సముద్రంలో రూ.వెయ్యి నోట్లు | Sakshi
Sakshi News home page

సముద్రంలో రూ.వెయ్యి నోట్లు

Published Thu, Aug 13 2015 1:11 AM

సముద్రంలో రూ.వెయ్యి నోట్లు - Sakshi

♦ గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద సముద్రంలో కొట్టుకొచ్చిన నోట్లు
♦ నోట్ల కోసం బారులు తీరిన జనం
♦ దర్యాప్తు చేస్తున్న నగర పోలీసులు
 
 సాక్షి, ముంబై : డబ్బులు చెట్లకు కాయవని, ఆకాశం నుంచి ఊడి పడవని అందరికీ తెలుసు. కానీ డబ్బుల వర్షం కురిస్తే, కళ్ల ముందే అలా అలా తేలుతూ పోతే.. అవీ వెయ్యి రూపాయల నోట్లు. ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద మంగళవారం సాయంత్రం అచ్చం ఇలాగే జరిగింది.ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు కానీ సముద్రంలో రూ. వెయ్యి నోట్లు తేలుతూ వస్తున్నాయి. క్షణాల్లో ఈ విషయం దావానలంలా వ్యాపించింది. దీంతో మత్స్యకారులు, ఈతగాళ్లు అక్కడికి చేరుకుని నోట్ల ‘వేట’లో పడ్డారు.

తలా కొన్ని నోట్లను దక్కించుకున్నారు. జనప్రవాహం, నీటి ఉధృతి పెరగడంతో అక్కడికి వచ్చిన వారంతా చేసేదేమీ లేక ఉసూరుమంటూ చూస్తూ ఉండిపోయారు. మరికొంత మంది ఈ దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించారు. ఇంతలో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, ప్రాణాలకు తెగించి డబ్బుల కోసం ప్రయత్నిస్తున్న వారిని వారించి, జనాన్ని చెదరగొట్టారు. ‘ముందు ఒక నోటు కనపడింది. పెద్దగా పట్టించుకోలేదు. కానీ వరుసగా చాలా నోట్లు కనిపించాయి. అంతే సముద్రంలోకి దూకేశా. ఈ డబ్బు చూస్తూంటే భలేగా ఉంది’ అని తన అనుభవాన్ని పంచుకున్నాడు హరి సూరియా అనే స్థానికుడు.

అయితే ఈ వెయ్యి రూపాయల నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయనేది మాత్రం అంతుబట్టడంలేదు. దొంగల బారి నుంచి కాపాడుకోవడానికి ఓ ధనవంతుడు రూ.లక్షలున్న డబ్బుల సంచిని సముద్రంలోకి విసిరేశాడనే కథనం ప్రచారంలో ఉంది. గేట్ వే ఆఫ్ ఇండియాకు ఎదురుగా ఉన్న ప్రఖ్యాత తాజ్ హోటల్‌లో బస చేసిన వ్యక్తే ఈ కరెన్సీని విసిరేసి ఉండవచ్చన్న ఉదంతి కూడా ఉంది. పోలీసులు సీసీ టీవీ కెమరాల వీడియో ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. ఇంకా ఏ విషయాన్ని ఇంకా నిర్ధారించలేదు. కొద్ది రోజులాగితే మొత్తం వ్యవహారం బయటపడొచ్చు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement