నిజం నిగ్గు తేలింది! | Sakshi
Sakshi News home page

నిజం నిగ్గు తేలింది!

Published Sun, Nov 22 2015 2:21 AM

Law unfair

 అన్యాయం జరిగితే చట్టాన్ని ఆశ్రయించాలి అంటారు. కానీ ఆ చట్టమే అన్యాయం చేస్తే ఎవరికి చెప్పుకోవాలి? అది తెలియకే అల్లాడిపోయాడు స్టీవెన్ ట్రస్కాట్. కెనడాకి చెందిన స్టీవెన్‌కి చట్టం చెప్పలేనంత అన్యాయం చేసింది. స్టీవెన్ చిన్నప్పుడు చాలా చురుగ్గా ఉండేవాడు. చాలా తెలివైనవాడు. చదువులో ముందుండేవాడు. అలాంటి వాడి జీవితం ఉన్నట్టుండి తల్లకిందులై పోయింది. అతడి క్లాస్‌మేట్ లిన్ హార్పర్‌ని రేప్ చేసి చంపాడంటూ అతనిపై ఆరోపణ చేయడం జరిగింది. లిన్ కనిపించకుండా పోయిన రోజు, ఆమెకి తన సైకిల్‌పై స్టీవెన్ లిఫ్ట్ ఇవ్వడమే ఆ అనుమానానికి దారి తీసింది. అయితే తాను ఆమెని ఓ షాప్ దగ్గర దింపేశానని, తర్వాత ఆమె పట్ల ఏం జరిగిందో తనకు తెలియదని స్టీవెన్ ఎంత చెప్పినా ఎవరూ వినిపించు కోలేదు.
 
  ఏ ఒక్కరూ అతడిని కాపాడే ప్రయత్నం చేయలేదు. దాంతో 1959, సెప్టెంబర్ నెలలో న్యాయస్థానం స్టీవెన్‌కి మరణ దండన విధించింది. కుమిలిపోయాడు స్టీవెన్. చేసేదేమీ లేక మరణానికి సిద్ధపడిపోయాడు. అయితే అతడి వయసు అప్పటికి కేవలం పద్నాలుగేళ్లే కావడంతో, మరణశిక్షను జైలు శిక్షగా మార్చారు. కానీ జీవి తాంతం జైల్లోనే ఉండమని ఆదేశించారు. నాటి నుంచీ జైలు గోడల మధ్యే జీవ చ్ఛవంలా ఉన్నాడు స్టీవెన్. అయితే 2001లో, అంటే నలభయ్యేళ్లు దాటిన తర్వాత... తప్పుడు కేసుల్లో శిక్షలు అనుభవిస్తోన్న వారి గురించి ఓ కమిటీ వేయడం జరిగింది.
 
  స్టీవెన్ తన గోడును వాళ్ల దగ్గర వెళ్లబోసుకున్నాడు. దాంతో మళ్లీ విచారణ మొదలయ్యింది. చివరకు స్టీవెన్ నిర్దోషి అని తేలింది. 2007లో అతణ్ని విడుదల చేసి, 6.5 మిలియన్ డాలర్లను స్టీవెన్‌కు నష్ట పరిహారంగా ఇచ్చింది ప్రభుత్వం.‘‘నేను దోషిని కాదంటూ ఎంతో చెప్పాను. ఏడ్చాను. బతిమాలాను. ఎవరూ వినిపించుకోలేదు. ఇక మాట్లాడి లాభం లేదని మౌనంగా ఉండి పోతే ఇన్నేళ్ల తర్వాత విడుదల చేశారు. నేను నా జీవితాన్ని కోల్పోయినా, నిజం ఇప్పటికైనా నిగ్గు తేలినందుకు ఆనందంగా ఉంది’’ అని విడుదల కాగానే చెమ్మగిల్లిన కళ్లతో స్టీఫెన్ చెబుతుంటే... విన్నవారందరి మనసులూ జాలితో నిండిపోయాయి. 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement