ఇదేమి చోద్యం ! | Sakshi
Sakshi News home page

ఇదేమి చోద్యం !

Published Wed, Nov 23 2016 2:40 AM

karnataka assembly  Winter Session

 సాక్షి, బెంగళూరు:   రుణమాఫీ విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదా? ఈ విషయంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, సహకార శాఖ మంత్రి హెచ్.ఎస్ మహదేవ ప్రసాద్ తలోదారిలో ప్రయాణిస్తున్నారా?.. అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఇందుకు మంగళవారం జరిగిన సంఘటనలను విపక్షాలతో పాటు రైతుల సంఘాల నాయకులు ప్రస్తావిస్తున్నారు. శీతాకాల సమావేశాల్లో భాగంగా బెళగావిలో రెండో రోజు మంగళవారం ప్రశ్నోత్తరాల సమయం కంటే ముందే శాసనసభలో విపక్ష సభ్యులు కరువుపై చర్చకు పట్టుబట్టాయి.
 
  50 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొని రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని బీజేపీ, జేడీఎస్ ఎమ్మెల్యేలు శాసనసభ దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం తక్షణం వ్యవసాయ రుణాలను మాఫీ చేయాలని పట్టుబట్టారు. కలుగజేసుకున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య..రైతుల కష్టాలు తమకూ తెలుసన్నారు. సహకార సంఘాల్లో తీసుకున్న పంటరుణాలను మాఫీ చేసే విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. 
 
 ఈ విషయమై ఇప్పటికే వివిధ మార్గాల్లో నివేదికలు కూడా తెప్పించుకున్నామని పేర్కొంటూ మొదట ప్రశ్నోత్తరాల సమయానికి సహకరించాలని విపక్షాలకు సూచించారు. ఈ సమయంలో స్పీకర్ కోడివాళ  కలుగజేసుకోవడంతో కొశ్చన్ అవర్ ప్రారంభమైంది. ఇదిలాఉండగా చెరకు ఫెరుుర్ అండ్ రెమ్యూనిరేటీవ్ (ఎఫ్‌ఆర్‌పీ) ధరను పెంచే విషయంతో పాటు బకాయిల చెల్లింపు తదితర విషయాలకు సంబంధించి రైతు సంఘం నాయకులతో సహకార శాఖ మంత్రి మహదేవ ప్రసాద్ బెళగావిలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 
 
 అనంతరం మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో వ్యసాయ రుణాలను మాఫీ చేస్తే ప్రభుత్వ ఖజానాపై రూ.9,978 కోట్లు భారం పడుతుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో  ఇంత ఆర్థికభారాన్ని ప్రభుత్వం మోయలేదని తేల్చిచెప్పారు. అందువల్ల రైతుల రుణాల మాఫీ చేయలేమని స్పష్టం చేశారు. అరుుతే రుణాల వడ్డీలను రీ షెడ్యూల్ చేసే విషయం మాత్రం అలోచిస్తామన్నారు. దీనిపై రాష్ట్ర చెరుకు రైతు సంఘం అధ్యక్షుడు కురుబూరు శాంతకుమార్  స్పందిస్తూ..ఒకే విషయమై బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న వారు విరుద్ధ వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.  
 
 చర్చలు విఫలం... 
 చెరకుకు ఫెయిర్ అండ్ రెమ్యూనిరేటీవ్ (ఎఫ్‌ఆర్‌పీ) పెంపు విషయంతో పాటు బకారుుల చెల్లింపుపై ప్రభుత్వం, రైతు సంఘం నాయకుల మధ్య ఏర్పడిన ప్రతిష్టంబన తొలగలేదు. ఎఫ్‌ఆర్‌పీని టన్నుకు రూ.3,050 వరకు పెంచాలని రైతు సంఘం నాయకులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా రైతులకు చక్కెర కర్మాగారాల నుంచి రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలనేది వారి మరొక ప్రధాన డిమాండ్.
 
  ఈ నేపథ్యంలో రాష్ట్ర సహకార శాఖ మంత్రి మహదేవ ప్రసాద్ అధ్యక్షతన బెళగావిలో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చెరకు రైతు సంఘం నాయకులు, వివిధ ప్రభుత్వశాఖల ఉన్నతాధికారులు, చక్కర కర్మాగార యాజమాన్యం ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చెరుకు ఎఫ్‌ఆర్‌పీ పెంచడం సాధ్యం కాదని మహదేవ ప్రసాద్ రైతులతో పేర్కొన్నారు. దీంతో ఆగ్రహం చెందిన రైతులు ’చక్కెర యాజమాన్యం లాబీకి తలొగ్గిన మంత్రికి  రైతుల కష్టాలు అర్థం కావడం లేదు.  చెరుకు ఎఫ్‌ఆర్‌పీ పెంచేంతవరకూ తాము వెనకడుగువేసేది లేదు. 
 
 వెంటనే బకాయిలను చెల్లించాలి. అప్పటి వరకూ బెళగావిలో వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేస్తుంటాం’ అని పేర్కొంటూ సమావేశం నుంచి అర్థాతరంగా బయటకి వచ్చేశారు. అటుపై మంత్రి మహదేవ్‌ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ...మంగళవారం జరిగిన చర్చలు అసంపూర్ణంగా ముగిసాయన్నారు. ఈ విషమై ఈనెల 24న మరోసారి రైతు సంఘం నాయకులతో చర్చిస్తామన్నారు. సమస్యకు తప్పక పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.     
 

Advertisement
 
Advertisement
 
Advertisement