సాఫ్ట్‌వేర్ కంపెనీలకు చుక్కలు చూపిస్తున్న వర్షాలు | Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌వేర్ కంపెనీలకు చుక్కలు చూపిస్తున్న వర్షాలు

Published Wed, Nov 25 2015 4:26 PM

సాఫ్ట్‌వేర్ కంపెనీలకు చుక్కలు చూపిస్తున్న వర్షాలు - Sakshi

భారీ వర్షాలతో సాఫ్ట్‌వేర్ కంపెనీలు అతలాకుతలం అవుతున్నాయి. ఉద్యోగులు ఎవరూ ఆఫీసులకు వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో.. ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటున్నాయి. మరోవైపు క్లయింటులు మాత్రం తమ అవసరాల కోసం యాజమాన్యాల మీద ఒత్తిడి తేవడం మానట్లేదు. చెన్నైలో పనిచేస్తున్న వాళ్లలో కీలక ఉద్యోగులు చాలామందిని వేరే ప్రాంతాలకు పంపేసి.. అక్కడినుంచి పని చేయాల్సిందిగా కోరతున్నారు. ప్రధానంగా ఐబీఎం, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, క్యాప్ జెమిని, టీసీఎస్.. ఇలాంటి పలు కంపెనీల ఉద్యోగులు చాలామంది భారీ వర్షాల కారణంగా ఆఫీసులకు వెళ్లలేకపోతున్నారు. దాంతో, చెన్నైలో ఉన్న చాలా కంపెనీలు దగ్గర్లో ఉన్న బెంగళూరుకు వెళ్లి పని చేయాలని ఉన్నతోద్యోగులను కోరుతున్నాయి.

పోనీ కనీసం కొంతమందినైనా 'వర్క్‌ ఫ్రమ్ హోమ్' ఆప్షన్ ఉపయోగించుకుని పని చేయిద్దామంటే, చెన్నైలో చాలా ప్రాంతాలలో కరెంటు ఉండట్లేదు. దాంతో పాటు.. మొత్తం జలమయం అయిపోవడంతో ఇంటర్‌నెట్ సదుపాయం కూడా అంతంతమాత్రంగానే ఉంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్లతో పని చేయించడం ఎలాగో అర్థం కాక, పని జరిగే వీలు లేక యాజమాన్యాలు తలపట్టుకుంటున్నాయి. చెన్నై కేంద్రంగా చాలా సాఫ్ట్‌వేర్ కంపెనీలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి.

చెన్నై నగరంలో భారీ వర్షాల కారణంగా రోడ్లు, విద్యుత్ లైన్లు బాగా పాడయ్యాయి. కేవలం వీటి రూపంలో కలిగిన నష్టాలే దాదాపు రూ. 8,481 కోట్ల మేరకు ఉంటాయని తమిళనాడు ప్రభుత్వం అంచనా వేసింది. ఇక వస్తుసేవలు, ఇలాంటి సాఫ్ట్‌వేర్ సేవలన్నింటినీ కూడా లెక్కలోకి తీసుకుంటే ఆ నష్టం ఎన్ని లక్షల కోట్లకు చేరుకుంటుందో చూడాలి. ఐబీఎం కంపెనీకి భారతదేశంలో దాదాపు లక్ష మంది ఉద్యోగులు ఉండగా, వాళ్లలో ఐదోవంతు కేవలం చెన్నైలోనే పనిచేస్తున్నారు. దాంతో అక్కడి ఉన్నతోద్యోగులను అత్యవసరంగా బెంగళూరు పంపేసి.. అక్కడినుంచి ప్రాజెక్టుల పని చూస్తున్నారు. కాగ్నిజెంట్ కంపెనీకి అయితే ఒక్క చెన్నైలోనే 2.19 లక్షల మంది ఉద్యోగులు ఉన్నట్లు అంచనా. వాళ్లు కూడా ఇదే వ్యూహాన్ని అనుసరిస్తూ.. వేర్వేరు నగరాలకు సిబ్బందిని పంపుతున్నారు. మొత్తమ్మీద వర్షాలు మాత్రం చెన్నై కేంద్రంగా ఉన్న సాఫ్ట్‌వేర్ పరిశ్రమకు చుక్కలు చూపిస్తున్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement