ఎస్సైపై కొనసాగుతున్న విచారణ | Sakshi
Sakshi News home page

ఎస్సైపై కొనసాగుతున్న విచారణ

Published Wed, Oct 22 2014 3:40 AM

ఎస్సైపై కొనసాగుతున్న విచారణ - Sakshi

విధి నిర్వహణలో నిర్లక్ష్యంపై విమర్శలు

 నిర్మల్ అర్బన్/ నిర్మల్ రూరల్ :
 నిర్మల్ పట్టణంలోని మయూరి ఇన్ లాడ్జ్‌లో ఆదివారం రాత్రి జరిగిన రివాల్వర్ మిస్‌ఫైర్ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. దీనికి సంబంధించి రాయికల్ ఎస్సై రామ్‌నాయక్‌ను మంగళవారం స్థానిక పోలీసులు విచారించినట్లు సమాచారం. సోమవారం ఎస్పీ గజరావు భూపాల్‌తోపాటు డీఎస్పీ మాధవరెడ్డి, రూరల్ సీఐ రఘు విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా లాడ్జిలోని 212 గదిని పరిశీలించారు. అక్కడ పనిచేసే సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

సోమవారం సేకరించిన ఆధారాల ప్రకారం మంగళవారం విచారణ కొనసాగించారు. అప్పటికే రాములునాయక్‌పై సెక్షన్ 286, 337 కింద కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై నవీన్‌కుమార్ తెలిపారు. దీనిపై డీఎస్పీ ఆధ్వర్యంలో విచారణ కూడా చేపడుతున్నట్లు తెలుస్తోంది. సదరు ఎస్సై విచారణలో దోషిగా తేలితే చట్టపరమైన చర్యలతోపాటు శాఖాపరమైన చర్యలు తప్పవని డీఎస్పీ మాధవరెడ్డి పేర్కొన్నారు.

 విధినిర్వహణలో నిర్లక్ష్యం
 రాయికల్ ఎస్సై రామ్‌నాయక్ జిల్లా దాటి నిర్మల్‌కు రావడం, కుంటాల జలపాతంలో విందు చేసుకోవడం.. పైగా దీనికి అధికారికంగా సెలవు తీసుకోకుండా రావడం ఆయన విధి నిర్వహణపై ఉన్న బాధ్యతను తెలియజేస్తోంది. ఆది నుంచి దూకుడు స్వభావంతో పనిచేసే ఎస్సైగా రామ్‌నాయక్‌కు పేరుందని సమాచారం. విధి నిర్వహణలో భాగంగా అత్యవసర సమయంలో ఉపయోగించే సర్వీస్ రివాల్వర్ రెండు రౌండ్లు పేల్చడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

మామూలుగా అయితే రివాల్వర్ నుంచి ఒక్క తూటా బయటపడిన అనంతరం అప్రమత్తమై మరో రౌండ్ తూటా పేలకుండా చర్యలు తీసుకోవచ్చు. కానీ వెనువెంటనే తుపాకీ నుంచి రెండు బుల్లెట్లు రావడం పలు సందేహాలకు తావిస్తోంది. విధి నిర్వహణలో ఉన్న సమయంలో విందుల్లో పాల్గొనడం పోలీస్ వ్యవస్థకు మచ్చతెచ్చే విధంగా ఉందని పలువురు పోలీసులు పేర్కొంటున్నారు.

 సెటిల్‌మెంట్ కోసమేనా..?
 రాయికల్ ఎస్సై అసలు నిర్మల్‌కు ఎందుకు వచ్చినట్లు? కరీంనగర్ జిల్లా ఎంఈవోలతో కలిసి కుంటాల జలపాతానికి వెళ్లిన ఆయన తిరుగు ప్రయాణంలో నిర్మల్‌లో ఎందుకు ఆగారు? ఆయనకు నిర్మల్ డివిజన్‌లోని ఎంపీడీవోలు, ఈవోపీర్డీలు లాడ్జీలో విందు ఎందుకు ఏర్పాటు చేశారు..? వీరి కలయిక వెనుక సెటిల్‌మెంట్ వ్యవహారం ఏమైనా దాగి ఉందా..? అనేది పట్టణంలో చర్చనీయాంశమైంది.

నిర్మల్ డివిజన్‌లోని ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీలు కొందరు ఎన్నికల కంటే ముందు కరీంనగర్ జిల్లాలో పనిచేయడంతో ఎస్సైతో సాన్నిహిత్యం ఏర్పడి ఉండవచ్చనే అనుమానం కలుగుతోంది. ఆ బంధం ఏమైనా ఆర్థిక సంబంధాలకు ఊతమిచ్చిందా అన్న సందే హాలూ వ్యక్తమవుతున్నాయి. అయితే.. ఒకే గదిలో ఉద్యోగులతో కలిసి విందు చేసుకుంటున్న సమయంలో హఠాత్తుగా ఎస్సై రివాల్వర్ పేలడం ప్రమాదవశాత్తు జరిగింది కాదేమోనని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

 వేటు పడేనా...?
 ఎస్సై రివాల్వర్ తూటాలు ఉపయోగిస్తే ఎందుకు, ఎప్పుడు వినియోగించారన్న పూర్తి సమాచారాన్ని ప్రభుత్వానికి లెక్కచెప్పాల్సి ఉంటుంది. అయితే.. ప్రమాదవశాత్తునో, అజాగ్రత్త వల్లనో పేలిన ఈ రెండు తూటాలపై ప్రభుత్వానికి ఎస్సై ఏ విధమైన లెక్కచూపిస్తారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రివాల్వర్ ఉపయోగించే ముందు ఉన్నతాధికారుల అనుమతి తప్పనిసరి. ఈ నియమాలను ఉల్లంఘించిన ఎస్సైపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచిచూడాల్సిందే..!

Advertisement

తప్పక చదవండి

Advertisement