అక్రమార్కులకు ‘ఉపాధి’ | Sakshi
Sakshi News home page

అక్రమార్కులకు ‘ఉపాధి’

Published Tue, May 3 2016 4:00 AM

అక్రమార్కులకు ‘ఉపాధి’ - Sakshi

♦ మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో నిధుల దుర్వినియోగం
♦ సామాజిక తనిఖీ(సోషల్ ఆడిట్)లో వెల్లడైన అవినీతి అక్రమాలు
 
 సాక్షి, హైదరాబాద్: ఉపాధి హామీ పథకం నిధులు అక్రమార్కులకు పలహారంగా మారాయి. మహబూబ్‌నగర్ జిల్లాలోనే పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయి. పంచాయతీరాజ్ కన్వెర్జెన్స్ పనుల కింద రాష్ట్రవ్యాప్తంగా గతేడాది గ్రామ పంచాయతీల్లో సిమెంట్ రోడ్లు, మురుగు కాల్వలు నిర్మించారు. ఆయా పనులకు కేటాయించిన ఉపాధి హామీ పథకం నిధుల వినియోగంపై ఇటీవల రెండు జిల్లాల్లో సామాజిక తనిఖీ నిర్వహించగా, భారీగా అక్రమాలు జరిగాయని వెల్లడైంది. సుమారు రూ.1.80 కోట్లు దుర్వినియోగం కాగా, మరో రూ.5.82 కోట్ల పనులకు లెక ్కలు చె ప్పేందుకు స్థానిక అధికారులు ముందుకు రాలేదు.

 మహబూబ్‌నగర్ జిల్లాలోనే అధికం
 మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో జరిగిన 344 కన్వర్జెన్స్ పనులపై సామాజిక తనిఖీ నిర్వహించాల్సిందిగా పంచాయతీరాజ్ డెరైక్టర్ సోషల్ ఆడిట్ బృందాలకు సూచించారు. ఆయా పనుల్లో రూ.5.82 కోట్ల విలువైన 69 పనులకు రికార్డులను అప్పగించేందుకు ఆయా జిల్లాల్లోని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు ససేమిరా అన్నారు. 247 పనులకుగాను రూ.17.95 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారుల లెక్కలు చూపగా, వాటిలో రూ.1.80 కోట్లు వివిధ రకాలు దుర్వినియోగమైనట్లు సోషల్ ఆడిట్ బృందం తేల్చింది.

అత్యధికంగా మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన 189 పనులకు రూ.13.11 కోట్లు ఖర్చు చేయగా, సుమారు 1.60 కోట్లు దుర్వినియోగమయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో జరిగిన 58 పనుల రికార్డులను పరిశీలించిన సామాజిక తనిఖీ అధికారులు రూ.20 లక్షలు అక్రమార్కులపరమైనట్లు తేల్చారు. యంత్రాలను వినియోగించడం, కూలీలకు చెల్లించిన నిధులు, వాస్తవంగా ఇచ్చిన మొత్తాలకు తేడాలు కనబడడం, కొలతల్లో వ్యత్యాసం తదితర అక్రమాలు చోటు చేసుకున్నాయని సోషల్ ఆడిట్ బృందం తేల్చింది.

Advertisement
Advertisement