పోరాడి ఓడిన హారిక | Sakshi
Sakshi News home page

పోరాడి ఓడిన హారిక

Published Wed, Apr 1 2015 1:23 AM

పోరాడి ఓడిన హారిక

ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్
సోచి (రష్యా): ఒత్తిడిలో తడబడిన భారత గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ప్రపంచ మహిళల నాకౌట్ చెస్ చాంపియన్‌షిప్‌లో సెమీఫైనల్లో ఓటమి పాలైంది. అంతర్జాతీయ మాస్టర్ (ఐఎం) హోదా ఉన్న మరియా ముజిచుక్ (ఉక్రెయిన్)తో జరిగిన సెమీఫైనల్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి హారిక 2.5-3.5 పాయింట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. క్లాసికల్ పద్ధతిలో జరిగిన నిర్ణీత రెండు గేమ్‌ల తర్వాత ఇద్దరూ 1-1తో సమఉజ్జీగా నిలువడంతో విజేతను నిర్ణయించడానికి మంగళవారం ర్యాపిడ్ పద్ధతిలో టైబ్రేక్ గేమ్‌లను నిర్వహించారు. తొలుత 25 నిమిషాల నిడివి కలిగిన రెండు గేమ్‌లు జరిగాయి.

ఇందులో తొలి గేమ్‌లో హారిక 38 ఎత్తుల్లో ఓడిపోయింది. అయితే వెంటనే తేరుకొని రెండో గేమ్‌లో హారిక 80 ఎత్తుల్లో గెలుపొందడంతో స్కోరు 1-1తో సమమైంది. దాంతో ఈసారి 10 నిమిషాల నిడివి కలిగిన రెండు గేమ్‌లను నిర్వహించారు. ఇందులో తెల్లపావులతో తొలి గేమ్‌ను ఆడిన హారిక 96 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది.

ఒకానొక దశలో హారికకు ఈ గేమ్‌లో స్పష్టమైన విజయావకాశాలు కనిపించాయి. కానీ మరియా ముజిచుక్ చక్కటి వ్యూహాలతో ‘డ్రా’ చేసుకోగలిగింది. ఇక రెండో గేమ్‌లో తెల్లపావులతో ఆడిన మరియా 56 ఎత్తుల్లో హారికపై నెగ్గి విజయాన్ని ఖాయం చేసుకుంది. 2012 ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ హారిక సెమీఫైనల్ దశలోనే నిష్ర్కమించింది.
 
గురువారం మొదలయ్యే నాలుగు గేమ్‌ల ఫైనల్లో నటాలియా పోగోనినా (రష్యా)తో మరియా ముజిచుక్ తలపడుతుంది. రెండో సెమీఫైనల్లో పోగోనినా టైబ్రేక్‌లో 1.5-0.5తో పియా క్రామ్లింగ్ (స్వీడన్)పై గెలిచింది. మరియా, పోగోనినా మధ్య ఫైనల్లో గెలిచిన వారు ఈ ఏడాది చివర్లో హూ ఇఫాన్ (చైనా)తో ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో తలపడతారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement