డబ్బు కోసం సినిమాలు చేయడం లేదు | Sakshi
Sakshi News home page

డబ్బు కోసం సినిమాలు చేయడం లేదు

Published Wed, Oct 22 2014 12:54 AM

డబ్బు కోసం సినిమాలు చేయడం లేదు

 ప్రస్తుతం నేను డబ్బు కోసం చిత్రాలు చేయడం లేదని విజయమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు ప్రముఖ నిర్మాత ఎడిటర్ మోహన్ వ్యాఖ్యానించారు. ఎడిటర్‌గా జీవితాన్ని ప్రారంభించి, నిర్మాతగా సుదీర్ఘ ప్రయాణంలో అనూహ్య విజయాలతో నవతరానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న నిత్య కృషీవలుడీయన. చిరునవ్వు ఈయనకు ఆభరణం అయితే నిరంతర శ్రమే ఈయన విజయ రహస్యం. 73 ఏళ్ల ఈ సినీ మేధావి సినిమా వయసు 60 ఏళ్లు కావడం విశేషం. ఎడిటర్ మోహన్‌కు సినిమా రెండు కళ్లు. తన పెద్ద కొడుకు జయం రాజా దర్శకుడిగా ఒక భుజం కాగా, రెండవ కొడుకు జయం రవి నటుడిగా మరో భుజంలాగా మెలుగుతున్నారు. దీంతో సినిమాకే అంకితమైన కుటుంబంగా పేరొందారు.
 
 కొడుకులకు జయం చిత్రంతో చిత్రరంగానికి శ్రీకారం చుట్టి వారి విజయానికి నాంది పలికారు ఎడిటర్ మోహన్. ఈయన్ని తమిళ చిత్ర పరిశ్రమ తెలుగు చిత్ర పరిశ్రమ రెండూ అక్కున చేర్చుకున్నాయి. ఎడిటర్ మోహన్ ఒక కొడుకు హీరోగా, మరో కొడుకు దర్శకుడిగా జయం చిత్రం నుంచి తిల్లాలంగడి వరకు పలు హిట్ చిత్రాలను నిర్మించారు.   జయం రవి ప్రస్తుతం నటించిన భూలోకం చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతోంది. ఇందులో జయం రవి బాక్సర్‌గా నటించారు. ఆయన సరసన త్రిష నటించారు. ఇప్పటి వరకు వెండితెరపై రానటువంటి కథాంశంతో తెరకెక్కిన చిత్రం భూలోకం అంటున్నారు ఎడిటర్ మోహన్.
 
 చిన్న గ్యాప్ తరువాత జయంరాజా జయంరవిల కాంబినేషన్‌లో తనీ ఒరువన్ చిత్రం తెరకెక్కుతోందని తెలిపారు. ఇందులో నయనతార తొలిసారిగా జయం రవికి జంటగా నటిస్తున్నారని ముఖ్యపాత్రలో అరవిందస్వామి నటిస్తున్నారని తెలిపారు. అలాగే రోమియో జూలియట్ చిత్రం నిర్మాణంలో ఉందన్నారు. ఈ చిత్రంలో హన్సిక హీరోయిన్‌గా నటిస్తున్నారని తెలిపారు. వీటితో పాటు సూరజ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రంలో జయంరవికి జంటగా త్రిష, అంజలి నటిస్తున్నారని తెలిపారు.
 
 తెలుగు చిత్ర పరిశ్రమతో తనకు చాలా అనుబంధం ఉందన్నారు. ఈ క్రమంలో 2015 ప్రథమార్థంలో ఒక చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నానని తెలిపారు. ఇందులో ఐదుగురు హీరోలు నటించనున్నారని, కథ కూడా పక్కాగా సిద్ధం అయ్యిందని చెప్పారు. త్వరలోనే అన్ని వివరాలు వెల్లడించనున్నట్లు ఎడిటర్ మోహన్ తెలిపారు. అయితే కొంతకాలంగా తెలుగు చిత్ర పరిశ్రమకు దూరమై తప్పు చేశాననే బాధ ఉన్నా పిల్లల విజయానికి కృషి చేశాననే సంతృప్తి ఉందంటున్నారు ఎడిటర్ మోహన్.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement