'స్తోమత' ఉంటే గ్యాస్ రాయితీ వదులుకోండి | Sakshi
Sakshi News home page

'స్తోమత' ఉంటే గ్యాస్ రాయితీ వదులుకోండి

Published Sat, Mar 28 2015 1:08 AM

' Means ' to give up if the gas subsidy says Modi

న్యూఢిల్లీ: వంటగ్యాస్‌ను మార్కెట్ ధరకు కొనుగోలుచేసే స్తోమత ఉన్నవారు ప్రభుత్వం ఇచ్చే రాయితీని వదులుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఎల్పీజీ వినియోగదారులకు పిలుపునిచ్చారు. ఇప్పటికే దేశంలో 2.80 లక్షల మంది రాయితీని వదులుకుని 'గివ్ ఇట్ ఆప్'లో భాగస్వాములయ్యారని, తద్వా రా రూ.100 కోట్ల ప్రజా ధనం మిగిలిందని ప్రధాని చెప్పారు. ఈ నిధుల ద్వారా మరింత మంది పేదలకు సిలిండర్లు అందజేస్తామన్నారు. ఢిల్లీలో శుక్రవారం నిర్వహించిన ఇంధన సంగమం(ఉర్జా సంగమ్) సదస్సులో  మోదీ మాట్లాడారు. సిలిండర్లపై వదులుకునే రాయితీ పేదల సంక్షేమానికి పనికొస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.

తమ ప్రభుత్వం ఇంధన భద్రత, పొదుపునకు చర్యలు చేపట్టిందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద నగదు బదిలీ పథకాన్ని వంద రోజుల్లో పూర్తి చేశామని, 12 కోట్ల మంది బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా రాయితీవెళుతోందని తెలిపారు. రాయితీ మిగులు ఫలాల్ని పేదలకు అందజేయడంతోపాటు, సంచార జాతుల వారికి 5 కేజీల సిలిండర్లు అందచేయడానికి ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. ఇంధన రంగం బలోపేతం చేసే దిశగా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టామని, ఇథనోల్‌కు కనీస మద్దతు ధర కల్పించామని చెప్పారు.

బంజరు భూముల్లో జట్రోపా సాగు చేసి బయోడీజిల్ రూపంలో అభివృద్ధి చేయాలని రాష్ట్రాలను కోరామన్నారు. గ్యాస్ గ్రీన్ నెట్‌వర్క్ విస్తరణ చేపట్టి పట్టణాల్లోని కుటుంబాలకు పైపులైన్ల ద్వారా గ్యాస్ సరఫరా చేయాలన్నారు. నాలుగేళ్లలో కోటి మందికి పైపులైన్ల ద్వారా గ్యాస్ అందజేస్తామని చెప్పారు.

Advertisement
Advertisement