ఫుల్ రైజింగ్ | Sakshi
Sakshi News home page

ఫుల్ రైజింగ్

Published Sun, May 3 2015 1:22 AM

ఫుల్ రైజింగ్

హైదరాబాద్ ఘన విజయం
22 పరుగులతో చెన్నై చిత్తు
చెలరేగిన వార్నర్
రాణించిన బౌలర్లు

సొంతగడ్డపై హైదరాబాద్ లెక్క సరిచేసింది. చెన్నైలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది. ఉప్పల్‌లో ఉప్పెనలా సాగిన వార్నర్ బ్యాటింగ్‌కు తోడు మరోసారి బౌలర్లు సమయానుకూలంగా స్పందించడంతో లీగ్‌లో సన్ మళ్లీ రైజ్ అయ్యింది. కీలక విజయం జట్టు ఖాతాలో చేరింది. మరోవైపు బ్యాటింగ్ వైఫల్యంతో సూపర్ కింగ్స్ తలవంచింది. టి20లో తన 200వ మ్యాచ్ ఆడిన ధోనికి నిరాశ మిగిలింది.

సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. సొంత మైదానం హైదరాబాద్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లో సన్ 22 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 పరుగుల భారీ స్కోరు సాధించింది. డేవిడ్ వార్నర్ (28 బంతుల్లో 61; 11 ఫోర్లు, 1 సిక్స్) లీగ్‌లో ఐదో అర్ధ సెంచరీ సాధించగా, ధావన్ (32 బంతుల్లో 37; 4 ఫోర్లు), మోర్గాన్ (27 బంతుల్లో 32 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించారు. బ్రేవోకు 3 వికెట్లు దక్కాయి. అనంతరం చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 170 పరుగులు మాత్రమే చేయగలిగింది. డు ప్లెసిస్ (22 బంతుల్లో 33; 4 ఫోర్లు)దే అత్యధిక స్కోరు. హెన్రిక్స్, భువనేశ్వర్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.

వహ్వా వార్నర్...
టాస్ గెలిచిన చెన్నై ఫీల్డింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్ ఆడిన తుది జట్టునే చెన్నై కొనసాగించగా... హైదరాబాద్ బొపారా స్థానంలో మోర్గాన్‌కు చోటిచ్చింది. సన్‌రైజర్స్‌కు ఓపెనర్లు వార్నర్, ధావన్ శుభారంభం అందించారు. ముఖ్యంగా వార్నర్ తొలి బంతి నుంచే చెలరేగిపోయాడు. ఇన్నింగ్స్ మొదటి బంతికి ఫోర్ బాదిన అతను అదే ఓవర్ చివరి బంతిని ఫోర్‌తో ముగించాడు. మోహిత్ వేసిన మూడో ఓవర్లోనైతే అతను 3 ఫోర్లు, 1 సిక్సర్‌తో విరుచుకు పడ్డాడు. ఫలితంగా ఆ ఓవర్లో 19 పరుగులు వచ్చాయి.

నెహ్రా వేసిన రెండు ఓవర్లలో రెండేసి ఫోర్లు బాదిన అతను రోనిత్ మోరె తొలి ఓవర్లు మళ్లీ రెండు బౌండరీలు కొట్టాడు. ఈ క్రమంలో కేవలం 20 బంతుల్లోనే అతని అర్ధ సెంచరీ పూర్తయింది. మరోవైపు ధావన్ మాత్రం తగిన జోరు కనబర్చలేకపోయాడు. 11వ బంతికి మొదటి బౌండరీ కొట్టిన అతను ఆ తర్వాత కూడా ఆశించిన దూకుడు కనబర్చలేదు.

 ఎట్టకేలకు 9వ ఓవర్లో రైనా ఈ జోడీని విడదీశాడు. వార్నర్ తర్వాత వచ్చిన హెన్రిక్స్ (9 బంతుల్లో 19; 1 ఫోర్, 2 సిక్సర్లు) అదే ఓవర్లో రెండు భారీ సిక్స్‌లు కొట్టాడు. అయితే హెన్రిక్స్ మరుసటి ఓవర్లోనే వెనుదిరగ్గా...కొద్ది సేపటికే లేని రెండో పరుగు కోసం ప్రయత్నించి ధావన్ రనౌటయ్యాడు. నమన్ ఓజా (12 బంతుల్లో 20; 3 ఫోర్లు, 1 సిక్స్) మరి కొన్ని పరుగులు జోడించగా...చివర్లో మోర్గాన్ మెరుపులతో రైజర్స్ మెరుగైన స్కోరు వద్ద ఇన్నింగ్స్ ముగించింది. వార్నర్ దూకుడుతో తొలి 10 ఓవర్లలో 107 పరుగులు చేయగలిగిన సన్ జట్టు, తర్వాతి 10 ఓవర్లలో 85 పరుగులు మాత్రమే చేసింది.

