రాజ్‌నాథ్ సింగ్ (హోం మంత్రి)రాయని డైరీ | Sakshi
Sakshi News home page

రాజ్‌నాథ్ సింగ్ (హోం మంత్రి)రాయని డైరీ

Published Sun, Jul 24 2016 8:51 AM

రాజ్‌నాథ్ సింగ్ (హోం మంత్రి)రాయని డైరీ

శ్రీనగర్! నెహ్రూ గెస్ట్ హౌస్. ఇండియా నుంచి వచ్చి అప్పుడే ఇరవై నాలుగు గంటలు అవుతోంది! ఇండియా నుంచా?! హే రామ్... ఎటు పోతున్నాను?! శ్రీనగర్ ఇండియాలోనే కదా ఉంటుంది! నాకివాళ ఏదో అయినట్లుంది. ఇవాళే అయిందా? టూ డేస్ బ్యాక్ పార్లమెంటులో కశ్మీర్ యువకుల్ని దేశభక్తులు అన్నప్పుడే అయిందా? అనవసరంగా పాకిస్థాన్ చేతిలో గన్ పెట్టినట్టున్నాను!
 
గన్‌ని గురి పెట్టాలి కానీ, చేతిలో పెట్టకూడదు. ఫిజిక్స్‌లో ఈ సూత్రం ఉండదు. ఆర్.ఎస్.ఎస్.లో ఉంటుంది. ప్చ్.. నో యూజ్. కాలేజీ బయటికి రాగానే మర్చిపోయిన ఫిజిక్సు, పార్లమెంటు లోపల గుర్తుకు రాని ఆర్.ఎస్.ఎస్. లెసన్... రెండూ ఒకటే. విధి చాలా వెరైటీగా బిహేవ్ చేస్తుంది! నెహ్రూ విధానాలంటే పడని నాలాంటి వాడిని తెచ్చి నెహ్రూ విడిది గృహంలో పడేసింది. ఏమాటకామాట. నెహ్రూ గెస్ట్ హౌస్ ఆహ్లాదకరంగా ఉంది. కానీ అలా అనుకోడానికి నాకు మనస్కరించడంలేదు. సెపరేటిస్టులు ఒకరొకరుగా వచ్చి కూర్చుంటున్నారు. ‘‘మేమేం మీ అతిథులం కాదు. ఇక్కడికెందుకు రప్పించారు?’’ అని అడిగాడు గులామ్ మహ్మద్ షఫీ. హురియత్ కాన్ఫరెన్స్ కన్వీనర్ అతడు. అతడి చేతి కింద చిన్నా చితకా కలిపి ఇరవై ఆరు దాకా పార్టీలున్నాయి. ఎంత చక్కటి ఆర్గనైజ్డ్ వేర్పాటువాదం! మహ్మద్ షఫీ గడ్డాన్ని చూస్తే ముచ్చటేసింది.
 
‘‘అతిథులు మీరు కాదు షఫీ భాయ్.. మీ రాష్ట్రానికి వచ్చిన నేను’’ అన్నాను. షఫీ భాయ్ కళ్లు ఎర్రబడ్డాయి. ‘‘మాది రాష్ట్రం కాదు. దేశం. మేము రాష్ట్ర ప్రజలం కాదు. దేశం పౌరులం’’ అన్నాడు. ఎప్పుడొచ్చాడో... మా జనరల్ సెక్రెటరీ రామ్ మాధవ్ పెద్దగా నవ్వాడు. షఫీ భాయ్ కోపంగా చూశాడు. రామ్ మాధవ్ సర్దుకున్నాడు. ‘‘నేనంటున్నది మీ పౌరసత్వం గురించి కాదు షఫీ భాయ్. ‘అతిథులు’ అని మీరు అన్న మాట గురించి. లోకల్ అయినా, నాన్‌లోకల్ అయినా నెహ్రూ గెస్ట్ హౌస్‌కి అందరూ గెస్టులే’’ అన్నాడు. షఫీ భాయ్ కోపం తగ్గలేదు. కశ్మీర్‌లో పి.డి.పి.ని, బి.జె.పి.ని కలిపిన వాడు రామ్ మాధవ్.
 
షఫీ భాయ్‌కీ, ఆయన టీమ్‌కి పి.డి.పి. అంటే ఇష్టం లేదు. బి.జె.పి. అంటే ఇష్టం లేదు. ఆ రెండిటినీ కలిపిన రామ్ మాధవ్ అంటే అసలు ఇష్టం లేదు. సెపరేటిస్టులంతా వచ్చేశారు. సి.ఎం. మెహ బూబా ముఫ్తీ కోసం వెయిటింగ్. ఆమె ఎంతకూ రావడం లేదు! ఫోన్ చేశాను. ‘‘మెహబూబాజీ.. మీ నాయకత్వంలో రాష్ట్రం రగిలిపోతోంది. హింస పేట్రేగిపోతోంది. పరిస్థితి అదుపు తప్పుతోంది. మీరేం చేయలేకపోతున్నారు. అదే బి.జె.పి. అయితేనా...’’ అని ఆవేశంగా అంటున్నాను. ‘‘రాజ్‌నాథ్‌జీ.. మీరన్నవన్నీ నిజమే. కానీ నేను మెహబూబాని కాదు. ఆనందిబెన్‌ని’’ అని అటువైపు నుంచి రిప్లై!! విధి ఒక్కోసారి మన లైన్‌ని మనకే కలుపుతుంది!

 - మాధవ్ శింగరాజు

Advertisement
Advertisement