ప్రగతి పద్దు... నిర్వహణ పద్దు | Sakshi
Sakshi News home page

ప్రగతి పద్దు... నిర్వహణ పద్దు

Published Sat, Jan 21 2017 3:33 AM

ప్రగతి పద్దు... నిర్వహణ పద్దు - Sakshi

  • 2017–18 బడ్జెట్‌కు కొత్త పద్దులు
  • కొత్త పద్ధతిలో ప్రతిపాదనలు కోరిన ఆర్థిక శాఖ
  • బడ్జెట్‌ ప్రతిపాదనలపై అన్ని శాఖలతో సీఎస్‌ సమీక్ష
  • సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ఈసారి కొత్త పంథాలో బడ్జెట్‌ను ఆవిష్కరించనుంది. ప్రణాళిక, ప్రణాళికేతర పద్దులను విలీనం చేయటంతో బడ్జెట్‌ను ప్రగతి పద్దు.. నిర్వహణ పద్దులుగా వర్గీకరించాలని నిర్ణయిం చింది. ప్రగతి పద్దులో ప్రభుత్వం వివిధ పథకాలు, కార్యక్రమాలకు ఇచ్చే సబ్సిడీలు, గ్రాంట్లు, స్కాలర్‌ షిప్‌లుంటాయి. నిర్వహణ పద్దులో జీత భత్యాలు(ఎస్టాబ్లిష్‌మెంట్‌), ఇతర నిర్వహణ, వడ్డీల చెల్లింపులుంటాయి. సీఎం కేసీఆర్‌ సూచన మేరకు బడ్జెట్‌లో కీలకమైన ఈ రెండు వ్యయ పద్దులకు పేర్లను ఖరారు చేశారు. ప్రభుత్వ పథకాలు, ప్రాధాన్యతలకు అనుగుణంగా కొత్త పద్దులకు అనుగుణంగా తమ ప్రతిపాదనలు సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ సింగ్‌ అన్ని శాఖల కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు.

    ఆర్థిక శాఖ కోరిన నిర్ణీత నమూనాను అనుసరించి ప్రతిపాదనలు తయారు చేయాలని సీఎస్‌ సూచించారు. 2017–18 బడ్జెట్‌ కసరత్తులో భాగంగా సీఎస్‌ శుక్రవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు ఎన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు అందాయని ఆరా తీశారు. మూడో వంతు విభాగాల నుంచే ప్రతిపాదనలు అందినట్లు ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి. అవి కూడా అసమగ్రంగా ఉన్నాయని తెలిపింది. దీంతో మిగతా శాఖలు సైతం వెంటనే ప్రతిపాదనలు తయారు చేసి పంపించాలని సీఎస్‌ సూచించారు. ఏయే ఖర్చులు ఏ పద్దులో ఉండాలి.. నిర్వహణ పద్దులో వేటిని పొందుపరచాలి.. ప్రగతి పద్దులో వేటికి చోటు కల్పించాలి.. అనే అంశంపై ఆర్థిక శాఖ.. సలహాలు సూచనలు స్వీకరించాలని కోరారు. కాగా కొత్త జిల్లాల ఏర్పాటుతో అన్ని విభాగాల్లో ఉద్యోగులపై పనిభారం పెరిగిందనే అంశం సమీక్షలో చర్చకు వచ్చింది.

Advertisement
Advertisement