చంద్రబాబుకు ముద్రగడ డెడ్‌లైన్ | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు ముద్రగడ డెడ్‌లైన్

Published Sat, May 28 2016 11:25 AM

చంద్రబాబుకు ముద్రగడ డెడ్‌లైన్ - Sakshi

ఆగస్టులోగా కాపులను బీసీలలో చేర్చాలని, లేనిపక్షంలో భారీ ఎత్తున ఉద్యమిస్తామని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం హెచ్చరించారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన డెడ్‌లైన్ విధించారు. కాపు ఉద్యమానికి మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఆయన పలువురిని కలుస్తున్నారు. అందులో భాగంగా శనివారం ఉదయం ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డిని, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు చిరంజీవిని కలిశారు. మధ్యాహ్నం దాసరి నారాయణరావును, ఆ తర్వాత వైఎస్ఆర్‌సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణను, రాత్రి కాంగ్రెస్ నాయకుడు సి.రామచంద్రయ్యను కూడా ముద్రగడ కలుస్తారు.

ముందుగా ఉద్యమానికి మద్దతిచ్చినందుకు రఘువీరాకు కృతజ్ఞతలు తెలిపారు. మంజునాథ కమిషన్ మధ్యంతర నివేదికను 9 నెలల్లోగా తెప్పిస్తామని చంద్రబాబు మాట ఇచ్చారని, ఆ సమయం ఆగస్టుకు పూర్తవుతుంది కాబట్టి అన్నమాట నిలబెట్టుకుని నివేదిక తెప్పించి, అసెంబ్లీలో దాన్ని ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగంలోని 9వ  షెడ్యూలులో ఈ అంశాన్ని చేర్చాలన్నారు. ఇప్పుడు కాకపోతే మరెప్పటికీ ఇది సాధ్యం కాదని ముద్రగడ చెప్పారు. కాగా.. కాపు రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని, పార్లమెంటులో కూడా అండగా ఉంటుందని రఘువీరారెడ్డి చెప్పారు.

Advertisement
Advertisement