కుష్వంత్: తెగ బతికిన అక్షరం | Sakshi
Sakshi News home page

కుష్వంత్: తెగ బతికిన అక్షరం

Published Sat, Mar 22 2014 3:43 AM

కుష్వంత్: తెగ బతికిన అక్షరం - Sakshi

కుష్వంత్ సింగ్‌కు పంజాబీ, ఉర్దూ రావడం ఆ భాషల్లోని రచయితల అదృష్టం. ఇలస్ట్రేటెడ్ వీక్లీలో  అతని అనువాదాల వలన వారి రచనలు ఇంగ్లిష్‌లో యావద్భారతీయులకు చేరేవి.
 
 
 కుష్వంత్ సింగ్‌కు నివాళి అనగానే నాకు ఒక విషయం గుర్తుకు వచ్చింది. ఎవరైనా చనిపోగానే అందరూ ఆకాశానికి ఎత్తేస్తూ రాస్తారు కదా. కుష్వంత్ సింగ్ మాత్రం ఆ వ్యక్తిలోని లోపాలన్నీ ఏకరువు పెడుతూ ఎలిజీ (శోక రచన) రాసేవాడు. ఇవన్నీ అతను బతికుండగా రాయలేదేం అంటే ‘పరువు నష్టం దావా వేస్తారని భయం’ అనేవాడు ఏ మాత్రం సిగ్గు పడకుండా. ఇలాంటి కుష్వంత్ సింగ్ మరణిస్తే అతని ఎలిజీ ఎలా ఉంటుంది అని ఊహిస్తూ ధీరేన్ భగత్ అనే జర్నలిస్టు, కుష్వంత్ ఫ్యామిలీ ఫ్రెండు కొన్నేళ్ల క్రితం ఓ పత్రికలో రాశాడు. దానిలో ‘కుష్వంత్ పెద్ద రసికుడిలా ఫోజు పెట్టేవాడు కానీ అదంతా ఒట్టిది. ఒళ్లు నొప్పలు తగ్గడానికి పెట్టుకున్న వేడినీళ్ల బాటిల్ తప్ప అతని పక్కలో వేరే ఎవరూ ఉండేవారు కాదు’ అంటూ సరదాగా రాశాడు. దానిని చదివి కుష్వంత్ కోపం తెచ్చుకోలేదు సరికదా మెచ్చుకున్నాడు. ఈ రోజు కుష్వంత్ నిజంగా చనిపోయాక ఎవరూ అలా రాస్తారనుకోను. ఎందుకంటే కుశ్వంత్ గురించి పైకి ఏ అభిప్రాయం ఉన్నా లోపల అందరికీ గౌరవమే అని నా నమ్మకం.


 కుష్వంత్ సింగ్‌కు అనేక విషయాలపై లోతైన పరిజ్ఞానం ఉంది. మంచి కంటే చెడుపై పాఠకులకు ఆసక్తి ఉంటుందని గ్రహించి దానిని బయటపెట్టడం అతడి ధోరణి. దాన్నే తన యుఎస్‌పి (విలక్షణ ఆకర్షణీయాంశం) చేసుకున్నాడు. అయితే అది కూడా ఏదో సంఘసంస్కర్తలా కాక ఉబుసుపోక ధోరణిలో కబుర్లు చెప్పినట్టుగా చెప్పేవాడు. అందుకే అతనిలో తప్పులు వెతికేవాళ్లు కూడా అతని ఆ సరదా శైలికి ముగ్ధులై చదువుతారు. మనలో ఒకడు చెబుతున్న కబుర్లు అనిపించడం అతడి బాణి. కాని కుష్వంత్ సింగ్ మనలో ఒకడు కాదు. అతడిది అరిస్టోక్రాటిక్ కుటుంబం. న్యూఢిల్లీ కట్టిన కాంట్రాక్టర్లలో వాళ్ల నాన్న ఒకరు. విద్యాభ్యాసం విదేశాల్లో కూడా సాగింది. అతనికి పిల్లనిచ్చినవారు కూడా కులీనులే. ఫారిన్ సర్వీసుల్లో పని చేసి చివరకు రచనా వ్యాసంగానికి మొగ్గు చూపాడు. ‘ట్రెయిన్ టు పాకిస్తాన్’ నవలతో చాలా ఖ్యాతి గడించాడు. తన రచనల్లో శృంగారమే కాదు అనేక విషయాలు నిర్మొహమాటంగా రాసేవాడు. టాయిలెట్ విషయాలపై అబ్సెషన్ జాస్తి. అతని దృష్టిలో అంటరాని అంశం అంటూ సృష్టిలో లేదు.
 

