తాలిబన్లపై పాక్ ప్రొఫెసర్ సాహసం | Sakshi
Sakshi News home page

తాలిబన్లపై పాక్ ప్రొఫెసర్ సాహసం

Published Wed, Jan 20 2016 5:46 PM

తాలిబన్లపై పాక్ ప్రొఫెసర్ సాహసం - Sakshi

పెషావర్: తల్లి, తండ్రి, గురువు ఈ ముగ్గురు కూడా ప్రేమకు నిలయాలు అని చెప్తుంటారు. తల్లిదండ్రులకు తమ పిల్లలపై ఎంత ప్రేమ ఉంటుందో వారు పెరుగుతున్న క్రమంలో విద్యాబుద్ధులు అందించే ఉపాధ్యాయులకు కూడా అంతకుమించిన ప్రేమ ఉంటుందని అంటారు. పాకిస్థాన్లో ఓ ప్రొఫెసర్ అదే విషయాన్ని రుజువు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేస్తున్నారని తెలిస్తేనే ఆ ప్రాంతాన్ని వదిలి ప్రాణాలు అరచేతబట్టుకొని పారిపోయే ఈ రోజుల్లో ఆ ప్రొఫెసర్ మాత్రం తన విద్యార్థులను కాపాడేందుకు తన ప్రాణాలు అడ్డుగా పెట్టాడు.

ఏకంగా భారీ తుపాకులతో దూసుకొస్తున్న ఉగ్రవాదులను నిలువరించేందుకు ఓ సైనికుడిలాగా మారి తన లైసెన్స్ తుపాకీతో వారికి ఎదురు నిలిచాడు. తన దగ్గర తుపాకీతో కాల్పులు జరిపి ఆ ముష్కరులను ఎదుర్కొనే లోపే వారు తెగబడ్డారు. ఆ ప్రొఫెసర్ పై తూటాల వర్షం కురిపించారు. దీంతో 30 ఏళ్ల ప్రాయంలోనే అతడు కన్నుమూశాడు. పాకిస్థాన్లో ఖైబర్ పక్తున్ ఖ్వా ప్రావిన్స్లోని బచాఖాన్ యూనివర్సిటీలోకి 12 మంది సాయుధులైన ఉగ్రవాదులు బుధవారం చొరబడి విచక్షణా రహితంగా కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మొత్తం 24మంది ప్రాణాలు కోల్పోయారు.

ఈ దాడి సమయంలోనే రసాయన శాస్త్రం బోధించే ప్రొఫెసర్ సయ్యద్ హమీద్ హుస్సేన్ (34) తన లైసెన్స్ రివాల్వర్ తో అడ్డుకునే ప్రయత్నం చేసి ప్రాణాలువదిలాడు. ఆయన ప్రాణం కోల్పోయిన తీరును ఆ వర్సిటీ జువాలజీ విద్యార్థి తెలుపుతూ 'ముందు కాల్పుల చప్పుళ్లు వినగానే మా కెమిస్ట్రీ ప్రొఫెసర్ తానుచెప్పే వరకు భవనం వెలుపలికి రావొద్దని హెచ్చరించారు. అనంతరం ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు తన తుపాకీ తీశారు. నేను చూస్తుండగానే ఆయనకు బుల్లెట్ తాకింది. ఆయన కూడా కాల్పులు జరిపారు. అయితే, అంతకంటే వేగంగా ఉగ్రవాదులు తూటాల వర్షం కురిపించడంతో నేను గోడ దూకి పారిపోయాను. మిగితా వాళ్లు కూడా అలాగే చేశారు. మా ప్రొఫెసర్ తో సహా 25మంది ప్రాణాలు విడిచారు' అని అతడు వివరించాడు.

Advertisement
 
Advertisement
 
Advertisement