బతకరా బతకరా పచ్చగా | Sakshi
Sakshi News home page

బతకరా బతకరా పచ్చగా

Published Sun, Aug 13 2017 1:04 AM

బతకరా బతకరా పచ్చగా

సరిగ్గా యాభై ఏళ్లనాడు విడుదలైన సాక్షి సినిమాలో ‘అమ్మకడుపు చల్లగా అత్త కడుపు చల్లగా’ అంటూ సాగే పాట చిత్ర కథకు అత్యంత కీలకమైంది. వచనం రాసినా, పద్యం లేదా పాట రాసినా స్వీయ ముద్ర వున్న ఆరుద్ర యీ పాట రాశారు. ‘‘బతకరా బతకరా పచ్చగా... నీకు నేనుంటా వెయ్యేళ్లు తోడుగా నీడగా’’ అంటూ తమ వైవాహిక జీవితానికి హామీ యిస్తుంది కథానాయిక. ‘‘నా మెడలో తాళిబొట్టు కట్టరా... నా నుదుట నిలువుబొట్టు పెట్టరా...

నీ పెదవి మీద చిరునవ్వు చెరగదురా... నా సిగపూవుల రేకైనా వాడదురా...’’అని కావలసినంత నమ్మకం యిస్తుంది. ‘‘నల్లని అయిరేణికి మొక్కరా... సన్నికల్లు మీద కాలు తొక్కరా...’’ అని అర్థిస్తూ, నా నల్లపూసలే నీకు రక్షగా వుంటాయని ధైర్యం చెబుతుంది ఆ పెళ్లికూతురు.‘‘ఏడడుగులు నాతో నడరా...’’ ఆ తర్వాత యముడైనా మన మధ్యకు రాలేడని భరోసా యిస్తుంది. ఒక దుష్టుడికి వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్పిన హీరోకి గడ్డుకాలం వచ్చింది. శిక్ష పూర్తి చేసుకుని పకీరు తిరిగి వస్తున్నాడు. వస్తే సాక్షిని చంపేయడం ఖాయం.

ఆ పకీరు చెల్లెలే కథానాయిక. తను ఎప్పటి నుంచో∙యిష్టపడుతున్న వాడిని పెళ్లాడేస్తే, అన్న తన బొట్టు చెరిపేయడని, తాళి తెంపేయడని ఆమె నమ్మకం. అందుకే ముహూర్తాలు, ముచ్చటలు లేకుండా యీ హడావుడి పెళ్లి. ఆ జంట తప్ప ఆ గుళ్లో ఎవరూ లేరు. గుళ్లో వేణుగోపాలస్వామి ఈ పెళ్లికి సాక్షి, పెళ్లి కూతురే పెళ్లి తంతు నిర్వహిస్తుంది యీ పాటలో. పాటపరంగా, సన్నివేశపరంగా కంటతడి పెట్టించే సందర్భం.

పల్లవికి సరితూగే చరణాలను ఎక్కువ సమయం తీసుకోకుండా అందించారు ఆరుద్ర. సాక్షి బాపు తొలిచిత్రం. ఈ పాటను నృత్యదర్శకుడు లేకుండా బాపు స్వయంగా తీర్చిదిద్దారు. తూర్పుగోదావరి జిల్లా పులిదిండి గుళ్లో యీ పాటలను కేవలం మూడున్నర గంటలలో చిత్రీకరించారు. కృష్ణ, విజయనిర్మల నాయికా నాయకులు. ఆరుద్ర రాసిన వేలాది పాటల్లోంచి ఓ గుప్పెడు పాటల్ని వెలికి తీస్తే – అమ్మకడుపు చల్లగా పాట వుండి తీరుతుంది. యాభై ఏళ్ల తరువాత కూడా తరచుగా వినిపించే సంగీత భరితమైన సాహిత్యం కూడా.
– సంభాషణ: డా. వైజయంతి

Advertisement
Advertisement