జర్నలిస్టు తల నరికి.. వీడియో పెట్టిన ఉగ్రవాదులు | Sakshi
Sakshi News home page

జర్నలిస్టు తల నరికి.. వీడియో పెట్టిన ఉగ్రవాదులు

Published Wed, Aug 20 2014 10:32 AM

జర్నలిస్టు తల నరికి.. వీడియో పెట్టిన ఉగ్రవాదులు

ఇస్లామిక్ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. దాదాపు రెండేళ్ల క్రితం తాము సిరియాలో కిడ్నాప్ చేసిన అమెరికా పాత్రికేయుడు జేమ్స్ ఫోలీని తల నరికి.. ఆ వీడియోను ఇంటర్నెట్లో పెట్టారు. యూట్యూబ్లో సంచలనం సృష్టిస్తున్న ఈ వీడియో ఇంతకీ అసలైనదా కాదా అనే విషయం మాత్రం ఇంకా ఖరారు కాలేదు. ఫోలీ కుటుంబాన్ని సంప్రదించేందుకు ప్రయత్నించినా, సాధ్యం కాలేదు. ఆ తర్వాత ఆ వీడియోను యూట్యూబ్ తమ సెర్వర్ నుంచి తొలగించింది.

'అమెరికాకు ఓ సందేశం' అనే పేరుతో పోస్ట్ చేసిన ఈ వీడియోలో.. నారింజ రంగు దుస్తులు ధరించిన ఫోలీని ఓ ఎడారి ప్రాంతంలో మోకాళ్ల మీద నిలబెట్టి, పక్కనే ఓ ఉగ్రవాది తలకు ముసుగు వేసుకుని నల్ల దుస్తుల్లో ఉన్నాడు. సాధారణంగా నారింజరంగు దుస్తులను అమెరికా సైన్యం అదుపులో ఉండే ఖైదీలకు వేస్తారు. అతడి పక్కనే ఉన్న ఉగ్రవాది ఇంగ్లీషులో మాట్లాడాడు. ఆ తర్వాత అతడు జేబులోంచి కత్తి తీసి, ఫోలీకి మరణశిక్ష విధిస్తున్నట్లు చెప్పాడు. ఇరాక్లో ఉన్న ఇస్లామిక్ ఉగ్రవాదులపై వైమానిక దాడులు చేయాలంటూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆదేశించడంతో అందుకు ప్రతీకారంగా ఈ శిక్ష వేస్తున్నామన్నారు.

''నా అసలైన హంతకులు.. అమెరికా ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేయాల్సిందిగా నా స్నేహితులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులను కోరుతున్నాను. వాళ్ల నేరపూరిత చర్యల వల్లే ఇదంతా జరుగుతోంది'' అని ఫోలీ ఆ వీడియోలో చెబుతున్నట్లు ఉంది. అల్-ఫుర్ఖాన్ మీడియా ఫౌండేషన్ అనే సంస్థ ఈ వీడియోను ఆన్లైన్లో పెట్టింది. అమెరికాన్ సైనికులు ఈ నెలలో ఇరాక్ మీద బాంబులు వేయడం మొదలుపెట్టారని, అలా తన మరణ ధ్రువపత్రం మీద వాళ్లు సంతకం పెట్టారని ఫోలీ చివర్లో చెబుతాడు.

40 ఏళ్ల ఫోలీ గ్లోబల్ పోస్ట్ అనే ఆన్లైన్ ఎడిషన్ తరఫున ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు. అతడు 2012 నవంబర్ 22వ తేదీన సిరియాలో అదృశ్యమయ్యాడు. అతడితో పాటు పలువురు అమెరికన్లను ఉగ్రవాదులు చెరలోకి తీసుకున్నారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)

Advertisement
 
Advertisement
 
Advertisement