గ్రూప్‌–2 హాల్‌టికెట్ల జారీలో గందరగోళం | Sakshi
Sakshi News home page

గ్రూప్‌–2 హాల్‌టికెట్ల జారీలో గందరగోళం

Published Tue, Feb 14 2017 12:47 AM

గ్రూప్‌–2 హాల్‌టికెట్ల జారీలో గందరగోళం - Sakshi

పలువురికి డౌన్‌లోడ్‌ కాని హాల్‌టికెట్లు
తీవ్ర ఆందోళనలో అభ్యర్థులు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రూప్‌ 2 కేటగిరీ ఉద్యోగాల భర్తీకోసం ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ఈనెల 26న నిర్వహించనున్న ప్రిలిమ్స్‌ పరీక్షకు హాల్‌టికెట్ల జారీ ప్రక్రియ గందరగోళంగా మారింది. ఆదివారం నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ ప్రకటించడంతో అభ్యర్థులు డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు ప్రయత్నించారు. ఎక్కువమందికి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ కాలేదు. జారీ అయినవి కూడా తప్పులతడకగా ఉన్నాయి. కొందరికి అసలు దరఖాస్తు చేయనేలేదనే సమాచారం వచ్చింది. పలువురు బీసీ అభ్యర్థులకు ఓసీలుగా వచ్చింది. బీసీ–ఏ కులానికి చెందిన కొందరికి బీసీ–సీ అని వచ్చింది. గ్రూప్‌ 2లో 982 (442 ఎగ్జిక్యూటివ్, 540 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌) పోస్టుల భర్తీకోసం గత నవంబర్‌లో నోటిఫికేషన్‌ జారీచేయడంతో 6,57,010 మంది (తెలంగాణ వారితో కలిపి) దరఖాస్తు చేసుకున్నారు.

రిజర్వేషన్ల అంశంపై వివాదం
గ్రూప్‌ 2 నోటిఫికేషన్లో ప్రిలిమ్స్‌ నిర్వహిస్తామన్నారే తప్ప రిజర్వేషన్ల ప్రకారం మెయిన్స్‌కు ఎంపికచేసే విధానం ఉండదని తెలపలేదని అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.  డిప్యూటీ తహసీల్దార్‌ పోస్టులకు సంబంధించి ప్రిలిమ్స్, మెయిన్స్‌ పూర్తిచేసిన అభ్యర్థులు తప్పనిసరిగా కంప్యూటర్‌ అప్లికేషన్‌ పరీక్షలో కూడా అర్హత సాధించాలన్న నిబంధనపై నిరుద్యోగులు మండిపడుతున్నారు.  
 
తప్పులు సరిచేస్తున్నాం:ఏపీపీఎస్సీ చైర్మన్‌
అభ్యర్థుల ఆందోళనల గురించి ఏపీపీఎస్సీ చైర్మన్‌ ఉదయభాస్కర్‌తో ప్రస్తావించగా ఈ సమస్యలు తమ దృష్టికి వచ్చాయని చెప్పారు. వీటిని సరిచేయిస్తున్నామన్నారు. కులం సమాచారం తప్పుగా వచ్చిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement