జాదవ్... ప్రయోగాలు ఆదుర్స్ | Sakshi
Sakshi News home page

జాదవ్... ప్రయోగాలు ఆదుర్స్

Published Wed, Jul 30 2014 8:19 PM

జాదవ్... ప్రయోగాలు ఆదుర్స్ - Sakshi

నార్నూర్: వివిధ రంగాల్లో ప్రతిభ కనబరుస్తూ పట్నం పిల్లలకు తామేమీ తీసిపోమని నిరూపిస్తున్నారు గ్రామీణ విద్యార్థులు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని రాజులాగూడకు చెందిన 8వ తరగతి గిరిజన విద్యార్థి జాదవ్ సాయికిరణ్ పలు ప్రయోగాల ద్వారా హీటర్లు, మీక్సీలు తయారుచేస్తూ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. నడ్డంగూడ గ్రామానికి జాదవ్ గణేశ్, శారదబాయిలకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి సంతానం. సాయికిరణ్ తండ్రి అనారోగ్యంతో మూడేళ్లక్రితం మరణించారు.

తల్లి శారదబాయి రాజులాగూడలోని తల్లి కౌసల్యబాయి ఇంట్లో ఉంటూ చిన్న కిరాణం దుకాణం నడుపుతూ ఇద్దరు పిల్లలను చదిస్తోంది. ఆమె వీరికి మార్కెట్ నుంచి రిమోట్‌లతో నడిచే కారు, జీపులు, విమనాలాంటి ఆట  బొమ్మలను ఆడుకోవడానికి తీసుకొవచ్చేది. సాయికూమార్ వీటితో ఆడుతూ అందులో ఉండే మోటర్లను ఉపయోగించి హీటర్, మీక్సీలు తయారుచేశాడు. అతను తయారు చేసిన మీక్సీతో అరకిలో వరకు ఏదైనా పొడిని మిక్సీ పట్టవచ్చంటున్నాడు. హీటర్ ద్వారా 5 లీటర్ల వరకు నీళ్లు వేడి చేసుకోచ్చని ఆయన చేసి చూపెడుతున్నాడు.
 
 
హీటర్ తయారీ..
పొడవువైన రేకును తీసుకోని,  సగం విరగ్గొట్టి రెండు రంధ్రాలు చేయాలి. అందులో విద్యుత్ వైర్లను అమర్చి, బ్యాటరీ సెల్స్‌కు పెట్టినట్లైతే అది వే డెక్కి గిన్నెలో ఉన్న 5 లీటర్ల నీళ్లు వేడి చేస్తుంది.  
 
మిక్సీ తయారీ..
ఒక డబ్బాను తీసుకొని, కింద రంధ్రం చేయాలి. దానికి కిందభాగంలో ఆట వస్తువులకు వాడే రిమోట్ కారు మోటర్‌ను బిగించాలి. మోటర్ పై భాగాన లేజర్ బ్లెడ్‌ను అమర్చిన తరువాత మోటర్‌కు విద్యుత్ తీగలతో కనెక్షన్ ఇచ్చి, ఆ తీగలను బ్యాటరీ సెల్‌కు పెడితే మిక్సీ పనిచేస్తుంది. దీంతో అరకిలో ధనియాల పొడి పట్టవచ్చు. ఇలాంటి ప్రయోగాలు చేసి చూపెడుతూ.. అందర్నీ ఆశ్చర్యచకితులను చేస్తున్న సాయికిరణ్.. భవిష్యత్‌లో ఈ ప్రయోగాలతో రాణించాలన్నదే తన లక్ష్యమంటున్నాడు.

Advertisement
Advertisement