పాత స్కీమ్‌కే కొత్త కలర్! | Sakshi
Sakshi News home page

పాత స్కీమ్‌కే కొత్త కలర్!

Published Sun, Nov 24 2013 5:21 AM

Old Scheme new color!

= ‘గ్రీన్ చానెల్’ పెరిట హెచ్‌ఎండీఏ హడావుడి
 = 20 రోజుల్లో అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు
 = తొలుత లేఅవుట్స్ అప్రూవల్‌తో ప్రారంభం

 
సాక్షి, సిటీబ్యూరో : ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ప్రభుత్వ విభాగాల్లో కొత్త విధానాలు, సరికొత్త స్కీంలను ప్రవేశపెట్టడం సర్వసాధారణం. ప్రత్యేకించి ఐఏఎస్ అధికారులు పరిపాలనలో తనదైన ముద్ర వేసేందుకు, ప్రభుత్వంలో మంచి గుర్తింపు పొందేందుకు గట్టిగా కృషి చేస్తుంటారు. అయితే... హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారుల తీరు మాత్రం ఇందుకు పూర్తి భిన్నం.

అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయలేక ఏకంగా జోనల్ వ్యవస్థకు మంగళం పలికిన హెచ్‌ఎండీఏ కమిషనర్ తాజాగా ‘గీన్ చానెల్’ పేరిట ఓ స్కీమ్‌ను అమలు చేసేందుకు హడావుడి చేస్తున్నారు. వివిధ అనుమతులకు సంబంధించి సత్వర పరిష్కారం కోసం ఈ పథకాన్ని ప్రవేశ పెడుతున్నట్లు ప్రభుత్వానికి నమ్మబలికి అనుమతి పొందారు. విచిత్రం ఏమిటంటే... గతంలో వైఎస్ హయాంలో ప్రవేశపెట్టిన ‘గ్రీన్ చానెల్’ స్కీమ్‌కే కాస్త అటూ ఇటు మార్పులు చేసి దాన్ని మళ్లీ కొత్తగా ప్రవేశ పెడుతున్నారు.

భవన నిర్మాణాలు, లేఅవుట్లకు సంబంధించి పర్మిషన్ల మంజూరులో జాప్యం లేకుండా చూసేందుకు అప్పట్లో వైఎస్ ఫాస్ట్ ట్రాక్ క్లియరెన్స్ కోసం 2009 జూన్ 18న ‘గ్రీన్ చానెల్’ స్కీమ్‌ను హెచ్‌ఎండీఏలో ప్రారంభించారు. ఆ తర్వాత పాలకులు పట్టించుకోకపోవడంతో అధికారులు ఆ స్కీమ్‌కు పాతర వేశారు. అయితే.. ప్రస్తుత కమిషనర్ హెచ్‌ఎండీఏలో తాను సంస్కరణలకు శ్రీకారం చుట్టినట్లు భ్రమ కల్పిస్తూ పాత స్కీంలకే కొత్త రంగులద్దుతుండటం గమనార్హం.
 
గ్రీన్ చానెల్ అంటే..


కొత్త లేఅవుట్లు, భవనాలకు సంబంధించి అనుమతుల మంజూరులో జాప్యాన్ని నివారించేదుకు ‘గ్రీన్ చానెల్’ను ప్రవేశపెట్టాలని హెచ్‌ఎండీఏ నిర్ణయించింది. ఇందులో భాగంగా లెసైన్స్‌డ్ ఆర్కిటెక్ట్స్, డాక్యుమెంట్ ఆడిటర్స్‌ను హెచ్‌ఎండీఏలో నమోదు చేసుకొంటారు. వీరి ద్వారా పరిశీలించిన దరఖాస్తులను హెచ్‌ఎండీఏ వెంటనే ఆమోదిస్తుంది. అనంతరం దరఖాస్తుదారు చెల్లించాల్సిన డెవలప్‌మెంట్ చార్జీలు, ఇతర పత్రాల వివరాలను 7 రోజుల్లోగా వారికి లేఖ ద్వారా తెలియజేస్తారు.

ఆ తర్వాత సంబంధిత పత్రాల స్వీకరణ, తనఖా వంటి  ప్రక్రియను పూర్తిచేసి వెంటనే తుది అనుమతి పత్రం అందిస్తారు. ఈ విధానాన్ని 20 రోజుల్లో అమల్లోకి తేవాలన్నది లక్ష్యం. తొలుత లేఅవుట్ అప్రూవల్ కోసం గ్రీన్ చానెల్ ప్రక్రియను ప్రవేశపెట్టాలనుకొంటున్నారు. ఇప్పటికే ఏపీ బార్‌కౌన్సిల్, కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్టివ్‌లతో సమావేశం నిర్వహించిన హెచ్‌ఎండీఏ త్వరలో టెండర్ ప్రక్రియ ద్వారా లెసైన్స్‌డ్ ఆర్కిటెక్ట్స్, డాక్యుమెంట్ ఆడిటర్లను నియమించేందుకు కసరత్తు చేస్తోంది. అయితే... ఈ లెసైన్స్‌డ్ ఆర్కిటెక్ట్స్, డాక్యుమెంట్ ఆడిటర్స్‌కు చెల్లించాల్సిన ఫీజును సైతం దరఖాస్తుదారు నుంచే వసూలు చేయాలని నిర్ణయించారు.
 
అపకీర్తిని తొలగించుకునేందుకే...
 
హెచ్‌ఎండీఏలో ఏ పని కావాలన్నా... చేయి తడపాల్సిందే! ఇక్కడ ప్రతి పనికీఓ రేటు ఉంటోందన్నది బహిరంగ రహస్యమే. పైసలివ్వనిదే ఫైల్ కదలదన్న అపకీర్తి చాలాకాలంగా ఉంది. ఇక్కడి సిబ్బందే కాదు... కొందరు అధికారులు సైతం ఆమ్యామ్యాలకే అధిక ప్రాధాన్యమిస్తారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎల్‌ఆర్‌ఎస్- బీపీఎస్ దరఖాస్తులకేగాక, కొత్త లేఅవుట్లు, నూతన భవనాలకు సంబంధించి అనుమతులు పొందాలంటే చెప్పులు అరిగిపోవాల్సిందే. ఈ అపకీర్తిని తొలగించుకొనేందుకు అధికారులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ‘గ్రీన్ చానెల్’ పేరిట పాత స్కీమ్‌నే తెరపైకి తెచ్చారని స్వయంగా హెచ్‌ఎండీఏ సిబ్బందే వ్యాఖ్యానిస్తున్నారు. ప్లానింగ్ విభాగంలో వేళ్లూనుకొన్న అవినీతిని అడ్డుకోకుండా ఇలాంటి ప్రయోగాలు ఎన్ని చేసినా ప్రయోజనం ఉండదంటున్నారు. అక్రమాలపై ఫిర్యాదులు అందినా పట్టించుకోని ఉన్నతాధికారులు పాత స్కీమ్ అమలుకు అర్రులు చాస్తుండటం వారి చిత్తశుద్ధికి అద్దం పడుతోంది.
 

Advertisement
 
Advertisement
 
Advertisement