కేసీఆర్ కు ఇన్నాళ్ల‌కు మ‌త్తు దిగిందా: పొన్నం ప్ర‌భాక‌ర్ | Sakshi
Sakshi News home page

కేసీఆర్ కు ఇన్నాళ్ల‌కు మ‌త్తు దిగిందా: పొన్నం ప్ర‌భాక‌ర్

Published Wed, Jun 29 2016 4:10 AM

కేసీఆర్ కు ఇన్నాళ్ల‌కు మ‌త్తు దిగిందా: పొన్నం ప్ర‌భాక‌ర్ - Sakshi

సాక్షి, హైదరాబాద్: హైకోర్టు విభజన, న్యాయాధికారుల సమస్యపై ఇప్పటిదాకా స్పందించని సీఎం కేసీఆర్ ఢిల్లీలో ధర్నా పేరుతో కొత్త డ్రామాకు తెర తీస్తున్నారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, టీపీసీసీ లీగల్‌సెల్ చైర్మన్ సి.దామోదర్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం విలేకరులతో వారు మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా న్యాయమూర్తులు రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేస్తుంటే, న్యాయవాదులు ఆత్మబలిదానాలకు సిద్ధపడుతుంటే సీఎంకు ఇప్పుడు మత్తు దిగిందా అని ప్రశ్నించారు.

తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించి కాంగ్రెస్  రాష్ట్రాన్ని ఇస్తే, కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ తెచ్చానని గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్ ఈ రెండేళ్ల నుంచి చిన్న హైకోర్టు విభజన కూడా ఎందుకు సాధించలేకపోయారని పొన్నం ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌కు న్యాయవాదుల జేఏసీ తొత్తుగా మారిందని, న్యాయమూర్తులను సస్పెండ్ చేసి తీవ్రస్థాయిలో వివాదానికి కారణమైన టీఆర్‌ఎస్‌ను న్యాయవాదులు ఎందుకు నిలదీయడం లేదని పొన్నం ప్రశ్నించారు. ఇప్పటికైనా అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి, కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. గురువారం అన్ని కోర్టుల వద్ద న్యాయవాదులు ధర్నా చేయాలని లీగల్‌సెల్ చైర్మన్ దామోదర్‌రెడ్డి పిలుపును ఇచ్చారు.  
 
పీవీ జయంతి వేడుకలు: మాజీ ప్రధాని పీవీ నర్సింహ్మారావు జయంతి వేడుకలు గాంధీభవన్, నెక్లెస్‌రోడ్డులో ఘనంగా జరిగాయి. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, పార్టీ నేతలు పొంగులేటి సుధాకర్ రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ పీవీకి నివాళులర్పించారు.

Advertisement
Advertisement