లీకేజీ డీల్ రూ.50 కోట్లు | Sakshi
Sakshi News home page

లీకేజీ డీల్ రూ.50 కోట్లు

Published Thu, Jul 28 2016 1:49 AM

లీకేజీ డీల్ రూ.50 కోట్లు - Sakshi

ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీకైనట్లు నిర్ధారించిన సీఐడీ
హైదరాబాద్:
ఎంసెట్-2 లీకేజీ వ్యవహారంలో దాదాపు రూ.50 కోట్లు చేతులు మారాయి. బ్రోకర్లు ఒక్కో విద్యార్థి నుంచి రూ.75 లక్షల చొప్పున వసూలు చేసి పక్కా పథకం ప్రకారం ఈ తతంగం నడిపినట్లు సీఐడీ ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. దాదాపు 72 మంది విద్యార్థుల తల్లిదండ్రులతో బ్రోకర్లు లావాదేవీలు నడిపినట్లు విచారణలో తేలింది. అడ్వాన్స్‌గా రూ.10 లక్షలు, ఫలితాలు వచ్చాక మిగతా డబ్బులు ఇచ్చేటట్లుగా వీరు ఒప్పందం కుదుర్చుకున్నారు.

అడ్వాన్సులు ఇచ్చిన విద్యార్థులను బ్రోకర్లు విడతల వారీగా విమానంలో బెంగళూరు, ముంబైలకు తరలించారు. పరీక్షకు సరిగ్గా 48 గంటల ముందు ప్రశ్నపత్రాన్ని లీక్ చేసి.. వారికి ప్రత్యేక శిక్షణనిచ్చారు. పరీక్ష రోజున నేరుగా వీరందరినీ విమానంలో తీసుకువచ్చి పరీక్ష రాయించి పక్కాగా తమ పథకాన్ని అమలు చేశారు. ఎంసెట్-2 లీకేజీపై ఇప్పటికే కేసు నమోదు చేసిన సీఐడీ.. తీగ  లాగే కొద్దీ విస్మయం గొలిపే అంశాలు వెలుగుచూస్తున్నాయి. ఈ లీకేజీకి సూత్రధారుడైన బ్రోకర్ రాజగోపాల్‌రెడ్డితోపాటు ముఠా సభ్యులు రమేశ్, తిరుమల్, విష్టును పోలీసులు ఇప్పటికే వల వేసి పట్టుకున్నట్టు సమాచారం. మహారాష్ట్రకు చెందిన గుడ్డు, షేక్ నిషాద్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిని పట్టుకునేందుకు సీఐడీ బృందాలు ముంబైకి వెళ్లాయి. వీరితో పాటు బ్రోకర్లతో లావాదేవీలు నిర్వహించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులపైనా కేసులు నమోదు చేయాలని సీఐడీ నిర్ణయించింది.
 
జేఎన్‌టీయూ ఫ్యాకల్టీ, సిబ్బంది పాత్ర లీకేజీ వెనుక జేఎన్‌టీయూ ఫ్యాకల్టీ, సిబ్బంది ప్రమేయం కూడా ఉందని సీఐడీ గుర్తించింది. దళారుల కాల్‌డేటా ఆధారంగా ఇప్పటికే ఎవరెవరి పాత్ర ఉందన్న అంచనాకు వచ్చింది. పేపర్ తయారీలో కీలక పాత్ర పోషించిన అధ్యాపక బృందం మొదలుకొని జేఎన్‌టీయూలోని కొంత మంది సిబ్బందితో బ్రోకర్లు సంప్రదింపులు జరిపినట్లు రూఢీ చేసుకుంది. వీరిలో కొంత మంది డబ్బుకు ఆశపడి వారి ఉచ్చులో చిక్కుకున్నట్లు గుర్తించింది. ముగ్గురు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో పాటు ఫ్యాకల్టీ సభ్యు లు కొందరిని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరి ద్వారానే పేపర్ ఎక్కడ ప్రింట్ అవుతుం దనే విషయాన్ని బ్రోకర్ల ముఠా తెలుసుకుంది. ప్రింటింగ్ జరిగే ప్రాంతం, కేంద్రం వివరాలు తెలుసుకొని అక్కణ్నుంచే పేపర్‌ను తస్కరించారు.
 
