45 తులాల బంగారం పైనే ఎత్తుకెళ్లారు.. | Sakshi
Sakshi News home page

45 తులాల బంగారం పైనే ఎత్తుకెళ్లారు..

Published Mon, Jan 26 2015 2:39 AM

45 tolas gold Jewelry theft

పోలీసులకు ఫిర్యాదు చేసిన యజమాని
నాగోలు: కిటికీ గ్రిల్స్ తొలగించి ఇంట్లోని నగలు చోరీ చేసి.. ఆపై నిప్పుపెట్టిన ఘటనలో 45 తులాలకు పైనే బంగారం చోరీ అయినట్టు తేలింది. అబూదాబీ నుంచి ఆదివారం ఉదయం నగరానికి వచ్చిన ఇంటి యజమాని గొట్టేటి గంగయ్య ఈ మేరకు ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి కథనం ప్రకారం...  ఎల్బీనగర్ నవోదయకాలనీకి చెందిన జి.గంగయ్య, సరళ  భార్యాభర్తలు. గంగయ్య అబూదాబీలో కెమికల్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. ఇతనికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు.

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన పెద్ద కుమారుడు రఘువీర్ పాలెం బస్సు ప్రమాదంలో చనిపోయాడు.  అమెరికాలో ఉంటున్న మరో కుమారుడు, కుమార్తె వద్దకు గంగయ్య భార్య గత సెప్టెంబర్‌లో వెళ్లింది. ఈ క్రమంలో ఆమె కొంత బంగారాన్ని లాకర్‌లో పెట్టి.. మిగతా 45 తులాల బంగారాన్ని ముంబైలో ప్రత్యేకంగా తయారు చేయించిన బీరువాలో భద్రపరిచి అమెరికా వెళ్లింది. ఇంటి బాధ్యతలను సమీపంలో ఉండే నల్లగొండ జిల్లా చందుభట్లకు చెందిన ఎల్లయ్యకు అప్పగించారు.

ఇదే ఇంట్లో సరళ సోదరి గంగ కొన్ని రోజులు ఉండి టెట్ పరీక్షకు సిద్ధమై వెళ్లిపోయింది. శనివారం తెల్లవారుజామున గంగయ్య ఇంట్లో నుంచి పొగ  రావడంతో స్థానికులు గమనించి ఫైరింజిన్, ఎల్బీనగర్ పోలీసులకు సమాచారం అందించారు. ఎల్లయ్య వచ్చి తాళం తీసి చూడగా ఇంట్లోని బీరువా పగులగొ ట్టి ఉంది. ఇంట్లోని   చీరలు, కంప్యూటర్, ఏసీ, ఇతర సామగ్రి అగ్నికి ఆహుతై ఉన్నాయి.

ఈ విషయాన్ని అబుదాబీలో ఉండే గంగయ్యకు సమాచారం అందించాడు. ఆదివారం ఇంటికి చేరుకున్న గంగయ్య బీరువాలో దాచిన 45 తులాల బంగారు నగలు, మూడు ల్యాప్‌టాప్‌లు, అర కేజీ వెండి,  మూడు కెమెరాలు చోరీకి గురైనట్టు  పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, ఇంత పెద్ద చోరీ జరిగినా పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితుడి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement