‘అన్నా’ను బీజేపీ చంపేసింది | Sakshi
Sakshi News home page

‘అన్నా’ను బీజేపీ చంపేసింది

Published Sat, Jan 31 2015 2:06 AM

బీజేపీ విడుదల చేసిన వ్యంగ్య కార్టూన్

* నాడు గాంధీని గాడ్సే చంపాడు.. నేడు బీజేపీ ‘అన్నా’ను చంపింది
* బీజేపీ పోస్టర్‌లో అన్నా ఫొటోకు దండ వేయడంపై కేజ్రీవాల్ ఆగ్రహం

 
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను వ్యంగ్యంగా చిత్రీకరిస్తూ బీజేపీ విడుదల చేసిన కార్టూను వివాదాస్పదమైంది. ఆ చిత్రంలో అన్నా హజారే చిత్రపటానికి పూలమాల వేసినట్లు చూపటం ద్వారా ఆయన్ను బీజేపీ చంపేసిందని ఆప్ విరుచుకు పడింది. ‘నాడు గాంధీని గాడ్సే చంపేశాడు. ఇప్పుడు అన్నాని బీజేపీ తన ప్రకటనలో చంపేసింది’ అంటూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. బీజేపీ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేజ్రీవాల్ తన పిల్లలపై ఒట్టేసి కాంగ్రెస్ మద్దతు తీసుకోనంటూనే, కాంగ్రెస్‌ను పెళ్లాడినట్లుగా బీజేపీ పత్రికల్లో ప్రకటనలిచ్చింది.
 
 ఆప్ మహిళా వ్యతిరేకి: కాగా ఆప్ విమర్శలను పట్టించుకోని బీజేపీ ఆ పార్టీపై మరింత దూకుడు పెంచింది. ఆప్ మహిళా వ్యతిరేక పార్టీ అని, రాజ్యాంగ సంస్థలపై దానికి నమ్మకం లేదని బీజేపీ ఢిల్లీ కార్యాలయంలో కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ విమర్శించారు. నీతి, నిజాయితీ గురించి మాట్లాడే కేజ్రీవాల్, 2013 ఎన్నికల ఖర్చు లెక్కలు ఎన్నికల సంఘానికి ఎందుకు ఇవ్వలేదని ఆమె ప్రశ్నించారు. బంగ్లాదేశ్, దుబాయ్, పాకిస్తాన్ నుంచి మద్దతుగా ఫోన్లలో ప్రచారం నిర్వహిస్తున్న ఆప్‌కు మద్దతు ఇవ్వడానికి ఢిల్లీలో వాలంటీర్లు దొరకడంలేదా? అని అడిగారు. కిరణ్‌బేడీ అందరికన్నా యోగ్యురాలైన ముఖ్యమంత్రి అభ్యర్థి అని ఆప్ సంరక్షకుడు శాంతిభూషణ్ తోపాటు సాక్షాత్తూ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాలే పేర్కొంటూ ఆమెను ఆప్‌లో చేరాలని ఆహ్వానించారని, కానీ కిరణ్ బేడీ బీజేపీ సీఎం అభ్యర్ధిగా బరిలోకిదిగడంతోనే ఆప్ నేతలు వ్యక్తిగత ఆరోపణలు చేయటం విడ్డూరమని నిర్మల ఆక్షేపించారు.   జన్‌లోక్‌పాల్ అంశంపై కేజ్రీవాల్ ఎందుకు పోరాడలేదని నిర్మల ప్రశ్నించారు.
 
 గెలిస్తే.. మూడు రాజ్యసభ సీట్లు వస్తాయి
 ఢిల్లీ విధానసభ ఎన్నికల్లో బీజేపీ మూడొంతుల మెజార్టీ సాధిస్తే మూడు రాజ్యసభ సీట్లు వస్తాయని కేంద్ర పట్టణాభివృద్ధి, పేదరిక నిర్మూలన శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. కేంద్రం, ఢిల్లీ సర్కారు కలసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమని ఆయన చెప్పారు. కేజ్రీవాల్‌పై 10 క్రిమినల్ కేసులు:అరవింద్ కేజ్రీవాల్‌పై మొత్తం 10 క్రిమినల్ కేసులు నమోదైనట్టు ది అసోసియేషన్ ఆఫ్ డెమొక్రాటిక్ రీఫార్మ్స్(ఏడీఆర్) వెల్లడించింది.   ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 673మంది అభ్యర్థుల అఫిడవిట్లను ఏడీఆర్ పరిశీలించిం ది.  కాంగ్రెస్ నేత షోయబ్ ఇక్బాల్ తరువాత ఎక్కువ కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న నేతగా కేజ్రీవాల్ ఉన్నారని ఏడీఆర్ తెలిపింది.

Advertisement
Advertisement