అంతా అంతంత మాత్రంగా...
చెన్నై ఇన్నింగ్స్‌ను మెకల్లమ్ (5 బంతుల్లో 12; 3 ఫోర్లు), స్మిత్ (19 బంతుల్లో 21; 3 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆరంభించారు. బౌల్ట్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టిన మెకల్లమ్, భువీ ఓవర్లో క్లీన్ బౌల్డయ్యాడు. మరో వైపు బౌల్ట్ ఓవర్లో రెండు ఫోర్లు, భువనేశ్వర్ బౌలింగ్‌లో సిక్స్‌తో జోరు పెంచిన స్మిత్... మరో భారీ షాట్‌కు ప్రయత్నించి  డీప్ స్క్వేర్‌లెగ్‌లో విహారి అద్భుత క్యాచ్‌కు వెనుదిరిగాడు.

ఆ తర్వాత మూడు భారీ సిక్స్‌లతో దూకుడు ప్రదర్శించిన రైనా (15 బంతుల్లో 23; 3 సిక్సర్లు) కూడా ఎక్కువ సేపు నిలవలేదు. ఆ తర్వాత డు ప్లెసిస్, ధోని (16 బంతుల్లో 20; 2 ఫోర్లు) కలిసి నిలకడగా ఆడారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు  5 ఓవర్లలోనే 46 పరుగులు జోడించారు. అయితే ఆశిష్ రెడ్డి ఓవర్లో వరుస బంతుల్లో వీరిద్దరు అవుట్ కావడంతో మ్యాచ్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఆ తర్వాత బ్రేవో (20 బంతుల్లో 25 నాటౌట్; 3 ఫోర్లు) కాస్త పోరాడినా లాభం లేకపోయింది. మ్యాచ్‌లో ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయని జడేజా బ్యాటింగ్‌లోనూ ఎనిమిదో స్థానంలో వచ్చి నిరాశపరిచాడు.

స్కోరు వివరాలు
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) స్మిత్ (బి) రైనా 61; ధావన్ (రనౌట్) 37; హెన్రిక్స్ (స్టంప్డ్) ధోని (బి) నేగి 19; మోర్గాన్ (నాటౌట్) 32; నమన్ ఓజా (బి) నెహ్రా 20; ఆశిష్ రెడ్డి (సి) ధోని (బి) బ్రేవో 6; విహారి (సి) (సబ్) అపరాజిత్ (బి) బ్రేవో 8; కరణ్ (సి) జడేజా (బి) బ్రేవో 4; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 192.

వికెట్ల పతనం: 1-86; 2-107; 3-131; 4-156; 5-163; 6-188; 7-192.
బౌలింగ్: మోహిత్ 4-0-58-0; నెహ్రా 4-0-31-1; మోరె 2-0-28-0; రైనా 4-0-29-1; బ్రేవో 4-0-25-3; నేగి 2-0-20-1.

చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: డ్వేన్ స్మిత్ (సి) విహారి (బి) హెన్రిక్స్ 21; మెకల్లమ్ (బి) భువనేశ్వర్ 12; రైనా (సి) మోర్గాన్ (బి) హెన్రిక్స్ 23; డు ప్లెసిస్ (రనౌట్) 33; ధోని (బి) ఆశిష్ 20; నేగి (బి) భువనేశ్వర్ 15; బ్రేవో (నాటౌట్) 25; జడేజా (నాటౌట్) 14; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 170.

వికెట్ల పతనం: 1-14; 2-48; 3-68; 4-114; 5-114; 6-141.
బౌలింగ్: బౌల్ట్ 4-0-44-0; భువనేశ్వర్ 4-1-32-2; ప్రవీణ్ 4-0-33-0; హెన్రిక్స్ 4-0-20-2; కరణ్‌శర్మ 2-0-19-0; ఆశిష్ రెడ్డి 2-0-19-1.  
 

Advertisement

తప్పక చదవండి

Advertisement