చనిపోయా అనుకున్నాడు.. టైం బావుండి.. | Sakshi
Sakshi News home page

చనిపోయా అనుకున్నాడు.. టైం బావుండి..

Published Wed, Jun 28 2017 5:23 PM

చనిపోయా అనుకున్నాడు.. టైం బావుండి..

కాలిఫోర్నియా: ఎమరాల్డ్‌ పూల్స్‌ అంటేనే చాలు ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఎందుకంటే కాలిఫోర్నియాలోని పదునైన రాతి లోయల మధ్య ఈ జలపాతాలు ప్రవహిస్తుంటాయి. ముఖ్యంగా మంచుకరిగే వేసవికాలంలో ఇవి మరింత ఉధృతంగా పరుగులు పెడుతుంటాయి. అదే సమయంలో చూడగానే చూపరులను ఆకట్టుకుంటాయో.. ఓసారి సరదాగా అందులో దిగి స్మిమ్మింగ్‌ చేస్తే బాగు అని కూడా అనిపిస్తుంటుంది. ఒక వేళ అదృష్టం బాగలేక పట్టుతప్పిందో ఇక అంతే సంగతులు. సరిగ్గా ఈ నెల 24న మధ్యాహ్నం 12.30గంటల ప్రాంతంలో కలానీ ట్యోనో అనే యువకుడికి సరిగ్గా ఇదే అనుభవం ఎదురైంది.

సరదాగా అందులోకి దిగి స్నానం చేద్దామనుకున్న అతడు ఒక్కసారిగా పట్టుజారాడు. వేగంగా ప్రవహిస్తున్న నీటిలో పడికొట్టుకుపోయాడు. దీంతో అతడితోపాటు ఉన్న ఓ వ్యక్తి తమ మిత్రుడు అందులో పడిపోయాడంటూ కాలిఫోర్నియా హైవే పెట్రోలింగ్‌ సంస్థకు ఫోన్‌కాల్‌ వచ్చింది. దీంతో హెలికాప్టర్‌ ద్వారా మాత్రమే తనిఖీలు చేసేందుకు అవకాశం ఉన్న ఆ ప్రాంతంలో ప్రత్యేక పోలీసు విమానాన్ని రంగంలోకి దించారు.

అది దాదాపు అరగంట సేపు గాలింపులు చేపట్టాక ప్రవహిస్తున్న నీటి మధ్య ఓ పెద్ద బండరాతి మీద కూర్చుని సహాయం కోసం ఎదురుచూస్తున్న ఆ యువకుడు కనిపించాడు. దీంతో సుశిక్షితుడైన గజ ఈతగాడిని హెలికాప్టర్‌లో నుంచి ఒక ప్రత్యేక రోప్‌ ద్వారా జలపాతం పారే ఇరుకైన లోయలోకి దింపి అతడిని సురక్షితంగా హెలికాప్టర్‌లోకి ఎక్కించుకొని అనంతరం క్షేమంగా దింపేశారు. దీంతో దాదాపు చనిపోతాడని అనుకున్న అతడు సరైన సమయంలో స్పందించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement