చైనా నోట ‘వావ్‌ భారత్‌..‌’ అనే మాట | Sakshi
Sakshi News home page

చైనా నోట ‘వావ్‌ భారత్‌..‌’ అనే మాట

Published Mon, Feb 20 2017 3:12 PM

చైనా నోట ‘వావ్‌ భారత్‌..‌’ అనే మాట

బీజింగ్‌: ఎప్పుడూ కారాలుమిరియాలు నూరే చైనా తొలిసారి భారత్‌పై ప్రశంసలు కురింపించింది. ఇస్రో చేసిన అద్భుత ప్రయోగంపట్ల అక్కడి మీడియా భారత్‌ను పొగడ్తల్లో ముంచెత్తింది. భారత్‌ నిజంగా చైనాకంటే కూడా గొప్ప పనిచేసిందంటూ అక్కడి పలు పత్రికలు వెల్లడించినట్లు రిపోర్టులు అందుతున్నాయి. వాణిజ్య ఉపగ్రహాలను అతితక్కువ ధరకే అంతరిక్షంలోకి పంపించే విషయంలో భారత్‌ తమ దేశం కంటే ముందు పడిందని చైనా మీడియా పేర్కొంది. భారత్‌ ను చూసి ఇక నుంచి తాము అంతకంటే వేగంగా ముందుకు వెళ్లాలని చైనా తమ శాస్త్రవేత్తలకు ఇప్పటికే సూచనలు ఇచ్చిందట.

భవిష్యత్‌లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుంటూ విరివిగా అంతరిక్ష యాత్రలు చేపట్టడం ద్వారా, వాణిజ్య ఉపగ్రహాలను పంపించడం ద్వారా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలంగా ఉండనుంది. ఇప్పటికే ఆర్థికాభివృద్ధిలో వేగంగా దూసుకెళుతున్న భారత్‌ ఇప్పుడు అంతరిక్ష సాహస యాత్రలు కూడా అద్భుతంగా ఇస్రో ద్వారా చేస్తోంది. ఇటీవల పీఎస్‌ఎల్‌వీ-సీ 37 రాకెట్‌ సహాయంతో ఒకేసారి 104 ఉపగ్రహాలను భారత్‌ ఒకేసారి పంపించి ప్రపంచదేశాలను తనవైపునకు దిప్పుకునేలా చేసిన విషయం తెలిసిందే.

ఇప్పటికే పలు దేశాల ప్రతినిధులు భారత్‌ రికార్డును కొనియాడుతుండగా తాజాగా చైనా కూడా స్పందించడం గమనార్హం. ‘భారత్‌ తాజాగా చేసిన ప్రయోగంతో వాణిజ్య ఉపగ్రహాలను అతితక్కువ ధరల్లోనే అంతరిక్షంలో ప్రవేశపెట్టగలమని నిరూపించింది. స్పేస్‌ బిజినెస్‌లో ప్రపంచ వ్యాప్తంగా తాము కూడా రేసులో ముందున్నామని భారత్‌ బాగా చూపించగలిగింది’ అని షాంఘై ఇంజినీరింగ్‌ సెంటర్‌ ఫర్‌ మైక్రోశాటిలైట్స్‌ డైరెక్టర్‌ జాంగ్‌ యోంగే అన్నారు.

Advertisement
Advertisement