సింగరేణి భవన్‌లో అగ్నిప్రమాదం | Sakshi
Sakshi News home page

సింగరేణి భవన్‌లో అగ్నిప్రమాదం

Published Tue, Aug 4 2015 12:36 AM

సింగరేణి భవన్‌లో అగ్నిప్రమాదం - Sakshi

ఉద్యోగుల ఉరుకులు పరుగులు తప్పిన ప్రాణాపాయం
రికార్డులు, వాహనాలు దగ్ధం

 
నాంపల్లి: లక్డీకాపూల్‌లోని సింగరేణి భవన్‌లో ఆదివారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. ఒకపక్క అలారాల మోత.. మరో పక్క  భవనం మొత్తం కమ్మేసిన దట్టమైన పొగ. దీంతో ఆందోళనకు గురైన సుమారు 400 మంది ఉద్యోగులు ప్రాణభయంతో బయటకు పరుగు తీశారు. వివరాలు.. సరిగ్గా సాయంత్రం 4.30కి సింగరేణి భవన్ సెల్లార్‌లో మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే దట్టమైన పొగ పైఅంతస్తులకు చేరింది.  అదే సమయంలో లిఫ్ట్‌లు పని చేయలేదు. మెట్ల మీదుగా దిగుదామంటే పొగ వల్ల ఏమీ కనిపించడంలేదు. దీంతో కొందరు ఉద్యోగులు కిటికీల్లోంచి దూకే ప్రయత్నం చేశారు. కింద ఉన్న వారు నిలువరించడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు. చేసేదేమి లేక పొగతో మూసుకుపోయిన మెట్ల మీదుగానే ఉద్యోగులు బయటకు వచ్చారు. కొందరు ఉద్యోగులు పోలీసు సహాయంతో మొదటి అంతస్తునుంచి కిందకు దిగారు. అప్పటికే సమాచారం అందుకున్న అసెంబ్లీ అగ్నిమాపక కేంద్రం సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. కొద్దిసేపటికి గౌలిగూడ నుంచి మరో ఫైరింజిన్ వచ్చింది. రెండు ఫైరింజిన్ల సిబ్బంది సుమారు 45 నిమిషాలు కష్టపడి మంటలను ఆర్పివేశారు.

 తప్పిన పెనుముప్పు...
 సింగరేణి భవన్‌లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులంతా క్షేమంగా ప్రమాదం నుంచి బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సెల్లార్ నుంచి మంటలు మొదటి అంతస్తుకు విస్తరించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని స్థానికులు, కార్యాలయ సిబ్బంది పేర్కొన్నారు.
 
పాతరికార్డులు, వాహనాలు దగ్ధం...

 సింగరేణి భవన్‌లో సంభవించిన అగ్ని ప్రమాదంలో సెల్లార్‌లో భద్రపరిచిన పాత రికార్డులన్నీ దగ్ధమయ్యాయి. అక్కడ ఉన్న వాహనాలు కాలిపోయాయి.  

 పోలీసుల దర్యాప్తు షురూ...
 ప్రమాద స్థలాన్ని సైఫాబాద్ ఏసీపీ సురేందర్‌రెడ్డి, నాంపల్లి సీఐ మధుమోహన్‌రెడ్డి పరిశీలించారు. షార్ట్‌సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం జరిగిందా? లేక ఎవరైనా సిగరెట్ తాగి పడేశారా, లేక రికార్డులను కాల్చివేయాలనే దురుద్దేశంతోనే తగులబెట్టారా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
 
 

Advertisement
Advertisement