. ఒకవేళ దీనికి ఓకే చెబితే ప్రాజెక్టులో ఇదే పెద్ద రిజర్వాయర్ అవుతుంది. వట్టెం, కర్వేని రిజర్వాయర్లతో గండేడు కింద ప్రతిపాదించిన 5లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరివ్వనున్నారు. ఈ మొత్తం రిజర్వాయర్ల నిర్మాణం, కాల్వల తవ్వకం తదితరాలకు కలిసి మొత్తంగా రూ.35 వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా.దీనికి తోడు జూరాలతో పోలిస్తే శ్రీశైలంలో మరింత ఎక్కువ లోతు నుంచి నీటిని ఎత్తిపోయాల్సి ఉండటంతో ఎక్కువ సామర్ధ్యం ఉన్న పంపులు కావాలి. దీంతో విద్యుత్ అవసరాలు పెరగనున్నాయి. పాత ప్లాన్‌తో 3వేల మెగావాట్ల వరకూ విద్యుత్తు అవసరం ఉండగా, ఇప్పుడు 4 వేల మెగావాట్ల వరకు అవసరమవుతోందని తెలుస్తోంది.
 
తప్పిన ముంపు ప్రమాదం
తొలుత నిర్ణయించిన ప్లాన్ ప్రకారం జూరాలకు వరద ఉండే రోజుల్లో 70 టీఎంసీల నీటిని తీసుకోవడం ద్వారా మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు నీరివ్వాల్సి ఉంది. ప్రాజెక్టులో భాగంగా నిర్మించే మూడు రిజర్వాయర్ల కింద మొత్తంగా 48 గ్రామాలు ముంపునకు గురవుతుండగా, 44 వేల ఎకరాల భూమీ ముంపుబారిన పడుతుంది. సుమారు 90 వేల మంది నిర్వాసితులవుతారు.

70 టీఎంసీల నిల్వ సామర్ధ్యం ఉండే కోయిల్‌కొండ రిజర్వాయర్ కిందే మొత్తంగా 38 గ్రామాలు, 27 వేల ఎకరాల భూమి ముంపునకు గురికానుంది. కొత్త ప్లాన్‌లో కోయిల్‌కొండ లేకపోవడంతో ఈ ముంపు తప్పుతుంది. ముంపునకు గురికానున్న ప్రాంతానికి సైతం నీళ్లిచ్చేలా  ప్రణాళిక ఉండబోతోంది. ఇక రంగారెడ్డి జిల్లా గండేడు వద్ద 45 టీఎంసీల నిల్వ సామర్ధ్యంతో రిజర్వాయర్ నిర్మిస్తే 8 గ్రామాలు,12,283 ఎకరాలు ముంపునకు గురికావల్సి ఉన్నా, ఈ రిజర్వాయర్ సైతం లేకపోవడంతో ఇక్కడా ముంపు తప్పినట్టే.

Advertisement
Advertisement