ఎంత డబ్బుకు అన్ని ప్రశ్నలు
ఎంసెట్-2 ప్రశ్నపత్రాన్ని సంపాదిస్తామనే ధీమాతో బ్రోకర్లు... అందుకు అనుగుణంగా విద్యార్థులను ఎంపిక చేసుకున్నారు. కోచింగ్ సెంటర్లలో ఆర్థికంగా బలంగా ఉన్న వారి లిస్టును సంపాదించి వారికి  ఫోన్లు చేస్తూ ఎర వేశారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ముందస్తుగా ‘సీటు వస్తేనే డబ్బు చెల్లించండి. సీటు రాకపోతే అడ్వాన్స్ డబ్బులు వాపస్’ అంటూ ఊరించారు. అందుకు అనుగుణంగా దాదాపు వంద మందికి పైగా సంప్రదించగా 72 మంది ఆసక్తి కనబర్చినట్లు సీఐడీ విచారణలో వెలుగు చూసింది. స్తోమతను బట్టి రూ.40 లక్షల నుంచి రూ.70 లక్షల రేటు ఫిక్స్ చేశారు. రూ.40 లక్షలు చెల్లించే వారికి 130 ప్రశ్నలు, రూ.70 లక్షలు చెల్లించే వారికి 140 ప్రశ్నలు అందించారు. అందుకు అనుగుణంగానే విద్యార్థులు 130 నుంచి 140 మధ్యే మార్కులు సాధించారు.
 
 ప్రింటింగ్ ప్రెస్ నుంచే లీక్
గతంలో వివిధ పరీక్షలను లీక్ చేయటంలో ఆరితేరిన రాజగోపాల్‌రెడ్డి ఎంసెట్-2 లీకేజీలోనూ ప్రధాన పాత్ర పోషించాడు. ఇతడు బెంగళూరులో ఉషా ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీని నిర్వహిస్తున్నాడు. అదే కేంద్రంగా ఎంసెట్ లీకేజీకి పథకం పన్నాడు. వైద్య విద్య సీట్లకు సంబంధించింది కావటంతో భారీగా ఉండే డిమాండ్‌ను సొమ్ము చేసుకునే ఎత్తుగడ వేశాడు. రమేశ్, విష్ణు, తిరుమల్‌ను రంగంలోకి దింపి ప్రింటింగ్ ప్రెస్ నుంచే ప్రశ్నపత్రాన్ని లీక్ చేయించి తతంగమంతా నడిపించాడు.
 
 నిందితులుగా విద్యార్థులు, తల్లిదండ్రులు..
ఎంసెట్-2కు లీక్‌కు సంబంధించి ప్రాథమిక విచారణలోనే ఒక అంచనాకు వచ్చిన సీఐడీ... కేసు నమోదు చేయగానే దూకుడు పెంచింది. ఒకేసారి ఆరు బృందాలను రంగంలోకి దించి కేవలం రెండు రోజుల్లోనే కేసును కొలిక్కి తీసుకొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన వ్యవహారం కావటం, భారీగా డబ్బులు చేతులు మారటంతో ఎఫ్‌ఐఆర్‌లో కఠిన సెక్షన్లను విధించింది. ఐపీసీలోని సెక్షన్ 406 (నమ్మకద్రోహం), 408 (ప్రభుత్వ ఉద్యోగి నమ్మక ద్రోహం), 420 రెడ్‌విత్ 120బి(కుట్రతో కూడిన మోసం)లతో పాటు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎగ్జామినేషన్ (ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ అండ్ అన్‌ఫెయిర్‌నెస్) చట్టం కింద కేసులు నమోదు చేశారు.

స్కాంను దృష్టిలో పెట్టుకొని ముందుగానే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకు నిందితులుగా ఎవరి పేర్లను చేర్చని సీఐడీ.. వరుసగా పలు సెక్షన్ల కింద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, బ్రోకర్లతో పాటు వారికి సహకరించిన వారిని చేర్చేందుకు రంగం సిద్ధం చేసింది. వీరికి నోటీసులు కూడా జారీ చేసింది. అన్ని తెలిసీ నేరం చేసినందున, పైగా విద్యార్థులందరూ మేజర్లు కాబట్టి వారిని కూడా నిందితులుగా చేర్చాలని నిర్ణయించింది. విద్యార్థులపై ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎగ్జామినేషన్ (ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ అండ్ అన్‌ఫెయిర్‌నెస్) చట్టంలోని సెక్షన్ 8 కింద కేసులు పెట్టాలని సీఐడీ యోచిస్తోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement