శింబూతో మళ్లీ ప్రేమలో పడే అవకాశమే లేదు! | Sakshi
Sakshi News home page

శింబూతో మళ్లీ ప్రేమలో పడే అవకాశమే లేదు!

Published Sun, Aug 10 2014 11:20 PM

శింబూతో మళ్లీ ప్రేమలో పడే అవకాశమే లేదు!

ఒకప్పుడు ప్రేమించుకుని, అందరూ పెళ్లి చేసుకుంటారని భావిస్తున్న తరుణంలో విడిపోయారు శింబు, నయనతార. వీరిద్దరూ ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ‘ఇదు నమ్మ ఆళు’ అనే సినిమాలో నటిస్తున్నారు. విడిపోయిన తర్వాత వీరు కలిసి నటిస్తున్న సినిమా ఇదే. లొకేషన్లో నయన, శింబు కాస్త స్నేహంగా మసలడంతో... మళ్లీ వీరి మధ్య ప్రేమ చిగురించిందనే వార్తలు మీడియాలో హల్‌చల్ చేయడం మొదలుపెట్టాయి.

 గత కొన్ని నెలలుగా కోలీవుడ్‌లో ఎక్కడ చూసినా ఇదే టాపిక్. దీనిపై నయన ఘాటుగా స్పందించారు. ‘‘నేను సినిమాల్లో నటించడానికి వచ్చాను. ఇక్కడ నచ్చనివాళ్లు, నచ్చినవాళ్లు అనే ప్రసక్తి ఉండదు. కథ, పాత్ర... వీటికే ప్రాధాన్యం ఇస్తా. శింబూతో నటించడానికి ఒప్పుకున్నానంటే... కారణం అదే. ప్రస్తుతం తను నా సహ నటుడు.

 వ్యక్తిగత అభిప్రాయాలను పక్కనపెట్టి తనతో సన్నిహితంగా ఉంటేనే పాత్రకు న్యాయం చేయగలను. అందుకే మాట్లాడుతున్నాను. అంతే కానీ, మా ఇద్దరి మధ్య ఏమీ లేదు. ఇప్పుడు చెబుతున్నాను వినండి.. మళ్లీ శింబుతో ప్రేమలో పడే ఛాన్సే లేదు. నా మానసిక స్థితి ఎలా ఉందో తెలీని కొందరు మీడియా వారు లేనిపోనివి ప్రచారం చేస్తున్నారు. వాటిని నమ్మొద్దు’’ అన్నారు నయన తార.
 

Advertisement
 
Advertisement
 
Advertisement