తుది తీర్పునకు లోబడే పీజీ మెడికల్ ప్రవేశాలు | Sakshi
Sakshi News home page

తుది తీర్పునకు లోబడే పీజీ మెడికల్ ప్రవేశాలు

Published Sun, May 29 2016 3:38 AM

తుది తీర్పునకు లోబడే పీజీ మెడికల్ ప్రవేశాలు - Sakshi

తేల్చి చెప్పిన హైకోర్టు
- వెబ్ కౌన్సెలింగ్ నిలుపుదలకు నిరాకరణ
- కౌంటర్లు దాఖలు చేయాలని ఎన్టీఆర్, కాళోజీ వర్సిటీలకు ఆదేశాలు
- జూన్ 3కు విచారణ వాయిదా
 
 సాక్షి, హైదరాబాద్: ఉభయ రాష్ట్రాల్లో పోస్టు గ్రాడ్యుయేట్(పీజీ) మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన వెబ్ కౌన్సెలింగ్ నిలుపుదలకు హైకోర్టు నిరాకరించింది. వెబ్ కౌన్సెలింగ్ యథాతథంగా కొనసాగించవచ్చునని స్పష్టం చేసింది. అయితే ఈ వెబ్ కౌన్సెలింగ్ ఆధారంగా జరిగే ప్రవేశాలన్నీ కూడా తమ ముందున్న వివిధ వ్యాజ్యాల్లో తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటాయని హైకోర్టు తేల్చి చెప్పింది. తదుపరి విచారణను జూన్ 3కు వాయిదా వేసింది. ఈ లోపు ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఎన్టీఆర్, కాళోజీ వైద్య విశ్వవిద్యాలయాలను ఆదేశించింది.

ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ ఎం.సీతారామమూర్తిలతో కూడిన ధర్మాసనం రెండు రోజుల కిందట ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ఆప్షన్లు ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాలు చేస్తూ డాక్టర్ ఎం.అపూర్వ తదితరులు ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. అదే విధంగా ప్రతిభ ఆధారంగా ర్యాంకులు సాధించిన అభ్యర్థులకు ర్యాంకు ఆధారంగా కాకుండా వారి కులం ఆధారంగా రిజర్వేషన్ కింద సీటు కేటాయిస్తుండటాన్ని సవాలు చేస్తూ డాక్టర్ అభిషేక్ మరికొందరు పిటిషన్లు దాఖలు చేశారు.

వీటన్నింటిపై న్యాయమూర్తి జస్టిస్ ఎ.వి.శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది కె.వి.సింహాద్రి వాదనలు వినిపి స్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఎస్‌ఎంఎస్ ఆప్షన్ల ఉత్తర్వుల వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందన్నారు. అలాగే ప్రతిభతో ర్యాంకు సాధించిన అభ్యర్థులకు వారి కుల రిజర్వేషన్ ఆధారంగా సీటు ఇస్తున్నారని, దీనివల్ల రిజర్వేషన్‌లో సీటు పొందే అభ్యర్థులకు నష్టం జరుగుతుందని తెలిపారు. వెబ్ కౌన్సెలింగ్‌లో స్టేట్ వైడ్ కాలేజీలను చూపడం లేదని, దీని వల్ల తీరని నష్టం జరుగుతోందని వివరించారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని వెబ్ కౌన్సెలింగ్‌ను నిలుపుదల చేయాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం, ఇప్పటికే రెండు దశల వెబ్ కౌన్సెలింగ్ పూర్తయినందున ఈ దశలో కౌన్సెలింగ్ నిలుపుదల సాధ్యం కాదని చెప్పింది. ఇప్పటికే వెబ్ కౌన్సెలింగ్ ద్వారా జరిగిన ప్రవేశాలు ఈ వ్యా జ్యాల్లో తాము వెలువరించబోయే తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement