అబార్షన్లు చేశారో.. ఇక అంతే! | Sakshi
Sakshi News home page

అబార్షన్లు చేశారో.. ఇక అంతే!

Published Mon, Nov 30 2015 8:37 AM

అబార్షన్లు చేశారో.. ఇక అంతే!

విచ్చలవిడిగా అబార్షన్లు చేస్తున్నారన్న కోపంతోనే తాను కాల్పులకు పాల్పడినట్లు అమెరికాలోని కొలరాడోలో కాల్పులతో కలకలం సృష్టించిన రాబర్ట్ లూయిస్ డియర్ (57) చెప్పారు. రెండు రోజుల క్రితం ఆస్పత్రి వద్ద జరిగిన కాల్పుల్లో ముగ్గురు మరణించిన విషయం తెలిసిందే. కాల్పులకు పాల్పడిన రాబర్ట్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, తన అరెస్టు తర్వాతైనా అబార్షన్లు ఆగాలని అతడు అన్నట్లు తెలుస్తోంది. అతడిని అరెస్టు చేసిన సమయంలో అక్కడే ఉన్న ఓ పోలీసు తన పేరు బయట పెట్టొద్దంటూ ఈ విషయం వెల్లడించాడు. అయితే పోలీసులు మాత్రం అతడు ఉపయోగించిన ఆయుధం విషయం గానీ, ఎందుకు కాల్పులు జరిపాడన్నది గానీ అధికారికంగా చెప్పడం లేదు.

కాల్పులు జరిగిన 'ప్లాన్డ్ పేరెంట్‌హుడ్' అనే ఆస్పత్రిలో అబార్షన్లు చేసి బయటకు తీసేసిన పిల్లల శరీర అవయవాలను అమ్ముకోడానికి బేరాలు చేస్తుండగా స్టింగ్ ఆపరేషన్ చేసిన అబార్షన్ల వ్యతిరేక కార్యకర్తలు.. ఆ వీడియోను జూలై నెలలో విడుదల చేశారు. అయితే, తాము కేవలం పరిశోధనల కోసం ఉచితంగా ఇస్తున్నామే తప్ప అమ్ముకోవడం లేదని ప్లాన్డ్‌ పేరెంట్‌హుడ్ ప్రతినిధులు వాదించారు. అబార్షన్లు చేయడమే కాక.. ఇలా పిల్లల అవయవాలను అమ్ముకోవడంపై తీవ్ర ఆగ్రహానికి గురైనందువల్లే రాబర్ట్ లూయిస్ డియర్ కాల్పులకు పాల్పడినట్లు తెలుస్తోంది.

మృతుల్లో ఇద్దరు పౌరులు, ఓ పోలీసు
కొలరాడో కాల్పుల్లో ఇద్దరు పౌరులతో పాటు ఒక పోలీసు కూడా మరణించారు. మృతుల వివరాలను పోలీసులు వెల్లడించారు. వారం రోజుల క్రితమే 36వ పుట్టినరోజు చేసుకున్న జెన్నిఫర్ మార్కోవ్‌స్కీతో పాటు మార్సెల్ స్టెవార్ట్ (29), కొలరాడో యూనివర్సిటీలో క్యాంపస్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న గారెట్ స్వాసీ (44) ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు.

Advertisement
 
Advertisement
 
Advertisement