మెదక్ నిమ్జ్ ద్వారా రూ.17,300 కోట్ల పెట్టుబడులు
లోక్‌సభలో నిర్మలా సీతారామన్
సాక్షి, న్యూఢిల్లీ: మెదక్‌లో ప్రతిపాదిత జాతీయ పెట్టుబడులు, ఉత్పత్తుల మండలి (నిమ్జ్)కి 2016 జనవరి 22న కేంద్రం తుది ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. సోమవారం లోక్‌సభలో ఓ లిఖితపూర్వక ప్రశ్నకు జవాబిస్తూ.. ‘తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక ప్రకారం నిమ్జ్ చివరి విడత విస్తరణలోగా రూ.17,300 కోట్ల మేర పెట్టుబడులు వస్తాయని అంచనా. ప్రత్యక్షంగా, పరోక్షంగా 2.77 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది’ అని వివరించారు. మొత్తం 12,635 ఎకరాల స్థలం ఈ నిమ్జ్‌కు అవసరం కాగా, తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ 3,501 ఎకరాల స్థలాన్ని సేకరించిందని చెప్పారు.
రాష్ట్రంలో రూ.33 వేల కోట్ల ఎగుమతులు
తెలంగాణలోని సెజ్‌ల ద్వారా 2015-16లో డిసెంబర్ నాటికి రూ.32,966.19 కోట్ల మేర ఎగుమతులు జరిగాయని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం రూ. 37,107 కోట్లుగా ఉంది. కాగా, ఉమ్మడి ఏపీలో 2013-14లో రూ.33,291 కోట్ల విలువైన ఎగుమతులుండగా, 2014-15లో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లో రూ. 7,887 కోట్లుగా ఉంది. 2015-16లో డిసెంబర్ వరకు రూ. 7,599 కోట్లుగా ఉండటం గమనార్హం.