కుష్వంత్ సింగ్ ట్రావెలాగ్‌లు ఆసక్తికరంగా ఉంటాయి. అంతర్జాతీయ సదస్సుకి వెళ్లి అక్కడి మైక్ టెస్టింగ్‌లో జరిగిన చిన్న తమాషా కూడా కవర్ చేస్తాడు. కుష్వంత్ సింగ్ అనగానే చాలా మందికి జోక్ బుక్సే గుర్తుకు వస్తాయి. అవన్నీ అతను సేకరించి మెరుగులు దిద్దినవే. అతను ధరించిన అనేక టోపీల్లో అది కూడా ఒకటి. కాని అతన్ని ఏ టోపీలో చూడాలని ఉందని నన్నడిగితే- కుష్వంత్ సింగ్- ద ఎడిటర్‌ను ఎంచుకుంటాను. ‘ద ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా’ని అతను తీర్చిదిద్దిన తీరు అమోఘం. అప్పటి దాకా ఆ వీక్లీ పెద్దవాళ్ల పత్రికలా మర్యాదగా ఉండేది. 1969లో కుష్వంత్ రాగానే దాని వలువలు విప్పేసినంత పని చేశాడు. దేని గురించైనా ఎవరైనా ఏ స్థాయిలోనైనా వాదించగల విభేదించగల వేదికగా తయారు చేశాడు. తనను తిడుతూ రాసిన లేఖలు కూడా ప్రచురించేవాడు. ఆ రోజుల్లో ఇలాంటి మాస్ ఎడిటర్ ఒక సంచలనం. ఆ రోజుల్లో నాలాంటి కాలేజ్ స్టూడెంట్లు ఇంగ్లిష్ మేగజీన్లు చదివేందుకు ప్రేరణకు కలిగించింది కుష్వంత్ సింగ్ సారధ్యంలోని ఇలస్ట్రేటెడ్ వీక్లీనే.


 కుష్వంత్‌కు పంజాబీ, ఉర్దూ రావడం ఆ భాషల్లోని రచయితల అదృష్టం. ఇలస్ట్రేటెడ్ వీక్లీలో అతని అనువాదాల వలన వారి రచనలు ఇంగ్లిష్‌లో యావద్భారతీయులకు చేరేవి. కుష్వంత్‌కు తెలుగు వస్తే ఎంత బాగుండేదో అనుకునేవాణ్ణి. వీక్లీలో ఎన్ని గంభీరమైన విషయాలున్నా దాని ప్యాకింగ్‌లో కుష్వంత్ సెన్సేషనలిజాన్ని నమ్ముకున్నాడు.  ‘సిద్దార్థ’ సినిమా వచ్చినప్పుడు శశికపూర్‌తో సిమి గరేవాల్ దిగంబరంగా దిగిన దృశ్యాన్ని ముఖచిత్రంపై వేశాడు. వీక్లీ విడుదల కాగానే సంచలనం. ఒక్కరోజులో కాపీలు అయిపోయాయి. సిమి అది చూసి కుష్వంత్‌పై కేసు పెట్టింది. నిజానికి సిమి కుష్వంత్‌కు మేనకోడలి వరుసట. వ్యాపారమే తప్ప కుష్వంత్‌కు వావివరసలు పట్టవు అని తిట్టిపోశారు కొందరు.


 1978 జూలైలో రిటైర్ కావడానికి ఒక వారం ముందుగా యాజమాన్యం కుష్వంత్‌ను వీక్లీ ఎడిటర్‌గా తీసేసింది. దీని వెనుక అధికారంలోకి వచ్చిన జనతా పార్టీ హస్తం ఉంది. ఇందుకు కారణం కుష్వంత్ ఇందిరా గాంధీని, సంజయ్‌ను, అతని చిన్నకారు ప్రాజెక్టును వెనకేసుకురావడమేనంటారు. సంజయ్ తయారు చేసిన చిన్నకారు కదలకుండా మొరాయించినా తను దానిలో ప్రయాణించినట్లు అద్భుతంగా ఉన్నట్లు అసత్యాలు రాసి ప్రచారం చేశాడు కుష్వంత్. ఎమర్జెన్సీని సమర్థించాడు. అందుకు ఫలితం అనుభవించాడు. ఆ తర్వాతి కాలంలో కుశ్వంత్ సింగ్ అనేక పత్రికల్లో పని చేశాడు. ఎన్నో పుస్తకాలు రాశాడు. మరెన్నో పుస్తకాలను ఎడిట్ చేశాడు. విమర్శకుడిగా, సిండికేటెడ్ కాలమిస్టుగా ఉన్నాడు. కాని ఇలస్ట్రేటెడ్ వీక్లీలో ఎడిటర్‌గా ఉన్నప్పుడు నడిచినదే అతడి హవా. స్వర్ణయుగం.
 కుష్వంత్ వైరుధ్యాల పుట్ట. తను అజ్ఞేయవాదిని (ఎగ్నోస్టిక్) అంటూనే సంప్రదాయ సిక్కులా ఉండేవాడు. నచ్చినవాళ్లను ఉత్తిపుణ్యాన ఆకాశానికి ఎత్తేసేవాడు. నచ్చనివాళ్లను దింపేసేవాడు. అతను మెచ్చిన వాళ్లంతా మంచివాళ్లు కాదు. తిట్టినవాళ్లంతా చెడ్డవాళ్లూ కాదు. ఢిల్లీ నగరం అంటే వ్యామోహం. దాని చరిత్రను గ్రంథస్తం చేశాడు. అతను సెక్స్ గురించి తెగ మాట్లాడేవాడు, రాసేవాడు కాని కె.పి.ఎస్.గిల్‌లా ఎవరినీ గిల్లిన దాఖలాలు లేవు. కనీసం ఏ మహిళా అతడిపై ఫిర్యాదు చేసిన దాఖలాలు లేవు. ఇష్టమైనది రాసి ఇష్టమైనట్టుగా బతికాడు కుష్వంత్ సింగ్.  రచయితగా కోట్లాది పాఠకులను ఆకట్టుకునే నైపుణ్యం అతనికే సొంతం.
 - ఎమ్బీయస్ ప్రసాద్ 9849998139
 వ్యాసకర్త రచయిత, సీనియర్ కాలమిస్
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement